logo

పాతికేళ్లకు దొరికిన దొంగ

గంగావతి పట్టణంలో ఓ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు పాతికేళ్ల తరువాత బంధించారు. ముగ్గురు దొంగలు కలిసి ఈ చోరీ చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌ మాళి తెలిపారు.

Updated : 03 Jul 2024 06:25 IST

పట్టుబడ్డ దొంగతో పోలీసులు

గంగావతి,న్యూస్‌టుడే: గంగావతి పట్టణంలో ఓ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు పాతికేళ్ల తరువాత బంధించారు. ముగ్గురు దొంగలు కలిసి ఈ చోరీ చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌ మాళి తెలిపారు. వీరిలో ఇద్దరిని అప్పట్లోనే బంధించినట్లు చెప్పారు. కొప్పళ తాలూకా కర్కిహళ్ళికి చెందిన శివప్ప హరిజన పాతికేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్నట్లు చెప్పారు. ఈ వ్యక్తిని కర్కిహళ్ళిలో మంగళవారం బంధించి న్యాయాంగ కస్టడీకి అప్పగించినట్లు పేర్కొన్నారు.


ప్రేమ కాదన్నారని..యువతి ఆత్మహత్య

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఆమె ఓ అబ్బాయి ప్రేమలో మునిగిపోయింది. ఆ వ్యవహారాన్ని తల్లిదండ్రులు తప్పుపట్టారు. ప్రేమంటూ భవితను వృథా చేసుకోవద్దంటూ హితవు పలికారు. వారి స్పందన జీర్ణించుకోలేక మోహన్‌కుమారి (19) అనే యువతి సోమవారం రాత్రి మాదనాయకనహళ్లి పోలీసుఠాణా పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు ఇటీవలే తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. ఇక్కడ ఉంటే ఇబ్బందని గుర్తించి బంధువుల ఇంట్లో ఆశ్రయం కల్పించి, చదువుకు ఆటంకం లేకుండా కళాశాలకు పంపించారు. వారి కట్టడిని జీర్ణించుకోలేక సోమవారం రాత్రి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.


పోలీసు ఇంట్లో దొంగలుపడ్డారు

మైసూరు: జిల్లా ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. హుణసూరు తాలూకా బిళికెరె ఠాణాకు కూతవేటు దూరంలో ఉన్న పోలీసుల వసతిగృహంలోనే దొంగతనం జరిగింది. కేఆర్‌నగర ఠాణాలో కానిస్టేబుల్‌ విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి వచ్చిన నిందితులు వస్తువులు, నగదుతో పరారయ్యారని అధికారులు మంగళవారం వెల్లడించారు.


కర్ణాటక ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ

ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

మృతుడు రాజశేఖర్‌

ఉరవకొండ: ఉరవకొండ మండలం పెన్నహోబిలం వద్ద ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం.. అనంతపురానికి చెందిన క్యాటరింగ్‌ కూలీ రాజశేఖర్‌ (26) అతని భార్య గీత, వరుసకు మామ అయిన ఓబులేశ్‌తో కలిసి పెన్నహోబిలానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి అనంతపురం వెళ్తుండగా పెన్నహోబిలం వద్ద వేగంగా వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు వారిని ఢీ కొట్టింది. రాజశేఖర్, ఓబులేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజశేఖర్‌ మృతి చెందాడు.  


వరకట్న వేధింపులతో హత్య

నేత్ర (పాతచిత్రం)

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే : బొమ్మనహాళ్‌ మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన నేత్ర(30) హత్యకు గురైనట్లు మంగళవారం ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటకలోని చెళ్లికెర తాలూకాలో బోగనహాళ్‌ గ్రామానికి చెందిన నేత్రకు శ్రీరంగాపురం క్యాంపువాసి వెంకటేశులుతో వివాహమైంది. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి కాపురం కొన్ని సంవత్సరాలు సాఫీగా సాగింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదనపు వరకట్నం కోసం నేత్రను భర్త, అత్త, ఆడపడుచు తరచూ వేధించేవారు. ఈ క్రమంలో ఆ ముగ్గురూ కలసి తమ కుమార్తెను కొట్టి చంపి, ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించి సోమవారం బళ్లారి విమ్స్‌ ఆసుపత్రికి తరలించారని నేత్ర తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త వెంకటేశులు, అత్త, ఆడపడచుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని