logo

ఉచిత వైద్యం.. సేవే ప్రధానం

రోగమేదైనా..పేదలైనా.. మధ్యతరగతైనా డబ్బులు లేకుండానే అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యాన్ని సాయి స్వాస్థ్య వెల్‌నెస్‌ కేంద్రం నిర్వహిస్తోంది.

Updated : 05 Jul 2024 06:15 IST

ప్రజలకు బాసటగా సాయి స్వాస్థ్య వెల్‌నెస్‌ కేంద్రం

వెల్‌నెస్‌ కేంద్రంలో వైద్య శిబిరానికి వచ్చిన రోగులు 
న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం: రోగమేదైనా..పేదలైనా.. మధ్యతరగతైనా డబ్బులు లేకుండానే అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యాన్ని సాయి స్వాస్థ్య వెల్‌నెస్‌ కేంద్రం నిర్వహిస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తీన్‌ఖని సమీపంలో 2023 డిసెంబరులో కేంద్రం ఏర్పాటైంది. సత్యసాయి సుజల స్రవంతి ట్రస్టు, సాయి స్వాస్థ్య వెల్‌నెస్‌ ఆధ్వర్యంలో అందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఓ అద్దె భవనంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. రోగులకు వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య సలహాలతోపాటు మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ఏడు నెలల్లో 1400 మంది ఈ కేంద్రంలో సేవలు పొందారు.

వారానికి మూడు రోజులు..

కేంద్రంలో వారానికి మూడు రోజులపాటు ఉచితంగా శిబిరం నిర్వహిస్తారు. ప్రతి బుధ, గురు, ఆదివారాల్లో రోగులకు సేవలందిస్తున్నారు. జనరల్‌ ఫిజిషియన్, గైనకాలజీ, పిడియాట్రిషన్, ఆర్థో, న్యూరో తదితర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో శిబిరంలో 60 మంది రోగులకు సేవలు అందుతున్నాయి. ఆయా విభాగాలకు చెందిన వైద్యుల్లో నిస్వార్థంగా సేవలందించాలనే వారికి సంస్థ అవకాశం కల్పిస్తోంది. పట్టణంలోని పలువురు ప్రైవేటు వైద్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వారంలో ఒకరోజు తమ సమయాన్ని శిబిరానికి కేటాయిస్తున్నారు. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు అవసరమైనవారికి దేశంలోని సత్యసాయి ట్రస్టు అధునాతన ఆసుపత్రులకు పంపి భరోసా కల్పిస్తున్నారు.

ముగ్గురికి గుండె శస్త్రచికిత్సలు..

జగిత్యాల వెల్‌నెస్‌ కేంద్రం నుంచి ముగ్గురు చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు. బీర్‌పూర్‌ మండలం నర్సింహులపల్లెకు చెందిన వేదశ్రీ(16 నెలల) చిన్నారికి ఛత్తీస్‌గడ్‌ రాయపూర్‌ ఆసుపత్రిలో, మంచిర్యాల జిల్లా లక్షెటిపేటకు చెందిన ఉషిక(8) చిన్నారికి బెంగళూరు ముద్దెనహళ్లి ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. జగిత్యాల పట్టణానికి చెందిన లలిత(10 సంవత్సరాల) చిన్నారికి రాయపూర్‌లో శస్త్రచికిత్స చేయించారు. వీరంతా నిరుపేద కార్మికుల పిల్లలు. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. వెల్‌నెస్‌ సంస్థ సహకారంతో పూర్తి ఉచితంగా చిన్నారులకు సేవలందాయి. 

వంద కేంద్రాలు లక్ష్యంగా...

సత్యసాయి సుజల స్రవంతి ట్రస్టు ఆధ్వర్యంలో ఈ తరహా వెల్‌నెస్‌ కేంద్రాలు దేశంలో 100 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని కాగజ్‌నగర్, జగిత్యాలలో ఒక్కో కేంద్రం స్థాపించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సేవానిరతి కలిగిన వైద్యులు, సిబ్బందినే ఈ కేంద్రాలకు వినియోగిస్తున్నారు. జగిత్యాల కేంద్రంలో ఒక సమన్వయకర్తతోపాటు మరో ముగ్గురు సిబ్బంది పనిచేస్తారు. వీరందరికీ వేతనాలు ట్రస్టు ద్వారా చెల్లిస్తున్నారు. ట్రస్టు ద్వారా మందులు కొన్ని సరఫరా చేస్తుండగా స్థానికంగా అవసరమైన మందులను లాభాపేక్ష లేని ఏజెన్సీల నుంచి సమకూర్చుకుంటున్నారు.

రోగ నిర్ధారణే ముఖ్యం

చాలామంది రోగ నిర్ధారణ పరీక్షలు లేకుండానే అనేక వ్యాధులకు గురై మరణిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చేసి అవసరమైన వేరకు వైద్య సలహాలు, చికిత్స అందించాలనే సంకల్పంతో సత్యసాయి ట్రస్టు ఈ కేంద్రాలను నెలకొల్పుతోంది. ప్రైవేటు వైద్యం ఖరీదు కావడంతో అదే తరహా వైద్యాన్ని రోగులకు అందించాలనేది కేంద్రం ఉద్దేశం. నిరుపేదలు, మధ్యతరగతి అనే భేదం లేకుండా అందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- ఊటూరి శ్రీకాంత్, వెల్‌నెస్‌ ప్రాంతీయ సమన్వయ కర్త

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు