logo

అసమ్మతి గాయానికి కాంగ్రెస్‌ శస్త్రచికిత్స

కాంగ్రెస్‌లో లుకలుకలు వీధిన పడే స్థాయికి చేరుకున్నాయి. పార్టీలో ఒకరిద్దరు నాయకులకు మద్దతుగా నిలిచే క్రమంలో వారి అనుచరగణం పార్టీలోని వ్యవస్థాగత అంశాలను రచ్చకీడిస్తూ అధిష్ఠానాన్ని ఇరుకున పడేస్తోంది.

Published : 02 Jul 2024 02:05 IST

నేతల దూకుడుకు కళ్లెం
మంత్రివర్గ విస్తరణ చర్యలు

ఈనాడు, బెంగళూరు : కాంగ్రెస్‌లో లుకలుకలు వీధిన పడే స్థాయికి చేరుకున్నాయి. పార్టీలో ఒకరిద్దరు నాయకులకు మద్దతుగా నిలిచే క్రమంలో వారి అనుచరగణం పార్టీలోని వ్యవస్థాగత అంశాలను రచ్చకీడిస్తూ అధిష్ఠానాన్ని ఇరుకున పడేస్తోంది. ఓ వైపు లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యం, మరోవైపు అదనపు ఉపముఖ్యమంత్రుల కోసం పట్టు, మంత్రివర్గంలో చోటు.. ఇలా వివిధ లక్ష్యాలతో పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత లోగుట్టు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ రాష్ట్ర నాయకత్వాన్నే మార్చాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. దిల్లీలో మూడురోజుల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఈ పరిణామాలను పార్టీ పెద్దల ముందు ఉంచగా త్వరలో ఓ పరిష్కారం చూపుతామన్న భరోసాతో వెనక్కు వచ్చారు. బెంగళూరుకు వచ్చీ రాగానే అటు ముఖ్యమంత్రి, ఇటు ఉపముఖ్యమంత్రి.. పార్టీలోని సున్నితమైన అంశాలపై స్పందించారు.

ఆది నుంచి అదే..

పేరుకు 135 స్థానాలతో అధికారాన్ని చేపట్టిందనే కానీ సిద్ధరామయ్య సర్కారుకు మునుపటిలా స్థిరత్వం దక్కలేదు. ఆయనకు మరోసారి పదవి అంత సులువుగా చేతికందలేదు. డీకే శివకుమార్‌తో తీవ్రమైన పోటీని ఎదుర్కొని ఎట్టకేలకు నెగ్గిన ఆయన సర్కారును ఏర్పాటు చేశారు. ఓ వైపు ఐదు గ్యారంటీలను మోస్తూనే పార్టీలో సీనియర్లు, జూనియర్లను సమన్వయపరుస్తూ ఏడాది కాలాన్ని ముగించారు. ఈలోగా ఖజానా ఖాళీ అవుతున్న హెచ్చరికలు రావటంతో ఆర్థిక వనరులను సమకూర్చే పనిలో పడ్డారు. వీటికి తోడు లోక్‌సభ ఎన్నికలు పలుకరించటంతో సర్కారు దాదాపు నాలుగు నెలల పాటు స్తబ్దంగా మారింది. ఆ ఎన్నికల్లోనైనా ఆశించిన స్థానాలు గెలిచారా.. అనుకుంటే అదీ లేదు. అధికారంలో ఉండి కూడా కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమయ్యారు. ఈ వైఫల్యమే పార్టీలో ఏడాదిగా చాపకింద నీరులా ఉన్న సమస్యలను బయటపడేలా చేసింది. ఎమ్మెల్యేలకు తగిన నిధులు ఇవ్వకపోవటం, అన్ని వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవటం, కొందరే నాయకులుగా ఎదగాలని ప్రయత్నించటం, మంత్రులుగా ఉన్నవారి వారసులకు టికెట్లు ఇవ్వటం, వారంతా పూర్తి స్థాయిలో విజయం సాధించక పోవటం.. ఇలా ప్రతి అంశం కాంగ్రెస్‌ సర్కారుకు సవాళ్ల వలయంగా మారిపోయింది. సరిగ్గా ఇదే పరిణామాలను సాకుగా చేసుకుని కొందరు నేతలు తమ డిమాండ్లకు పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకరిలా.. మరొకరలా

రెండున్నరేళ్లు లేదా లోక్‌సభ ఎన్నికలు.. ఆ తర్వాత అధికార పంపిణీ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ ప్రకటించలేదు. అధిష్ఠానం ఏరోజూ ఈ పంపిణీ వ్యవహారంపై నోరు విప్పలేదు. పార్టీలో సీనియర్లైన రాజణ్ణ, సతీశ్‌ జార్ఖిహొళి వంటి నేతలు నేరుగా ఉపముఖ్యమంత్రి పదవులతో పాటు ఏకంగా సీఎం స్థానాలకు కూడా మేము అర్హులమని చెబుతుండగా, కొందరు ఎమ్మెల్యేలు అధికార పంపిణీ చేయాలని పట్టుబడుతున్నారు. మరోవైపు.. కెంపేగౌడ జయంతి ఉత్సవాల వేదికపై ఒక్కలిగ మఠాధిపతి చంద్రశేఖర స్వామీ కూడా అధికార పంపిణీ ప్రస్తావన తెచ్చారంటే కాంగ్రెస్‌లో చెలరేగిన నాయకత్వ మార్పు చిచ్చు ఏ స్థాయికి చేరుకుందో తెలుస్తోంది. లింగాయత్, ఎస్‌సీ, ఎస్‌టీ, అల్ప సంఖ్యాక సముదాయాల నేతలంతా తమకు తాము ఉపముఖ్యమంత్రి అవ్వాలంటూ మనసులో మాట వెళ్లగక్కుతున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మధ్య అంతరాన్ని పెరిగేలా చేస్తున్నాయి.

అధిష్ఠానం స్పందన

పార్టీలో చోటు చేసుకుంటున్న విషయాలను డీకే శివకుమార్‌ గత ఆదివారం ఏఐసీసీ పెద్దలకు వివరించారు. వారిచ్చిన సూచనలను అమలు చేసే దిశగా సోమవారం కీలకమైన ప్రకటనలు చేశారు. ఇందులో బహిరంగ వ్యాఖ్యలు చేసిన వారికి తాఖీదులు, మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేపడతామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక తనపై నోరు జారుతున్న నేతల దూకుడుకు కళ్లెం వేయాలన్న సంకల్పం కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారంపై ఆచితూచీ స్పందించారు. అధికార పంపిణీ వ్యవహారమంతా అధిష్ఠానం చేతుల్లోనే ఉందన్న ఆయన మంత్రివర్గ విస్తరణతో పాటు చంద్రశేఖర స్వామీ తాను తప్పుకోవాలన్న వ్యాఖ్యలపైనా స్పందించేందుకు నిరాకరించారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ సమస్యలను ఒంటరిగా పరిష్కరించలేని ఆయన హస్తిన వైపు చేయి చూపి తప్పించుకున్నారు.

విస్తరణ సాధ్యమేనా?

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో స్థానాలు గెలవలేకపోయిందని పదేపదే చెబుతున్న డీకే శివకుమార్‌ అందుకు దారితీసిన కారణాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. అధికారంలో ఉన్నాం.. పైగా విపక్షం అంత బలంగా లేదు.. పైపెచ్చు మోదీ ప్రభావం అంతంత మాత్రమే.. భాజపా మాదిరిగా పార్టీలో లొసుగులు కూడా లేవు. మరోవైపు గ్యారంటీలు ప్రజలపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ పార్టీ ఆశించిన స్థాయిలో గెలవలేదంటే అందుకు మరేదో కారణం ఉండి తీరాలి. అదేదో గుర్తించేందుకు ప్రత్యేక సమితిని ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐసీసీ నుంచి కూడా మరో సమితి ఫలితాలపై నిగ్గు తేల్చేందుకు ఓ బృందాన్ని పంపనుంది. ఈ సమీక్షలో తేలే వాస్తవాల అధారంగా మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేకపోలేదు. జిల్లా, బ్లాక్‌ స్థాయిలో నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవటమే రెండంకెల స్థానాల విజయాన్ని దూరం చేసిందని పీసీసీ అంచనా వేస్తోంది. మరోవైపు మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న సీనియర్లకు గౌరవప్రదమైన పదవులు ఇచ్చి కొత్తతరం వారికి అవకాశాలిచ్చేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వినయ్‌ కులకర్ణి, బాలకృష్ణ, బి.ఆర్‌.పాటిల్‌ వంటి ఎమ్మెల్యేలు మలివిడత విస్తరణలోనైనా అవకాశాలు దక్కాలని ఎదురుచూస్తున్నారు. ఇన్నేసి పరిణామాలు చోటు చేసుకోవాలంటే అంతకు ముందుగా గతంలో రామకృష్ణ హెగ్డే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాలేదని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చరిత్ర కూడా నేడు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

బెంగళూరు పీసీసీ కార్యాలయంలో కీలక నేతల  సమావేశాన్ని దీపం వెలిగించి ప్రారంభిస్తున్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తదితరులు

స్థానిక సమరానికి సై

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రానున్న పాలికె, జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఇక్కడ కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కీలక నేతల సమావేశంలో మాట్లాడారు. ఆశించిన స్థాయిలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాకపోయినా పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. కార్యకర్తల పార్టీగా కాంగ్రెస్‌ను తీర్చిదిద్దుతామన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఇప్పటి నుంచే ఎక్కడికక్కడ పథకాన్ని సిద్ధం చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలను వెతకడానికి సత్యశోధన సమితులు ఏర్పాటు చేస్తామంటూ సంబంధిత తీర్మానాన్ని ప్రకటించారు. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. చెన్నపట్టణ, సండూరు, శిగ్గావి విధానసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలపై దృష్టి సారించాలని తీర్మానించారు. ఐదు గ్యారంటీ పథకాలపై ప్రచారం చేయాలని, ఇంటింటికీ కార్యకర్తలు వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు ఆంజనేయ, రమానాథ్‌ రై, మాజీ ఎంపీ ఉగ్రప్ప, కార్యాధ్యక్షుడు చంద్రశేఖర్, వినయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దూరంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని