logo

Telangana News: పల్లె నుంచి జడ్పీ దాకా ప్రత్యేకాధికారుల పాలన

గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు.. ఇలా స్థానిక సంస్థల్లో కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి.

Updated : 05 Jul 2024 06:56 IST

ఈనాడు, కరీంనగర్‌: గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు.. ఇలా స్థానిక సంస్థల్లో కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి. 4వ తేదీ జిల్లా, మండల పరిషత్తుల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో మండలాల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ ప్రారంభమవనుంది.. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో మరుసటి రోజు నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్లు, ఎంపీడీవోలు సహా ఇతర గెజిటెడ్‌ హోదా కలిగిన వారిని నియమించారు. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల గడువు ముగియడంతో జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులకు మండల పరిషత్తు అధ్యక్షుడి స్థానంలో ప్రత్యేకాధికారి బాధ్యతలు అప్పగించారు. 

  నిధుల లేమితో ఆటంకమే..

ఒకప్పుడు జడ్పీలో నిధుల గలగలలు దండిగా ఉండేవి. 2017లో జిల్లాల విభజన జరగ్గా 2019 నుంచి కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రంగానే వ్యవస్థ కొనసాగింది. 2014కు ముందు భారీగా నిధులు రాగా.. 2014-15 తరువాత నిధులు, విధుల పరంగా అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.27 కోట్లు, బీఆర్జీఎఫ్‌ ద్వారా రూ.23 కోట్లు ఇతర మార్గాల ద్వారా రూ.10 కోట్లు సమకూరాయి. రూ.60 కోట్లతో జడ్పీ ఖజానా ఉమ్మడి జిల్లాలో కళకళలాడింది. ఇక 2015-16 ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అందించే బీఆర్జీఎఫ్‌ నిధులు, ఆర్థిక సంఘం నిధులు రద్దయ్యాయి. దీంతో ఒక్క ఏడాది వ్యవధిలోనే 80 శాతం నిధులకు కోత పడింది. ఇక అప్పటి నుంచి కేవలం జిల్లాల్లోని ఇసుక క్వారీలు, రిజిస్ట్రేషన్, అద్దెలు, సీనరేజీ, తలసరి ఆదాయం వంటి నిధులు రూ.10 కోట్ల వరకే అందాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా పరిషత్తులు వేర్వేరుగా పరిపాలన పరంగా మంచి మార్పును చూపించినప్పటికీ నిధులు, విధుల పరంగా సభ్యులు చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. నిరసనలు, ఆందోళనలతో సర్వసభ్య సమావేశాల్లో వారి గోడు వెలిబుచ్చుకున్నారు. గడిచిన అయిదేళ్లలో ప్రతి జిల్లాకు కనీసం రూ.15 నుంచి 20 కోట్లు అందని పరిస్థితి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక విడత, 2024-25కి సంబంధించి రెండు విడతల నిధులు నాలుగు జిల్లాలకు రాలేదు. ఇక సీనరేజీ ద్వారా రావాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వమే తీసుకోవడంతో గ్రామాలకు 25 శాతం, మండలాలకు 50 శాతం, జడ్పీకి 25శాతం వాటా నిధులు రాకుండా పోయాయి. 

పెండింగ్‌ పనులు : జడ్పీ ప్రత్యేక గ్రాంట్, స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్, సాధారణ నిధులతో పలు గ్రామాల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, అంగన్వాడీల్లో మౌలిక వసతులు, బడుల్లో చిన్నపాటి నిర్మాణాలు, మురుగు కాల్వల నిర్మాణపు పనులు చాలాచోట్ల ఇంకా కొనసాగాల్సి ఉంది. వీటిపై మండలాల ప్రత్యేకాధికారితోపాటు ఎంపీడీవోలు సంయుక్తంగా దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన పూర్తిచేయించాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 120 వరకు ఇలాంటి పనులున్నట్లు అంచనా.!

సమావేశాలు మమ :  కరోనా విపత్తు సహా ఇతర సమయాల్లో అనుకున్న విధంగా సర్వసభ్య సమావేశాలు జరగలేదు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోమారు సమగ్రంగా చర్చ జరిగి గ్రామాల్లో ఉన్న సమస్యల్ని తీర్చే వాతావరణం ఉండాలి. ఈ లెక్కన అయి దేళ్లల్లో 20 జరగాలి. కానీ వాయిదాలు పడినవే ఎక్కువున్నాయి. 42 అంశాలపై సభ్యులు, అధికారుల మధ్య లోతైన చర్చ జరగాలి. కానీ ఎక్కడా ఏడెనిమిది అంశాలకు మించి చర్చను కొనసాగించలేదు. 

‘ప్రత్యేక’ హాజరు తక్కువే : జడ్పీ సమావేశాలకు చట్టసభల్లోని ప్రజాప్రతినిధులు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకాహ్వానితులుగా, సభ్యులుగా రావాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో వీరు గైర్హాజరవడంతో ప్రాధాన్య అంశాలు చర్చకు రాలేదు. 
వేతనాలకు ఎదురుచూపులు : గౌరవ వేతనాల కోసం సభ్యులు గడిచిన ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నారు. నెలకు జడ్పీ ఛైర్‌పర్సన్‌కు రూ.లక్ష, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13 వేలు, ఎంపీటీసీలకు రూ.6500 ఇవ్వాలి. ఇలా నాలుగు జిల్లాల్లో నెలకు రూ.57.75 లక్షల చొప్పున ఆర్నెల్లకు సంబంధించి రూ.3.46 కోట్లు చెల్లించాల్సి ఉంది.


సేవతో పదవికి న్యాయం చేశా  

కరీంనగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా నా పదవి కాలంలో ప్రజలకు సేవ చేస్తూ వారికి న్యాయం చేశాననే భావన ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపించా. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో కరీంనగర్‌ జడ్పీకి ప్రత్యేక గుర్తింపు రావడం మరిచిపోలేని అనుభూతి. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. సమష్టి కృషితో ప్రాధాన్య క్రమంగా అన్ని రకాల నిధులను ఆయా పనులకు వినియోగించగలిగాం. ఇంకా ఎక్కువ నిధులు వస్తే బాగుండనే ఆశ ఇంకా అలాగే మిగిలిపోయింది. జడ్పీటీసీ సభ్యులు, అధికారులందరి సహకారం మరిచిపోలేను.     

- కనుమల్ల విజయ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని