logo

సంఘీభావంతో సమస్యలకు చరమగీతం

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం దిల్లీలో రాష్ట్ర ప్రగతిపై చర్చలు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులతో చర్చించిన ఈ బృందం- శుక్రవారం ఇదే స్థాయిలో మంతనాలు కొనసాగించింది.

Published : 29 Jun 2024 02:11 IST

రాజకీయాలపైనా సిద్ధు దృష్టి
దిల్లీలో చర్చల కొనసాగింపు

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి వినతిపత్రాన్ని అందిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తదితరులు

ఈనాడు, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం దిల్లీలో రాష్ట్ర ప్రగతిపై చర్చలు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులతో చర్చించిన ఈ బృందం- శుక్రవారం ఇదే స్థాయిలో మంతనాలు కొనసాగించింది. కేంద్ర రోడ్డు రవాణా, పట్టణాభివృద్ధి మంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి- రాష్ట్రానికి చెందిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. అనంతరం రాజకీయ చర్చల్లో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశయ్యారు. శనివారం నాడూ దిల్లీలోనే ఉంటూ ఈ బృందం ప్రధాని, హోంమంత్రితో చర్చలకు ప్రయత్నించనుంది.

మల్లికార్జున ఖర్గేకు పుష్ఫగుచ్చం అందిస్తున్న సిద్ధరామయ్య, హోంమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌

అభివృద్ధిపై దృష్టి

వివిధ పార్టీల నుంచి లోక్‌సభకు ఎన్నికైనా- రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఒక్కటిగా ఉండాలని కేంద్ర మంత్రులు, ఎంపీలకు సూచించిన ముఖ్యమంత్రి శుక్రవారం అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. మనల్ని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల ఆశయాలను నెరవేర్చాలంటే పార్టీలకు అతీతమైన సేవలు అనివార్యమని గుర్తు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాజకీయాలు విడిచిపెట్టాలని సూచించారు. అనంతరం ప్రజాపనులు, మౌలిక సదుపాయాలు, జలవనరులు, రైల్వే, విద్య, సాంఘిక సంక్షేమం, ఎన్‌డీఆర్‌ఎఫ్, జాతీయ ఉపాధి హామీ గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ తదితర శాఖల్లో త్వరితగతిన పూర్తి చేయాల్సిన విషయాలపై చర్చించారు.

  • నమ్మ మెట్రో రైల్వే పథకంలో భాగంగా 3వ దశ పనుల కోసం రూ.15,611 కోట్ల ప్రస్తావన కేంద్ర వసతి, నగరాభివృద్ధి శాఖ దృష్టికి 2023 ఆగస్టులోనే తెచ్చామని, ఈ అంశంపై డీపీఆర్‌ ఇంకా తయారు కాలేదని సిద్ధు గుర్తుచేశారు. గత మేలో నిర్వహించిన పెట్టుబడుల సమావేశంలోనే ఈమేరకు సిఫార్సు చేయగా కేంద్రం ఈ ప్రస్తావనపై ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.
  • ఉడాన్‌ పథకంలో భాగంగా మలై, బైందూరు, మంగళూరు కాళీనది పరిసరాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర విమానయాన శాఖకు మనవి చేశామన్నారు.
  • ప్రధానమంత్రి కృషి సించాయి పథకంలో భాగంగా బెళగావి, యాదగిరి, కలబురగి, ధార్వాడల్లో మొత్తం 296 పనులు పూర్తి చేసేందుకు రూ.770కోట్ల విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర జలశక్తి శాఖ త్వరలో ఈ నిధులు విడుదల చేయాలని కోరారు.
  • దేశంలో అతి ఎక్కువ కరవు నమోదైన రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకకు ఎన్‌ఆర్‌ఎంఎఫ్‌ ద్వారా రూ.100 కోట్లు, బాగా నష్టపోయిన బెంగళూరుకు రూ.150 కోట్ల నిధులు విడుదల చేయాలని గతేడాది అక్టోబరులోనే మనవి చేశామని, అందుకు 15వ ఆర్థిక సంఘం కూడా అనుమతి ఇచ్చిందని సీఎం తెలిపారు. ఈ నిధుల కోసం ఒత్తిడి తేవాలని ఎంపీలను కోరారు.
  • కేంద్ర జాతీయ రహదారి ప్రాధికార నేతృత్వంలో శిరాడి ఘాట్‌లో 30 కి.మీ. మేర రెండు పథాల రహదారిని నిర్మించేందుకు రూ.2,580కోట్ల ప్రతిపాదనను గతేడాది ఆగస్టులోనే చేశారు. ఇలా మరో రాష్ట్రంలో 4,807 కిలోమీటర్ల రహదారుల విస్తరణ కోసం 38జాతీయ రహదారుల నిర్మాణ ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందని గుర్తుచేశారు. ‘జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా తరగతి గదుల నిర్మాణం, గ్రంథాలయాలు, ఇతర గ్రామీణాభివృద్ది పనుల కోసం కేంద్ర భూవనరులు, గ్రామీణాభివృద్ధికి శాఖకు విన్నవించారు. రాష్ట్రంలో 207 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల కంప్యూటరీకరణ కోసం డిజిటల్‌ ఇండియా మోడ్రనైజేషన్‌ కార్యక్రమం ద్వారా రూ.365కోట్ల నిధుల కోసం ఈనెల 7న కేంద్రానికి పంపిన ప్రస్తావనపై పునఃపరిశీలనకు ప్రతిపాదించారు. యువజన క్రీడా శాఖ పరిధిలో ఖేలో ఇండియా కార్యక్రమాల కోసం విడుదల చేసిన నిధులు రాష్ట్రానికి అతి తక్కువగా దక్కాయి. రాష్ట్రంలో పేరున్న క్రీడాకారులు దేశానికి వన్నె తెచ్చే స్థాయి ప్రతిభ చూపుతారు. వీరి కోసం 16కార్యక్రమాలు ఖేలో ఇండియా ద్వారా నిర్వహించాలని కోరారు.
  • పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా రూ.584 కోట్లు విడుదల కావాల్సి ఉంది. రాష్ట్రంలో 2.17లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం లభ్యమవుతోందని, వీటి సేకరణకు నిధులు అవసరమని గుర్తుచేశారు. గిరిజన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పీయూసీ బాలికలు, బాలుర వసతి నిలయాల నిర్మాణానికి నిధులు, సామాజిక న్యాయంలో భాగంగా మరో 5ప్రస్తావనలు, అల్ప సంఖ్యాక వ్యవహారాల్లో రూ.569కోట్ల విలువైన వసతి నిలయాలు నిర్మించాల్సి ఉందన్నారు.

రాజకీయ చర్చ

ప్రగతి అంశాలపై సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశమైంది. త్వరలో నిర్వహించే స్థానిక ఎన్నికలు, విధానపరిషత్తు సభ్యుల ఎంపిక ప్రక్రియతో పాటు మంత్రివర్గ విస్తరణ, డీసీఎంల నియామకాంశాలను ఈ సమావేశాల్లో చర్చించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతల చర్చల్లో భాగంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర ఐటీ-బీటీ మంత్రి శ్రీధర్‌ బాబు, కాంగ్రెస్‌ నేత మధుయాష్కిగౌడ తదితరులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

విపక్షాల భిన్నాభిప్రాయం

రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశాలపై విపక్ష నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమావేశాలు నిర్వహించటం రాష్ట్రానికి మంచి చేకూర్చినా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసే మనవి, అందించే వివరాల్లో సమగ్రత అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులింకా వినియోగించకుండా అదనపు నిధులు ఎలా విడుదల చేయాలని ఆయన ప్రశ్నించారు. మెట్రోతో పాటు బెంగళూరులో భూగర్భజలాల వృద్ధి, పెరిఫెరల్‌ వలయ రహదారి పనులింకా మొదలే కాలేదని ఆయన గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుమతి పొందిన వాటిని తాజాగా మరోసారి మనవి చేయటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాట్లాడుతూ ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని తాను అభినందిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే ఇలాంటి సమావేశాలు మేలు చేస్తాయని తెలిపారు. ఇలాంటి సంప్రదాయాన్ని అందరూ కొనసాగించాలన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పోటీ కంటే సమన్వయమే ఎన్నో సమస్యలకు పరిష్కారం అందిస్తుందని గుర్తు చేశారు.

తెలంగాణ నేత భట్టివిక్రమార్క తదితరులతో సిద్ధరామయ్య భేటీ

కేంద్ర మంత్రులు, ఎంపీలతో కొనసాగుతున్న సిద్ధరామయ్య చర్చలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని