logo

సమాజసేవకు వైద్యుల పెద్దపీట

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సమాజ సేవకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.

Published : 02 Jul 2024 02:00 IST

డాక్టర్‌ బీసీ రాయ్‌ పురస్కారాలు అందుకున్న వైద్యులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సమాజ సేవకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. నర్సింగ్‌హోమ్‌లకు వెళ్లలేని వారే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని గుర్తుంచుకోవాలన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య శాఖ విధానసౌధ బాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ వైద్యులకు పురస్కారాలు ప్రదానం చేసి మాట్లాడారు. వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని పాటించి, రోగుల ప్రాణాలను కాపాడితే దేవునిగా పూజలు అందుకుంటారని చెప్పారు వృత్తిలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించినా, రోగులకు ప్రాణాపాయం వస్తుందన్నారు. రోగాలు పెరగకుండా, ప్రజల్లో ఆరోగ్య జాగృతికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నారు. మహమ్మారి సమయంలో వైద్యుల సేవలను ఎవరూ మర్చిపోలేదన్నారు. సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని తెలిపారు. చికిత్సకు వచ్చే రోగికి ముందుగా ఆత్మస్థైర్యాన్ని నింపాలని కోరారు. డెంగీ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిసరాల సురక్షతకు పెద్ద పీట వేయాలని పిలుపునిచ్చారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే, ఆరోగ్య సమస్యలు ఎదురుకావని చెప్పారు. తాను గతంలో సిగరెట్టు తాగేవాడినని, దాంతో ఆంజియోప్లాస్టి చేయించుకోవలసి వచ్చిందన్నారు. ఆహార, జీవనశైలి మార్పులతోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని గుర్తు చేశారు. వైద్యుల భవన్‌ నిర్మాణానికి కావలసిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్‌ అహ్మద్, గ్యారంటీల జారీ సమితి అధ్యక్షుడు హెచ్‌ఎం రేవణ్ణ, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంటీ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హర్షగుప్త, వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ వివేక్‌ దొరె తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని