logo

గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

ధర్మపురిలో ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ పేర్కొన్నారు

Published : 05 Jul 2024 06:02 IST

వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌

ధర్మపురి, న్యూస్‌టుడే: ధర్మపురిలో ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలోని పోలీసుస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామానికి చెందిన బత్తిని చందు(23), గొల్ల వెంకటేష్‌(25)లు గత రెండేళ్ల నుంచి గంజాయి తాగుతున్నారు. జల్సాలకు కావాల్సిన డబ్బులు దొరక్కపోవడంతో పథకం పన్నారు. తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయించేలా ప్రణాళిక వేసుకున్నారు. గత రెండేళ్ల నుంచి రాము అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. వీరిద్దరూ తాగడంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ద్విచక్ర వాహనం సీటు కింద కవర్లో గంజాయి పెట్టుకొని ధర్మపురికి వస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.40 వేల విలువైన గంజాయి, రెండు చరవాణులు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాము పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్, ఏఎస్సై సూర్య నారాయణరాజు, హెడ్‌కానిస్టేబుళ్లు ఎం శంకర్, డి.వెంకటయ్య, రామస్వామి తదితరులను ఎస్పీ అశోకుమార్‌ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.


ఆన్‌లైన్‌ గేమ్స్‌తో అక్రమ సంపాదన
రూ.33 లక్షల నగదు స్వాధీనం.. ముగ్గురి అరెస్టు

సుల్తానాబాద్, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ గేమ్స్‌లో బెట్టింగులు పెడుతూ, గేమ్‌ యాప్‌ల లింక్‌లను సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు పంపుతూ అక్రమంగా సంపాదిస్తున్న ముగ్గురిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం గోదావరిఖనికి చెందిన ముల్కల రాజ్‌కుమార్, చిన్నపల్లి అభిలాష్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకేంద్రానికి చెందిన నిమ్మ ధనుంజయ్‌లు బృందంగా ఏర్పడి హైదరాబాద్‌ కేంద్రంగా బెట్టింగులు పెట్టి ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నారు. అదే ఆన్‌లైన్‌ గేమ్‌ యాప్‌ లింక్‌లు ఇతరులకు పంపుతూ వచ్చే డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారు. గురువారం సుల్తానాబాద్‌ ప్రయాణ ప్రాంగణం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.33 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకొని హైదరాబాద్‌ నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుల నుంచి రూ.33 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


భర్త వేధింపులతో భార్య బలవన్మరణం

జమ్మికుంట, న్యూస్‌టుడే: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంటలోని మారుతినగర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. జమ్మికుంట సీఐ రవి కథనం ప్రకారం.. వీణవంక మండల వల్బాపూర్‌కు చెందిన కావ్య(26)కు అదే మండలం ఎల్బాకకు చెందిన జీడి రాజుతో వివాహం అయింది. వీరికి కుమారుడు, కూతురు సంతానం కాగా.. జమ్మికుంటలోని మారుతినగర్‌లో నివాసం ఉంటున్నారు. కావ్య వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో రాజు గతంలో దుర్భాషలాడి కొట్టడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అనంతరం కావ్యను బాగా చూసుకుంటాని ఇంటికి తీసుకెళ్లిన రాజు మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీంతో కావ్య బుధవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. 


విద్యుత్తు చౌర్యం కేసులో జరిమానా

భగత్‌నగర్‌ : హుజురాబాద్‌ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన కేశబోయిన తిరుపతికి విద్యుత్తు  చౌర్యం కేసులో జిల్లా ఒకటో అదనపు సెషన్స్‌ జడ్జి డి.వెంకటేశ్‌ రూ.14,616 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని యాంటీ పవర్‌ థెప్ట్‌ స్క్వాడ్‌(ఏపీటీఎస్‌) సీఐ ఎండీ షాదుల్లాబాబా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు