logo

దర్శన్‌ విచారణ కొలిక్కి

చిత్రదుర్గ నివాసి రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌ తూగుదీప, నటి పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మందిని అరెస్టు చేశామని పోలీస్‌ అధికారులు ప్రకటించారు.

Published : 27 Jun 2024 04:51 IST

అభియోగపత్రం దాఖలే తరువాయి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : చిత్రదుర్గ నివాసి రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌ తూగుదీప, నటి పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మందిని అరెస్టు చేశామని పోలీస్‌ అధికారులు ప్రకటించారు. వీరిపై త్వరలో అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పోలీసులు చర్యలు చేపట్టారు. హత్యకు సంబంధించి ఆధారాలు ఉండడం, నిందితులూ ఆ నేరాన్ని అంగీకరించడంతో అభియోగపత్రాన్ని తయారు చేసేందుకు న్యాయ కోవిదుల సలహా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రేణుకాస్వామి సెల్‌ఫోన్‌ పోలీసులకు లభించలేదు. ఇతర నిందితుల సెల్‌ఫోన్ల నుంచి డేటా రాబట్టేందుకు ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిపుణులు శ్రమిస్తున్నారు. త్వరలో జన్యు పరీక్షల నివేదిక తమకు లభిస్తుందని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి 62 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించగా, అందులో హత్య అనంతరం పట్టణగెరె షెడ్డు నుంచి సుమనహళ్లి రాజకాలువ వరకు ఉన్న 36 సీసీ కెమెరాల ఫుటేజ్‌ పోలీసుల వద్ద ఉంది. అభియోగపత్రాన్ని దాఖలు చేయడంలో ఆలస్యం జరిగితే, నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తారని పోలీసులు భావిస్తున్నారు.
దర్శన్‌ను కించపరుస్తూ, ఆయన అభిమానులను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిని బెదిరిస్తున్న చేతన్‌ (36) అనే వ్యక్తిని బసవేశ్వరనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నిర్మాత ఉమాపతికి ప్రాణహాని తలపెడతానని అతను బెదిరించాడని ఫిర్యాదుల వచ్చాయి. దర్శన్‌ తీరును తూర్పారబడుతూ పోస్టులు పెట్టే వారందరికీ అతను వ్యాఖ్యల ద్వారా హెచ్చరికలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం కమలానగరకు చెందిన నిందితుడిని స్టేషన్‌ బెయిలుపై విడుదల చేశారు.
టైటిల్‌కు నిరాకరణ: దర్శన్‌ను ఆయన అభిమానులు ‘డి’ బాస్‌ అని అభిమానంతో పిల్చుకుంటారు. దర్శన్‌ కారాగారానికి వెళ్లిన అనంతరం ‘డి గ్యాంగ్‌’ పేరిట సినిమా తీసేందుకు కొందరు యువ నిర్మాతలు ముందుకు వచ్చారు. ‘డి గ్యాంగ్‌’ శీర్షికను తన సినిమాకు పెట్టుకునేందుకు ఇవ్వాలని పీఎం ఫిలింస్‌ నిర్మాణ సంస్థకు చెందిన మంజు ఎన్‌.నాయక్‌ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ టైటిల్‌ ఇవ్వడం సాధ్యం కాదని మండలి అధ్యక్షుడు ఎన్‌ఎం సురేశ్‌ స్పష్టం చేశారు. ఇంతకు మునుపూ ఈ టైటిల్‌ కోసం కొందరు మండలిని సంప్రదించారని, వారికీ అందుకు అవకాశం ఇవ్వలేదని ఆయన చెప్పారు.
అవకాశం నాస్తి: దర్శన్‌ను చూసేందుకు కారాగారం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. ములాఖత్‌లో ఆయనను భేటీ అవుతామని వస్తున్న వారిని కారాగార సిబ్బంది వెనక్కు తిప్పిపంపిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వస్తున్న అభిమానులను వెనక్కు తిరిగి వెళ్లాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అక్కడే వేచి చూస్తూ, తమకు అవకాశం లభిస్తుందని ఆశగా వేచి చూస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని