logo

అడ్డగోలుగా నిధుల మళ్లింపు

వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేసే వరకు భాజపా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని విపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ హెచ్చరించారు.

Published : 29 Jun 2024 01:46 IST

సర్కారుపై అశోక్‌ మండిపాటు


ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న అశోక్‌ 

కోలారు, న్యూస్‌టుడే : వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేసే వరకు భాజపా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని విపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ హెచ్చరించారు. ఇంధనం, పాల ధరల పెంపు, ఆగిపోయిన అభివృద్ధి పనులు, వాల్మీకి అభివృద్ధి మండలిలో కుంభకోణం.. తదితరాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. దళ్‌ నేతలతో కలిసి కోలారులో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వినతి పత్రాన్ని జిల్లాధికారికి అందించాక అశోక్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి తన పదవిని డీకే శివకుమార్‌కు అప్పగించాలని బహిరంగ వేదికపైనే చంద్రశేఖరానందనాథ స్వామి చేసిన సూచనలను సిద్ధరామయ్య పరిగణనలోకి తీసుకుని తన మర్యాదను కాపాడుకోవాలని హితవు పలికారు. మండలికి చెందిన నగదులో 20 శాతం అప్పటి మంత్రి నాగేంద్రకు, 80 శాతం సిద్ధరామయ్యకు వెళ్లిందని ఆరోపించారు. అప్పుల బాధ, కరవుతో ఆత్మహత్యలాకు పాల్పడిన అన్నదాతలకు ఇప్పటి వరకు పరిహారాన్ని ఇవ్వలేదని విమర్శించారు. డెంగీ చికిత్సలకు ఖజానాలో నగదు లేదని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని