logo

నిరాధార వార్తలతో కీడు

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతున్న అబద్ధపు వార్తలతో సమాజానికి కీడు వాటిల్లుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 02 Jul 2024 01:56 IST

 సిద్ధరామయ్యకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతున్న అబద్ధపు వార్తలతో సమాజానికి కీడు వాటిల్లుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రించేందుకు ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక విభాగాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అబద్ధపు వార్తలు సమాజంలో విద్వేషాలను, అల్లర్లను సృష్టిస్తాయని చెప్పారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం, సమాచార శాఖ సంయుక్తంగా నిర్వహించిన పత్రికా దినోత్సవాన్ని సోమవారం ఆయన బెంగళూరులో ప్రారంభించి మాట్లాడారు. మంగళూరులో 1841 జులై ఒకటిన బాసెల్‌ మిషన్‌ సంస్థ తమ మత ప్రచారానికి మొదటిగా పత్రికను కన్నడలో ప్రచురించిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో పత్రికలు, పాత్రికేయుల నిష్ఠ ఎక్కువని ప్రశంసించారు. సమాజంలోని లోపాలను సరిదిద్ది సరైన మార్గంలో పెట్టే సామర్థ్యం పత్రికలకు ఉందని సీనియరు విలేకరి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. కేరళలో అబద్ధపు వార్తలను గుర్తించి, అడ్డుకునే అంశంపై ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఒక పాఠం ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్‌ అహ్మద్, ఎమ్మెల్సీ యూబీ వెంకటేశ్, ముఖ్యమంత్రి మాధ్యమ సలహాదారు కేవీ ప్రభాకర్, అధికారులు డాక్టర్‌ కేవీ త్రిలోక్‌చంద్ర, సూరళ్‌కర్‌ వికాస్‌ కిశోర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఇది సరైన వేదిక కాదు

ముఖ్యమంత్రి మార్పు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిరాకరించారు. ప్రభుత్వ పనితీరుకు సంబంధించి అడిగే ప్రశ్నలకు సంబంధించి తాను బదులిస్తానని అన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చించే విషయాలపై మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదన్నారు. మార్పులు ఏమైనా ఉంటే పార్టీ హైకమాండ్‌ ప్రకటిస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని