logo

కందులు అ‘ధర’హో

చొప్పదండి జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ ఏడాది కందులకు మంచి ధర పలుకుతోంది. పంట సీజన్‌ ముగిసినా ధర మాత్రం తగ్గడంలేదు.

Updated : 05 Jul 2024 06:38 IST

ఎంఎస్‌పీ కంటే అధికం 

చొప్పదండిలో కందులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు  
న్యూస్‌టుడే, చొప్పదండి: చొప్పదండి జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ ఏడాది కందులకు మంచి ధర పలుకుతోంది. పంట సీజన్‌ ముగిసినా ధర మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు పెరుగుతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో క్వింటాకు రూ.9 వేల వరకు ఉండగా, పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్‌లో మార్కెట్‌లో అత్యధికంగా రూ.11,350 ధర పలికింది. 

చొప్పదండి మార్కెట్‌కు ఈ సీజన్‌లో సుమారు 700 క్వింటాళ్లకు పైగా కంద]ులు విక్రయానికి వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ధర్మారం, వెల్గటూర్, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, జూలపల్లి, గంగాధర, రామడుగు తదితర మండలాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి కందులు అమ్ముకుంటున్నారు. దుకాణాల్లో కంది పప్పు ధర రూ.200 వరకు ఉండటంతో స్థానికులు సైతం కందులు కొనుగోలు చేసి పప్పుగా మార్చుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో పంట సాగు కాకపోవడంతోపాటు తక్కువగా దిగుబడి రావడంతో కందులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. వ్యాపారులు పోటీపడి మరి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా మార్కెట్‌లో ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దాచి అమ్ముతున్న వారికి మంచి లాభం వస్తోంది.

రైతుల సంతోషం

కందులకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.5800 కాగా, ఇటీవల దానిని రూ.6300కు పెంచింది. అయినా మార్కెట్‌లో మాత్రం ప్రభుత్వ మద్దతు ధర కంటే రెట్టింపు డబ్బులు ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట సీజన్‌ ప్రారంభంలో మొదటగా అమ్ముకున్న వారికి క్వింటాల్‌కు రూ.9 వేలు రాగా ప్రస్తుతం రూ.11 వేలకు చేరుకుంది. నిల్వ చేసి అమ్మడం ద్వారా పెట్టుబడులు పోను లాభాలు పొందుతున్నామని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

గరిష్ఠ ధర పొందండి

గతేడాది కంటే ఈ ఏడాది కందులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. రైతులు  నాణ్యమైన కందులను తీసుకొచ్చి గరిష్ఠ మద్దతు ధర పొందాలి.
- మల్లేశం, మార్కెట్‌ కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని