logo

సీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నా ఉద్యోగానికి దూరం

గురుకులంలో టీజీటీ, పీజీటీ, జేఎల్‌ పోస్టులకు ఎంపికైన ఓ అభ్యర్థిని.. ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పీజీటీ నియామకపత్రం తీసుకున్నారు

Updated : 28 Jun 2024 07:48 IST

సదరం, మెడికల్‌ బోర్డు పరీక్షల్లో ఫలితం తేడాతో కోల్పోయిన అవకాశం 

ఉద్యోగ నియామకపత్రాన్ని చూపుతున్న భానుప్రియ  

గంగాధర, న్యూస్‌టుడే: గురుకులంలో టీజీటీ, పీజీటీ, జేఎల్‌ పోస్టులకు ఎంపికైన ఓ అభ్యర్థిని.. ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పీజీటీ నియామకపత్రం తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆమె అనర్హురాలంటూ అధికారులు పోస్టింగ్‌ నిరాకరించడంతో ఆమె ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌కు చెందిన బొంగాని భానుప్రియ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో పీజీటీ గణితం దివ్యాంగ కోటాలో ఎంపికైనట్లు ట్రిబ్‌ ప్రకటించింది. ఈ మేరకు నియామకపత్రం కూడా అందజేశారు. 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు అర్హులని నిర్ణయించగా, కరీంనగర్‌లోని సదరం అధికారులు ఆమెకు 68 శాతం మేర వినికిడిలోపం ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయితే దివ్యాంగ అభ్యర్థులకు నిర్దేశిత వైకల్య పరీక్షలను సంబంధిత మెడికల్‌ బోర్డు (ఈఎన్టీ వైద్యుడు) నిర్వహించగా 39 శాతం వినికిడి లోపం ఉందని తేల్చడంతో, ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. గతంలో సదరం శిబిరంలో 68 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు, ఉద్యోగ నియామకానికి ముందు 39 శాతం వచ్చిందని ఎలా ధ్రువీకరిస్తారని భానుప్రియ ప్రశ్నిస్తున్నారు. తనను కావాలనే ఉద్యోగానికి పక్కన పెట్టారని, మానవతా దృక్పథంతోనైనా ఒక శాతం కలిపి ఉద్యోగం ఇవ్వాలన్నారు. మరోసారి సర్టిఫికెట్లు పరిశీలించి తనకు న్యాయం చేయాలని భానుప్రియ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని