logo

ఉద్యాననగరికి రైల్వే వలయమార్గం!

నగర సంచార రద్దీ నియంత్రణకు నమ్మ మెట్రోతో పాటు ‘రింగ్‌ రైలు’ వ్యవస్థ తెరపైకి వచ్చింది. రూ.23 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.

Updated : 03 Jul 2024 06:23 IST

నగరాన్ని చుట్టేసే ‘రింగ్‌ రైలు’

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నగర సంచార రద్దీ నియంత్రణకు నమ్మ మెట్రోతో పాటు ‘రింగ్‌ రైలు’ వ్యవస్థ తెరపైకి వచ్చింది. రూ.23 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ ఈ పథక కార్యాచరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో పనులు పూర్తి చేయాలనేది ప్రాథమిక ఆలోచన. రింగ్‌ (వలయ) రైలు మార్గం 2025 మార్చినాటికి పూర్తి చేయడానికి వీలుగా ప్రతిపాదనలుంటాయి. ఇప్పటికే నగరం చుట్టూ రైలు మార్గం విస్తరించింది. ఈ వ్యవస్థను పూర్తిగా అనుసంధానం చేయాలని హెచ్‌.డి.దేవేగౌడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతిపాదించినా ఎందుకో వెనుకబడిపోయింది. ఆపై అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అసలేమీ పట్టించుకోలేదు. నగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా వి.సోమణ్ణ బాధ్యతలు చేపట్టాక ఈ అంశానికి ప్రాధాన్యమేర్పడింది. నమ్మ మెట్రో, సబర్బన్‌ రైలుతో పాటు ‘రింగ్‌ రైలు’ ఉత్తమ రవాణా వేదికగా గుర్తించారు. నగరం చుట్టూ 287 కిలోమీటర్ల పొడవునా రైళ్లను నడిపితే అనేక ప్రాంతాలకు రాకపోకలు సుగమమవుతాయి. దేవనహళ్లి, హీలలిగె, దొడ్డబళ్లాపుర, నెలమంగల, నిడవంద, సోలూరు, మాలూరు ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్‌ రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడం సులువని రైల్వే అధికారులు ఇదివరకే ప్రకటించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ గతంలోనూ ఓసారి ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఆదేశాలిచ్చారు. ప్రస్తుత రైలుమార్గాలను కొన్నిచోట్ల అనుసంధానం చేయాలి. దాని కోసం కొన్ని రైల్వే స్టేషన్ల నిర్మాణం, భూస్వాధీన ప్రక్రియ చేపట్టాలి. రానున్న మూడు దశాబ్దాలపాటు ట్రాపిక్‌ ఇక్కట్లు ఎదురుకాకుండా రింగరైలు సేవలందిస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని