logo

ఎడతెగని కుండపోత

తీరప్రాంత జిల్లాలు, మల్నాడుతో పాటు కొడగు, హాసన జిల్లాల్లో శుక్రవారం వానదేవుడు విశ్వరూపం చూపాడు. మరో వారం పాటు ఈ జిల్లాలకు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Published : 29 Jun 2024 01:58 IST

బెంగళూరు : గాలికి గొడుగు ఎగిరిపోకుండా పట్టుకుని వస్తున్న వ్యక్తి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తీరప్రాంత జిల్లాలు, మల్నాడుతో పాటు కొడగు, హాసన జిల్లాల్లో శుక్రవారం వానదేవుడు విశ్వరూపం చూపాడు. మరో వారం పాటు ఈ జిల్లాలకు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వంతెనల పైనుంచి నదీ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కర్ణాటక జిల్లాల్లోని పాఠశాలలకు శనివారం నాడూ సెలవు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వివిధ జిల్లాల అధికారులు హెచ్చరించారు. చార్మాడిఘాట్, ఉత్తర కన్నడ జిల్లాల్లో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం నీరు జలపాతంలా కిందకు దుముకడాన్ని ప్రయాణికులు ఆస్వాదించారు. కొడగు జిల్లాలోని పలు ఆలయాల్లోకి నీరు చేరింది. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రయాణికులు, నివాసులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. దక్షిణ కన్నడ జిల్లాకు సరిహద్దున ఉన్న కేరళలోని కాసరగోడులో వానల జోరు ప్రజలను హడలెత్తిస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు మందగతిన సాగుతున్నాయి.

వృద్ధురాలి మృతి..

కార్వార: జోరువానల నేపథ్యంలో కార్వార సమీపంలోని ఆరవ గ్రామంలో ఇంటి గోడ కూలి రుక్మా గులాబి (79) అనే వృద్ధురాలు మరణించింది. గురువారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి ఇంటి పునాదుల్లోకి నీరు చేరుకుంది. మట్టిగోడతో పాటు పైకప్పు కూడా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాన్ని శుక్రవారం ఉదయం వెలికి తీశారు. కార్వార గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భాగమండల సమీపంలోని ఓ ఆలయంలోకి ప్రవేశించిన నీరు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని