logo

ఐదు నెలల నుంచి వేధింపులు

నటి పవిత్రాగౌడకు రేణుకాస్వామి గత ఐదు నెలల నుంచి నిత్యం అశ్లీల సందేశాలు, చిత్రాలు, వీడియోలు పంపించాడని సిట్ అధికారులు గుర్తించారు.

Published : 01 Jul 2024 06:53 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: నటి పవిత్రాగౌడకు రేణుకాస్వామి గత ఐదు నెలల నుంచి నిత్యం అశ్లీల సందేశాలు, చిత్రాలు, వీడియోలు పంపించాడని సిట్ అధికారులు గుర్తించారు. దర్శన్‌ను అతని భార్య విజయలక్ష్మితో కలిసి ఉండేందుకు నువ్వే అడ్డు అంటూ దూషణలకు పాల్పడ్డాడు. హత్యకు గురైన రేణుకాస్వామి చరవాణి ఇప్పటికీ పోలీసులకు లభించలేదు. న్యాయస్థానం అనుమతితో అతని దాఖలాలను ఉపయోగించి కొత్త సిమ్‌ కార్డును పోలీసులు కొనుగోలు చేశారు. దాని ఆధారంగా అతని చరవాణిలోని డేటాను పోలీసులు రాబట్టారు. సుమారు 200 అశ్లీల చిత్రాలను పవిత్రా గౌడకు అతను పంపించాడు. రేణుకాస్వామి వేధింపులు భరించలేక తమ ఇంట్లో ఉంటున్న పవన్‌కు మొదట ఈ విషయాన్ని ఆమె చెప్పింది. దర్శన్‌కు చెప్పవద్దని సూచించినా, పవన్‌ అన్ని విషయాలను చెప్పడంతో విషయం తీవ్రమైంది. తన స్నేహితురాలిని వేధించాడన్న క్రోధంతో తన సహచరులతో కలిసి చేసిన దాడిలో రేణుకాస్వామి హతమయ్యాడు.


పుస్తకాలు తెప్పించుకున్న దర్శన్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌ కారాగారానికి చేరి ఆదివారానికి తొమ్మిదో రోజు. కారాగారంలో ఎవరితోనూ మాట్లాడకుండా ఎక్కువ సమయం ఆయన ఒంటరిగా గడుపుతున్నాడు. రాత్రుళ్లు ఎక్కువ సమయం మెలకువతోనే ఉంటున్నాడని కారాగార సిబ్బంది గుర్తించారు. కారాగారంలోని గ్రంథాలయాల నుంచి హారర్‌ కథలున్న పుస్తకాలను ఆయన తెప్పించుకున్నారు. ఆదివారం కావడంతో ఖైదీలకు మాంసాహారాన్ని అందించారు. తనకు నిత్యం మాంసాహారాన్ని ఇప్పించాలని ఆయన సిబ్బందిని కోరుతున్నాడు. న్యాయస్థానం అనుమతి లేకపోవడంతో వారంలో రెండుసార్లు మాత్రమే దర్శన్‌కు మాంసాహారం లభిస్తోంది. నటుడు దర్శన్‌ కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయమై నటుడు శివరాజ్‌ కుమార్‌ ఆదివారం స్పందించారు. ‘అంతా తలరాత. దాని నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం’ అని అన్నారు.


‘దెయ్యాన్ని పూజించే వారూ ఉంటారు’

కోలారు, న్యూస్‌టుడే: దేవుడ్ని పూజించినట్లే దెయ్యాన్ని పూజించేవారు కూడా ఉంటారని నిర్మాత ఉమాపతి వ్యాఖ్యానించారు. హత్య చేసి కారాగారానికి వెళ్లిన వ్యక్తికి ఇచ్చిన ఖైదీ నంబరును వాహనాలపై రాయించుకోవడం, ఒంటిపై పచ్చ వేయించుకునేవారు దురభిమానులని అన్నారు. నటుడు దర్శన్‌తో ఆయన రాబర్ట్‌ సినిమా తీశారు. అనంతరం వారిద్దరి మధ్య వేర్వేరు అంశాల్లో వైరం పెరిగింది. తప్పు చేయకపోతే ఆయన నిర్దోషిగా వస్తారని, ఈలోగా అభిమానులు కారాగారానికి వెళ్లి ఆయనను పరామర్శించాలని అనుకోవడం సరికాదని దర్శన్‌ అభిమానులకు ఉమాపతి హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు