logo

భక్తిమార్గంలో రుధిరధారలు

వారిది భక్తిమార్గం. అదే బాటలో ఉల్లాసంగా తిరిగివస్తూ.. ఇక తిరిగిరాని లోకాలకు ఆ 13 మంది తరలివెళతారని ఎవరూ ఊహించలేదు.

Published : 29 Jun 2024 02:05 IST

శోకసంద్రంలో ఎమ్మెహట్టి గ్రామం

లారీని ఢీకొన్న ప్రయాణికుల వాహనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

హావేరి, న్యూస్‌టుడే : వారిది భక్తిమార్గం. అదే బాటలో ఉల్లాసంగా తిరిగివస్తూ.. ఇక తిరిగిరాని లోకాలకు ఆ 13 మంది తరలివెళతారని ఎవరూ ఊహించలేదు. బెంగళూరు- పుణె జాతీయ రహదారి బ్యాడగి తాలూకా గుండేనహళ్లి వద్ద శుక్రవారం వేకువ జామున సంభవించిన రోడ్డుప్రమాదం వారి ప్రాణాలను బలిగొంది. తీవ్రంగా గాయపడిన అర్పిత, అరుణ, అన్నపూర్ణ, నందన్‌లకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి దావణగెరెలోని సీజే ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పొగమంచులో రహదారి పక్కన నిలిపిన లారీని గమనించకుండా వెనుక నుంచి వెళ్లి ట్రావెలర్స్‌ వాహనం ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి వాసులేనని తెలియడంతో ఆ గ్రామంలో శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. అందులోనూ.. వీరంతా సమీప బంధువులే. మృతులను పరశురామ్‌ (45), భాగ్య (40), నాగేశ (50), విశాలాక్షి (40), సుభద్రాబాయి (65), పుణ్య (50), మంజుళాబాయి (55), వాహనం డ్రైవరు ఆదర్శ్‌ (23), మానస (24), రూప (40), మంజుళ (50), ఆర్య (4), నందన్‌ (6)లుగా పోలీస్‌ అధికారులు గుర్తించి, సంబంధీకులకు సమాచారం చేరవేశారు. ఆదర్శ్‌ పక్షం రోజుల కిందటే కొత్తగా ఈ టెంపో ట్రావెలర్‌ వాహనం కొనుగోలు చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆలయాల సందర్శనకు సోమవారం ఇళ్ల నుంచి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామునే ఎమ్మెహట్టిని శోకసంద్రం ముంచెత్తింది.

వాహన పూజకే..

మహారాష్ట్రలోని తివారీ లక్ష్మీ, తుళజా భవాని ఆలయాలకు, అక్కడి నుంచి కలబురగి జిల్లా చించోళి మాయమ్మ ఆలయం, బెళగావి జిల్లా సవదత్తి రేణుకా యల్లమ్మ దర్శనమే వారందరి ఆలోచన. అమ్మవార్ల దర్శనంతో పునీతమయ్యారు. దర్శనం అనంతరం సొంతూరికి వెళుతూనే మృత్యువాత పడ్డారని ఎమ్మెహట్టి వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. బ్యాడగి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెహట్టి గ్రామంలో తొమ్మిది మందికి, చిక్కమగళూరు తాలూకా బీరూరు గ్రామంలో ముగ్గురికి, భద్రావతి తాలూకా హనుమాపురలో ఒకరి అంత్యసంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని జిల్లా ఎస్పీ అంశి కుమార్‌ తెలిపారు.

ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని