logo

శ్రీగంధం దొంగలపై కాల్పులు

ముళబాగిలు తాలూకా కాశీపుర అటవీ విభాగంలో శ్రీగంధం చెట్లను నరికేందుకు వచ్చిన ఐదుగురు దుండగులపై అటవీశాఖ ఉద్యోగులు కాల్పులు జరిపారు.

Updated : 03 Jul 2024 06:28 IST

కర్ణాటకాంధ్ర  సరిహద్దులో కలకలం

కోలారు, న్యూస్‌టుడే : ముళబాగిలు తాలూకా కాశీపుర అటవీ విభాగంలో శ్రీగంధం చెట్లను నరికేందుకు వచ్చిన ఐదుగురు దుండగులపై అటవీశాఖ ఉద్యోగులు కాల్పులు జరిపారు. వారిలో.. కాల్లోకి తూటా వెళ్లడంతో తాయలూరు గ్రామానికి చెందిన భత్యప్ప పోలీసులకు దొరికిపోయాడు. మిగిలిన వారు పరారయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన భత్యప్ప అనే నిందితుడు ఐదుగురు సహచరులతో కలసి కర్ణాటకలోని ముళబాగిలు వచ్చినట్లు గుర్తించారు. వారంతా మంగళవారం ఉదయం అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని చూసిన గార్డు అనిల్, ఇతర సిబ్బంది తీవ్రంగా హెచ్చరించారు. లొంగిపోకుండా.. దాడి చేసేందుకు ప్రయత్నించగా వారు కాల్పులు జరిపారు. తూటా తగలడంతో భత్యప్ప దొరికిపోయాడు. అతన్ని చికిత్స కోసం ముళబాగిలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముళబాగిలు తాలూకా జమ్మనహళ్లి దొడ్డకెరె వద్ద 40 ఎకరాల్లో శ్రీగంధం సాగు చేస్తున్నారు. వేసవిలో చెట్లన్నీ ఎండిపోయాయి. చెరువులోనూ నీరు లేకపోవడంతో కొద్ది రోజులుగా వాటిని నరుక్కుని వెళుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ భద్రత కోసం సిబ్బందిని నియమించిందని అధికారులు తెలిపారు.


రాజధానిలో డ్రగ్స్‌ ముఠా

ఇద్దరు విదేశీయుల అరెస్టు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారనే ఆరోపణపై ఘనా దేశీయుడు సిరిల్‌ (23), నైజీరియాకు చెందిన ఇమ్మానుయేల్‌ (27) అనే వ్యక్తులను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువ చేసే ఎండీఎంఏ బిళ్లలు, ఇతర మత్తు పదార్థాలు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ బి.దయానంద విలేకరులకు వివరించారు. విద్యారణ్యపుర కేంద్రంగా చేసుకుని మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని గుర్తించి, దాడిచేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఆ ఇద్దరూ వ్యాపార, విద్య వీసాతో ఇక్కడికి వచ్చి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి గోవా, ముంబయి, దిల్లీ నుంచి మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు తెలిపారు. విద్యారణ్యపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గంజాయి ఘాటు..

కోణనకుంటె పోలీసు ఠాణా పరిధి నారాయణనగర దొడ్డకల్లసంద్ర చెరువు సమీపంలో గంజాయి విక్రయిస్తున్నాడనే ఆరోపణపై దీపాంజలినగరానికి చెందిన వికాస్‌ (23) అనే యువకుడిని స్థానిక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుంచి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కోడలు తీరుతో విసిగి..

అత్తామామల ఆత్మహత్య

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కుటుంబ కలహాల కారణంగా కోడలు ఇంటి నుంచి బయటకు వెళ్లిందనే బాధతో చివరికి ఆ ఇంట అత్తామామలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బెంగళూరు నగర బయ్యప్పనహళ్లిలో విషాదం నింపింది. ఆవేదనకు లోనైన అత్తామామ సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పాత బయ్యప్పనహళ్లికి చెందిన చంద్రశేఖర్‌ (56) ఆయన భార్య శారదా (46) పడక గదిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఊపిరి వదిలారని పోలీస్‌ అధికారులు వివరించారు. వారి కుమారుడు సూర్యప్రశాంత్‌ పెళ్లి తరువాత అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. చిన్న విషయాలకే కోడలు గొడవకు దిగుతూ వేరు కాపురం కోసం సూర్యప్రశాంత్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అందుకు భర్త అంగీకరించకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. పెద్దలు మాట్లాడినా వెనక్కి రాలేదు. కోడలు ఇంటికి రాదనే బాధతో చంద్రశేఖర్, శారదా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని