logo

కొత్త జీవితం ప్రారంభిస్తాం

గెట్ల పంచాయతీ తోపులాటలో బంధువు చనిపోయిన కేసుతో తండ్రి, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. 2010 నుంచి 2024 వరకు గడిపిన జైలు జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని వారు అంటున్నారు

Updated : 05 Jul 2024 06:40 IST

తండ్రి గంగయ్యతో ఆశయ్య 

న్యూస్‌టుడే, కరీంనగర్‌ నేరవార్తలు : గెట్ల పంచాయతీ తోపులాటలో బంధువు చనిపోయిన కేసుతో తండ్రి, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. 2010 నుంచి 2024 వరకు గడిపిన జైలు జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని వారు అంటున్నారు.. నిద్ర లేని రాత్రులు గడిపామని.. ఇక కొత్త జీవితం ప్రారంభిస్తామన్నారు.. బుధవారం 213 మంది ఖైదీలను విడుదల చేయగా.. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన గంగయ్య, ఆయన కుమారుడు ఆశయ్య, మధు ఉన్నారు. ఆశయ్య ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. 

మాకు రెండు ఎకరాల భూమి ఉంది. పక్కన పొలం ఉన్న బంధువుతో గెట్ల పంచాయితీ ఉండేది. 2008లో పొలం వద్ద జరిగిన తోపులాటలో బంధువు కింద పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మా తండ్రి గంగయ్యతోపాటు నాపై, తమ్ముడు మధుపై కేసు నమోదైంది. 2010లో మా ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించగా వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. 2010 నుంచి 2016 వరకు జైలు ఆవరణలో వివిధ పనులు చేసుకుంటూ ఉన్నాం. వరంగల్‌ జైలు కూల్చివేయడంతో 2020లో కరీంనగర్‌ జిల్లా జైలుకు పంపించారు. తండ్రి గంగయ్య నర్సరీ, తమ్ముడు, నేను ఇక్కడ ఉన్న పెట్రోలు బంక్‌లో ఓపెన్‌ ఖైదీలుగా పని చేస్తూ వచ్చాం. అమ్మ, ఊరు, అక్కడి మనుషులు గుర్తుకు వస్తే రాత్రుళ్లు నిద్ర పట్టేది. కాదు. ఓపెన్‌ ఖైదీలుగా ఉండటంతో సమాజంపై కొంత అవగాహన పెరిగింది. జైలుకు వచ్చే సమయంలో నాకు 21, తమ్ముడికి 16 సంవత్సరాలు. జైలు అధికారుల ప్రోత్సాహంతో తమ్ముడు, నేను ఓపెన్‌ డిగ్రీ పూర్తి చేశాం. క్షమాభిక్షకు తమ ముగ్గురి పేర్లు ప్రతిపాదించినట్లు తెలియడంతో జీవితంపై కొత్త ఆశ కలిగింది. ఆరు నెలలుగా విడుదలకు వేచి చూశాం. బుధవారం విడుదలైన వెంటనే నేరుగా గ్రామానికి వెళ్లగా పుట్టిన ఊరు, స్నేహితులు, బంధువులను చూసి కన్నీళ్లు ఆగలేదు. జైలు అధికారులు కరీంనగర్‌ పెట్రోల్‌ బంకులో  ఉద్యోగిగా పని చేసే అవకాశం కల్పించారు. ఇప్పటి నుంచి మాకు కొత్త జీవితం ప్రారంభం అయినట్లే. - ఆశయ్య 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని