logo

ముఖ్యమంత్రి రాజీనామాకు విపక్షం పట్టు

మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి మండలిలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కింగ్‌పిన్‌ ఎవరో ఎస్‌.ఐ.టి. గుర్తించడం కష్టమే..

Published : 29 Jun 2024 01:55 IST

ఎస్టీ కార్పొరేషన్‌ నిధుల దుర్వినియోగంపై నిరసన

హొసపేటెలో ధర్నా చేస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలు

బళ్లారి, న్యూస్‌టుడే: మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి మండలిలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కింగ్‌పిన్‌ ఎవరో ఎస్‌.ఐ.టి. గుర్తించడం కష్టమే..ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కోరుతూ భాజపా జిల్లా విభాగం  శుక్రవారం నగరంలో ఆందోళన నిర్వహించింది. స్థానిక దుర్గమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమైన ప్రదర్శనలో భాజపా జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మోకా నేతృత్వంలో మాజీ మంత్రి బి.శ్రీరాములు, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్, మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎం.ఎస్‌.సోమలింగప్ప, పార్టీ నేతలు దుర్గమ్మ గుడి భూగర్భ వంతెన నుంచి డబుల్‌ రహదారి మీదుగా గడిగి చెన్నప్ప కూడలికి చేరుకుని రహదారిపై బైఠాయించారు.  అక్కడి నుంచి జిల్లా పాలనాధికారి కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి నిరసనకు దిగారు. గంటకుపైగా రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీసీ రావాలని పట్టుబట్టారు. చివరికి ఏడీసీ మహమ్మద్‌  ఝుభేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బి.శ్రీరాములు మాట్లాడుతూ వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. ఈ నిధులను కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఖర్చుకు ఉపయోగించుకున్నట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో కింగ్‌ పిన్‌ ఎవరు అనేది గుర్తించడం సిట్‌కు కష్టమే..దీనికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యత వహించాలి. ఎస్టీ అభివృధ్ధి కోసం విడుదల చేసిన నిధులను దుర్వినియోగం చేసిన తమ సముదాయానికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. మండలి అధికారి చంద్రశేఖర్‌ ఆత్మహత్య డెత్‌ నోట్‌లో అక్రమార్కుల వివరాలు స్పష్టంగా రాశారని గుర్తుచేశారు. ఎస్టీ సముదాయానికి అన్యాయం జరిగినా..ఎస్టీ రిజర్వేషన్‌పై గెలుపొందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మౌనంగా ఉండటం సరికాదన్నారు. దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణమే రాజీనామా చేయాలని శ్రీరాములు డిమాండ్‌ చేశారు. ఆందోళనలో పార్టీ నేతలు ఎస్‌.గురులింగనగౌడ, హనుమంతప్ప, పాలణ్ణ, కె.ఎస్‌.దివాకర్‌. కార్పొరేటర్లు శ్రీనివాస్‌ మోత్కార్, ఇబ్రహీంబాబు, సురేఖ గౌడ, హనుమంతప్ప, కోనంకి తిలక్, యువ మోర్చా నేత మల్లేశ్, వెంకటేశులు, రామచంద్రయ్య, శ్రీధర్, పార్థసారథి, మురహరిగౌడ, మహిళ మోర్చా నేతలు సుగుణ, ఉజ్వల, విజయలక్ష్మీ, అలివేలు, హిరేమఠ్, హంపీ రమణ పాల్గొన్నారు. 

డీసీ కార్యాలయం ముందు రహదారులపై నిలబడిపోయిన వాహనాలు

సిగ్గులేని ప్రభుత్వం..గద్దె దిగి పోవాలి

హొసపేటె, న్యూస్‌టుడే: దళితుల సంక్షేమ నిధులకు కన్నం వేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క క్షణమూ అధికారంలో కొనసాగే అర్హత లేదని హూవిన హడగలి శాసనసభ్యుడు కృష్ణానాయక్‌ పేర్కొన్నారు. వాల్మీకి సంక్షేమ మండలి నిధుల దుర్వినియోగాన్ని ఎండగడుతూ  భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. దళితుల తరఫున ఉన్నామని నీతులు చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంలో దళిత, గిరిజనుల నిధులు దుర్వినియోగమవుతున్నాయని దుయ్యబట్టారు. సుమారు రూ.187 కోట్ల నిధుల కుంభకోణం దర్యాప్తును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తుంగభద్ర డ్యాం మార్గంలోని సాయిబాబా కూడలి నుంచి జిల్లా పాలనాధికారి కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. జిల్లాధ్యక్షుడు చెన్నబసవనగౌడ, ఎస్టీ మోర్చా రాష్ట్రాధ్యక్షుడు బంగారు హనుమంత, యువమోర్చా రాష్ట్ర కోశాధ్యక్షుడు సిద్ధార్థసింగ్, యువ మోర్చ జిల్లాధ్యక్షుడు కిచిడి కొట్రేశ్, మండలాధ్యక్షుడు శంకర్‌ మేటి పాల్గొన్నారు.

బళ్లారి : డీసీ కార్యాలయంలో మోహరించిన పోలీస్‌ అధికారులు, పోలీసులు

వాల్మీకి మండలి అవినీతిపై భాజపా ప్రదర్శన

గంగావతి,న్యూస్‌టుడే: వాల్మీకీ అభివృద్ధి మండలిలో జరిగిన అవినీతిపై కొప్పళలో భాజపా శ్రేణులు శుక్రవారం ప్రదర్శన నిర్వహించాయి. అశోక్‌ కూడలి నుంచి జిల్లా పరిపాలనా భవనం దాకా ప్రదర్శన జరిగింది. ఆందోళనకారులు బ్యారికేడ్లను తోసుకుంటూ జిల్లా పాలనాధికారి కార్యాలయంలోకి చొచ్చుకు పోయారు. శాసనసమండలి సభ్యురాలు హేమలతా నాయక్‌ పాలనాధికారి కార్యాలయం గది దాకా వెళ్లి అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అక్రమాల్లో తన పేరు ప్రస్తావించరాదని మాజీ మంత్రి నాగేంద్ర అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాక్ష్యాలను నాశనం చేయక మునుపే నాగేంద్రను బంధించాలని కోరారు. ప్రదర్శనలో శాసనసభ్యులు గాలి జనార్దన్‌రెడ్డి, దొడ్డనగౌడ, జిల్లాధ్యక్షుడు నవీన్‌ గుళగుణ్ణవర్, శాసనసభ మాజీ సభ్యులు పరణ్ణ, ధడేసూగూరు బసవరాజ్, భాజపా నేతలు తిప్పేరుద్రస్వామి, సింగనాళ విరూపాక్షప్ప, హన్మంతప్ప నాయక్, బసవరాజ్‌ క్యావటర్‌ పాల్గొన్నారు. 

బళ్లారి : ప్రదర్శనగా వస్తున్న మహిళా కార్యకర్తలు

 

శిబిరంలోనే నిద్రిస్తున్న మాజీ మంత్రి శ్రీరాములు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని