logo

కమలదళంలో కలహాల సెగ

అధికార పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి వివాదం తారస్థాయికి చేరుకోగా.. కమలదళంలోనూ అంతర్గత కలహాలు పొడచూపుతున్నాయి.

Published : 02 Jul 2024 01:58 IST

అశోక్‌ను సత్కరిస్తున్న నిర్మలానందనాథ స్వామి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : అధికార పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి వివాదం తారస్థాయికి చేరుకోగా.. కమలదళంలోనూ అంతర్గత కలహాలు పొడచూపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చేలా పార్టీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర శ్రమించలేదని కీలక నాయకుడు బీఎల్‌ సంతోశ్‌ వర్గానికి చెందిన ప్రముఖులు ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. విజయేంద్రను తప్పించి, ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సీటీ రవికి ఇప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించడంలో విపక్ష నేత ఆర్‌.అశోక్‌ విఫలయమ్యారని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. అశోక్‌ను తప్పించి, కార్కళ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీల్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తనపై లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ నాయకులు ఎవరూ సరైన విధంగా స్పందించి, తనకు మద్దతు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప అసంతృప్తితో ఉన్నారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై జాతీయ స్థాయి నాయకులను గత వారం కలసి వివరణ ఇచ్చారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా విపక్ష నాయకుడు, అధ్యక్షుని స్థానంలో మార్పులు చేయాలని పార్టీ జాతీయ నాయకులు యోచిస్తున్నట్లు సమాచారం. వర్షాకాలం శాసనసభ సమావేశాలు జులై 15-26 మధ్యలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపక్ష నాయకుడి స్థానం నుంచి తప్పిస్తారన్న వార్తలు బయటకు రాగానే.. అశోక్‌ సోమవారమే ఆదిచుంచనగిరి మఠాధిపతిని కలిసి చర్చించారు. ఒక్కలిగ నాయకులు, మఠాధిపతుల ద్వారా తన పదవిని కాపాడుకునేందుకు విపక్ష నాయకుడు తన ప్రయత్నాలను కొనసాగిస్తారని సమాచారం.

నిఖిల్‌కు మద్దతిస్తా: యోగీశ్వర్‌

రామనగర: చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో నిఖిల్‌ కుమారస్వామి పోటీ చేస్తే నేను మద్దతిస్తానని మాజీ మంత్రి సీపీ యోగీశ్వర్‌ ప్రకటించారు. తనకు పూర్తి మద్దతు ఇస్తానని కుమారస్వామి ప్రకటిస్తే.. నేనే బరిలో నిలుస్తానని చెప్పారు. దీనిపై తాను ఇప్పటికే కుమారస్వామితో మాట్లాడానని, ఒక వారంలో దీనిపై స్పష్టత వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని