logo

మేలైన వంగడాలు.. సమగ్ర యాజమాన్యం

వానాకాలం పైర్లసాగులో రైతులకు తోడుగా నిలిచేలా పొలాస ప్రాంతీయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలతో గురువారం ‘ఈనాడు’ ఫోన్‌ఇన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

Published : 05 Jul 2024 06:09 IST

‘ఈనాడు’ ఫోన్‌ఇన్‌లో రైతులకు శాస్త్రవేత్తల సూచనలు

ఫోన్‌లో రైతులతో మాట్లాడుతున్న ఏడీఆర్, పాల్గొన్న శాస్త్రవేత్తలు 
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం: వానాకాలం పైర్లసాగులో రైతులకు తోడుగా నిలిచేలా పొలాస ప్రాంతీయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలతో గురువారం ‘ఈనాడు’ ఫోన్‌ఇన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఫోన్‌కాల్, వీడియోకాల్‌ ద్వారా అడిగిన సందేహాలను ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్, శాస్త్రవేత్తలు డాక్టర్‌ డి.శ్రీలత, డాక్టర్‌ బి.శ్రీనివాస్, డాక్టర్‌ గోన్యానాయక్, డాక్టర్‌ ఇ.రజనీకాంత్, డాక్టర్‌ బలరాం, డాక్టర్‌ పి.రవి, డాక్టర్‌ డి.పద్మజ నివృత్తిచేశారు.
  సమస్య: ఏయే రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి,   వరిని ఎప్పటివరకు సాగుచేయవచ్చు.?
- నవీన్‌రెడ్డి, రాజేందర్‌(గుల్లపేట), రాజమల్లయ్య(కండ్లపల్లి), మల్లేశం(ధర్మారం), లక్ష్మీనర్సయ్య(మేడిపల్లి)
  సమాధానం: జేజీఎల్‌384, జేజీఎల్‌3828, జేజీఎల్‌3855, బతుకమ్మ బ్రీడర్‌ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలతో ఈ నెలాఖరు వరకు నార్లుపోసుకోవచ్చు. తెలంగాణ సోన రకాన్ని ఈ నెల 10 తరువాత నార్లుపోసుకోవాలి. వ్యవసాయ వర్సిటీల ద్వారా విడుదలైన అన్ని సన్నరకాలను సాగు చేయవచ్చు. సుడిదోమల నివారణకు సమగ్ర యాజమాన్యం చేపట్టాలి.
   పత్తిలో ఏయే చర్యలు చేపట్టాలి.? - రమణ(తక్కళ్లపల్లి), శివరాజం(పెరకపల్లె), శ్రీనివాస్‌(తిమ్మాపూర్‌), జీవన్‌(హన్మాజీపేట), తిరుపతి(లక్ష్మీపూర్‌), రాయలింగు(వీణవంక)
  వర్షాభావంతో మొక్కలు మొలవనిచోట పోగుడ్డలు పెట్టవచ్చు. జులై 15 వరకు పత్తిని వర్షాధారంగా కేవలం నల్లరేగడి నేలల్లోనే సాగుచేయాలి. నీటివసతి ఉన్నపుడు ఎలాంటి నేలల్లోనైనా వేయవచ్చు. ఆరు వరుసల పత్తి, ఒక వరుస కంది విత్తవచ్చు. బీటీపత్తిలో చేనుచుట్టూ నాన్‌బీటీ విత్తనాలను లేదా కందిసాళ్లను విత్తాలి.
   కందిలో అనువైన రకాలేమిటి.? - రాజనర్సు(పోతారం), విజయ్‌(తాటిపల్లి), కె.లక్ష్మారెడ్డి, పెద్దిరాజం(ఇబ్రహీంపట్నం)
 నీటివసతితో డబ్ల్యూఆర్‌జి93, డబ్ల్యూఆర్‌జి121, వర్షాధారంగా డబ్ల్యూఆర్‌జి97 రకాలు అనువైనవి. స్వల్పకాలిక పీఆర్‌జి176 రకాన్ని కూడా వేయవచ్చు. విత్తనాలను వ్యవసాయశాఖ మినీకిట్్స ఇస్తుండగా ఆదిలాబాద్, వరంగల్‌ పరిశోధనస్థానం నుంచి కూడా విత్తనాలను తీసుకోవచ్చు. కందిని ఏకపంటగా లేదా పత్తి, పసుపుల్లో మిశ్రమ, అంతర పంటగానూ వేయవచ్చు.
   మామిడిలో ప్రస్తుతం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి.?
- జనార్దన్‌(రాయికల్‌), రాంకిషన్‌(వెల్దుర్తి), మహేందర్‌రెడ్డి(మోతె)

  చెట్లపైనగల ఎండుపుల్లలు, తోటలో రాలిన కాయలను ఏరివేయాలి, చెట్లమధ్యన దుక్కిచేయాలి. కొమ్మల ఫ్రూనింగ్‌ చేసినచోట కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ చల్లాలి. పదేళ్లు పైబడిన చెట్టుకు ఒక్కోదానికి 80-100 కిలోల పశువుల ఎరువులను, 1 కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను, 125 గ్రాముల జింకు, 50 గ్రాముల బోరాన్‌ వేయాలి. ఇప్పట్నుంచి మళ్లీ పూత వరకు రెండుమూడు సార్లు రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు వేయాలి.
   మొక్కజొన్న, నువ్వులను ప్రస్తుతం సాగు చేయవచ్చా.?
- రవీందర్‌రెడ్డి(మల్లాపూర్‌), రాములు(వెంకట్రావుపేట), గంగారెడ్డి(మల్యాల), రాంరెడ్డి(సిరికొండ)

   ఈ నెలాఖరు వరకు మక్కను సాగుచేయవచ్చు. ఎండుతెగులును తట్టుకునే రకాలను విత్తనశుద్ధిచేసి విత్తుకోవాలి. నీరు నిలవని నేలల్లో ఆగస్టు 15-30 వరకు నువ్వును సాగుచేయవచ్చు. ఆగస్టులో వేరుసెనగను విత్తుకోవచ్చు. ప్రతి మంగళవారం రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్సిటీ శాస్త్రవేత్తలు వెలువరించే సూచనలను రైతులు పాటించాలి.
   ఎన్నిరోజుల వరినారును నాటువేయాలి, నారుమడిలో సస్యరక్షణ ఎలా.? - రెడ్డి తిరుపతి, అర్పపల్లి
  25-30 రోజుల వయసున్న నారును నాటుకుంటే పిలకలు అధికంగా వస్తాయి. నారుతీతకు వారంముందుగా ఎకరా మడికి కిలో కార్భోఫ్యూరాన్‌ గుళికలను చల్లాలి.
   కూరగాయల్లో కలుపు సమస్యను ఎలా నివారించాలి.? 
- అత్తినేని శంకర్, గోపాల్‌రావుపేట్ల

  విత్తనాలు నాటకముందు ఒకరకం, విత్తనాలు నాటి మొలకెత్తిన తరువాత ఆయా పంటల రకాలను బట్టి కలుపు నివారణ రసాయనాలున్నాయి. మొక్కలపై పడకుండా సాళ్లలో కలుపునివారణ రసాయనాన్ని పిచికారీ చేస్తే మంచి ఫలితముంటుంది.
   వరిలో మొగిపురుగు సమస్య అత్యంత తీవ్రంగా ఉంటోంది, ఎలా నివారించాలి.
- కాలగిరి సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్‌
  నాటిన నెలరోజుల్లోపు గుళికలు చల్లాలి లేదా పిచికారీ చేయవచ్చు. పైరు పిలకదశలో మరోసారి మందుద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే తెల్లకంకి రాకుండా చూడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని