logo

Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ

ముఖ్యమంత్రి మార్పు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్‌లో నేతల మధ్య వాగ్యుద్ధం తీవ్రమైంది.

Updated : 01 Jul 2024 07:08 IST

ఆగని నేతల మాటల యుద్ధం

ఖర్గేతో చర్చిస్తున్న శివకుమార్‌ 

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మార్పు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్‌లో నేతల మధ్య వాగ్యుద్ధం తీవ్రమైంది. దీనిపై ఎవరూ మాట్లాడవద్దని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు డీకే శివకుమార్‌ హెచ్చరించినా, నాయకుల నోటికి తాళం పడలేదు. ముఖ్యమంత్రి స్థానాన్ని లింగాయతలకు ఇవ్వాలని కొందరు మఠాధిపతులు డిమాండ్‌ చేయగా, డీకే శివకుమార్‌కు కేటాయించాలని విశ్వ ఒక్కలిగర పీఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామి నేరుగా సిద్ధరామయ్యకే సూచించారు. ఇప్పటి వరకు దళితులకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదని, ఈసారి వారికే మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి నరేంద్రస్వామి కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. గ్యారంటీలతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, మహర్షి వాల్మీకి షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధి కార్పొరేషన్‌ అక్రమాలు, పాలు, ఇంధన ధరల పెంపును ప్రధాన అస్త్రాలుగా చేసుకుని భాజపా, దళ్‌ ప్రభుత్వంపై పోరును కొనసాగించాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి మార్పు, ఉప ముఖ్యమంత్రుల సంఖ్య పెంపు విమర్శలు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గపు నేతలుగా గుర్తింపు పొందిన వారే ఈ వివాదాన్ని రాజేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తన సన్నిహితుల వద్ద ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని హస్తినలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆదివారం భేటీ అయి రాష్ట్రంలో తాజాగా నెలకొన్న వివాదాన్ని శివకుమార్‌ వివరించారు. సిద్ధరామయ్యకు సన్నిహితంగా ఉండే ఎంబీ పాటిల్, నరేంద్ర స్వామి, జమీర్‌ అహ్మద్‌ ఖాన్, రాజణ్ణ తదితరులే ముగ్గురు ఉపముఖ్యమంత్రుల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. పార్టీ సీనియరు నాయకులు సోనియా, రాహుల్‌లతో చర్చించి, వివాదాన్ని పరిష్కరిస్తానని శివకుమార్‌కు ఖర్గే భరోసా ఇచ్చి పంపించారు.

ఒక పదవిని వదులుకోవాలి

కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమితికి డీకే శివకుమార్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దానితో పాటు ఉప ముఖ్యమంత్రిగానూ కొనసాగుతున్నారు. రెండు పదవుల్లో ఒకదాన్ని వదులుకోవాలని శివుడికి హోం శాఖ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ పరోక్షంగా చెప్పారు. మంత్రి పదవిని నిర్వహిస్తున్న సమయంలో పార్టీని సమన్వయం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. కర్ణాటకలో అత్యధిక సమయం కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించిన తనకు సమన్వయానికి సంబంధించిన సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అదనపు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి తాను ఒకసారి కూడా పార్టీ పెద్దల వద్ద మాట్లాడలేదన్నారు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఇక్కడి నేతల కన్నా, అధిష్ఠానానికే బాగా తెలుసని అన్నారు. ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే మినహా తానే కేపీసీసీకి అధ్యక్షుడిగా కొనసాగాలని శివకుమార్‌ కోరుకుంటున్నారు. శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించి, ఎంబీ పాటిల్‌ లేదా సతీశ్‌ జార్ఖిహొళి ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ ఆ స్థానం ఖాళీ అయితే దాన్ని తన ఆప్తుడు డాక్టర్‌ హెచ్‌సీ మహదేవప్పకే దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారు.

నేనే ముఖ్యమంత్రిని

ఈసారి ఎన్నికల అనంతరం (2028) తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానని మంత్రి సతీశ్‌ జార్ఖిహొళి కొత్త బాంబు పేల్చారు. ఇప్పటి వరకు దళితులకు ముఖ్యమంత్రిగా సేవలు అందించేందుకు అవకాశం రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించిన చర్చ అనవసరం అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హెచ్‌సీ మహదేవప్ప బెళగావిలో ఆదివారం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి స్థానం ఖాళీగా లేదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

హై మాత్రమే ఉంది, కమాండ్‌ లేదు

కాంగ్రెస్‌లో కేవలం ‘హై’ మాత్రమే ఉందని, పార్టీ నేతలపై ఎవరికీ ‘కమాండ్‌’ లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హుబ్బళ్లిలో వ్యాఖ్యానించారు. అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, ధరల పెంపును కూడా ఆ పార్టీ అధిష్ఠానం ప్రశ్నించలేకపోతోందని ఎద్దేవా చేశారు. ముగ్గురు డీసీఎంలు అవసరమని వస్తున్న డిమాండ్ల వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారని తెలిసినా, స్పందించేందుకు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ వివాదాలతోనే పాలన పూర్తిగా దారి తప్పిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ పట్టుకోల్పోయారని ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ హుబ్బళ్లిలో వ్యాఖ్యానించారు. ఈ వివాదమే తీవ్రమై ప్రభుత్వం పతనం అవుతుందని జోస్యం చెప్పారు.

మార్చితే, పోరుబాట పడతాం

ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్యను గద్దెదింపితే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని చేస్తామని అహింద రాష్ట్రాధ్యక్షుడు ప్రభులింగ దొడ్డణి హెచ్చరించారు. ఐదేళ్ల పాటు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని హుబ్బళ్లిలో ఆయన పేర్కొన్నారు. కొందరు మఠాధిపతులు రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం శోచనీయమన్నారు. చంద్రశేఖరానందనాథ స్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దాన్ని కాంగ్రెస్‌ ఆమోదించవలసిన అవసరం లేదన్నారు.

‘ నాకు ఎవరూ చెప్పలేదు’

బెంగళూరు (శివాజీనగర):  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావాలన్నది తనతో పాటు ఒక్కలిగ సముదాయం నేతలు అందరూ కోరుకుంటున్నారని విశ్వ ఒక్కలిగ మహా సంస్థాన మఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామి పేర్కొన్నారు. వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇదే విషయాన్ని చెప్పాలని తనపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం 2023లో ఏర్పడినప్పుడు మొదట సిద్ధరామయ్య, అనంతరం డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని ప్రచార మాధ్యమాల ద్వారా తాను తెలుసుకున్నానని చెప్పారు. అదే విషయాన్ని సిద్ధరామయ్యకు కూడా సూచించానని వివరణ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ 135 స్థానాల్లో విజయం సాధించేందుకు సిద్ధు, శివకుమార్‌ ఇద్దరూ సమానంగా శ్రమించారని తెలిపారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీకి కావలసిన సాయం చేసి ట్రబుల్‌ షూటర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. మంత్రిగా పలు సార్లు సేవలు అందించిన ఆయన ముఖ్యమంత్రిగా కూడా విజయం సాధిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు