logo

తనిఖీలు విస్తృతం.. అక్రమాలు యథాతథం

పెద్దపల్లికి చెందిన ఓ బయో ఫెర్టిలైజర్‌ కంపెనీ డీలర్‌ కొన్నేళ్ల కిందట జన్మదిన వేడుకలు నిర్వహించారు. విందు ఏర్పాటు చేసి  వ్యవసాయ అధికారిని ఆహ్వానించారు.

Updated : 05 Jul 2024 06:41 IST

 ఎరువుల వ్యాపారులతో అనుబంధాలు
వివాదాస్పదంగా వ్యవసాయాధికారుల తీరు

పెద్దపల్లిలోని ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న డీఏవో ఆదిరెడ్డి(పాతచిత్రం) 

 

పెద్దపల్లికి చెందిన ఓ బయో ఫెర్టిలైజర్‌ కంపెనీ డీలర్‌ కొన్నేళ్ల కిందట జన్మదిన వేడుకలు నిర్వహించారు. విందు ఏర్పాటు చేసి  వ్యవసాయ అధికారిని ఆహ్వానించారు. అప్పట్లో ఆ వ్యాపారికి అనుకూలంగా వ్యవహరించారని సదరు అధికారిపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు గత నెలలో జిల్లా అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ విచారణ జరిపారు.

 ఇటీవల పెద్దపల్లిలోని ఎరువుల దుకాణానికి తనిఖీ కోసం ఒంటరిగా వెళ్లిన ముఖ్య వ్యవసాయ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. వ్యాపారి ఆయనపై తిరగబడటంతో చేష్టలుడిగిన ఆయన వ్యాపారుల సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

న్యూస్‌టుడే, పెద్దపల్లి : పై రెండు ఘటనలు అధికారులు, వ్యాపారుల మధ్య బంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొదటి సందర్భంలోని అధికారి గతంలో తోటి ఉద్యోగులను వేధించడం, ఆత్మ నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మే 23న జిల్లా అధికారులు విచారణ నిర్వహించారు. వారి నివేదికపై ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండో ఘటనలో ప్రస్తుతం జిల్లా వ్యవసాయ శాఖలోని కీలక అధికారిపై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువుల దుకాణాలకు సిబ్బందితో కాకుండా ఒంటరిగా వెళ్లడం.. గతంలో కేసులు నమోదై విచారణను ఎదుర్కొంటున్న వ్యాపారులతో అనుబంధం కొనసాగించడం.. వేడుకల కోసం నిధుల సమీకరణకు వ్యాపారులను వేధించడం వంటి ఆరోపణలున్నాయి. చివరకు ఓ వ్యాపారి తిరగబడితే అతడిపై చర్యలు తీసుకోకుండా రాజీ కోసం వ్యాపార సంఘం నాయకులతో యత్నించడం అనేక సందేహాలకు తావిస్తోంది.

మొక్కుబడి పరిశీలనలు

ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ శాఖతో పాటు టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎవరు తనిఖీ చేసినప్పటికీ వారి వెంట మండల వ్యవసాయాధికారి తప్పనిసరిగా ఉండాలి. తనిఖీల్లో అక్రమాలు వెల్లడైతే దుకాణం లేదా ఉత్పత్తులను సీజ్‌ చేయడం, కేసులు నమోదు చేసే అధికారం మండల వ్యవసాయాధికారికే ఉంటుంది. అలాగే దుకాణానికి సంబంధించిన ఎరువుల జాబితా, అనుమతి పొందిన కంపెనీల వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల వివరాలు ఏవో వద్దే ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో జిల్లాలో జరుగుతున్న తనిఖీల్లో ఎక్కడా మండల వ్యవసాయాధికారులు కనిపించడం లేదు. పెద్దపల్లి,  పాలకుర్తి, మంథని ప్రాంతాల్లోనూ ఇటీవల జిల్లా వ్యవసాయాధికారి తనిఖీలు నిర్వహించిన సందర్భంలోనూ మండల అధికారులు వెళ్లలేదు. 

అవినీతిపై చర్యలేవీ!

  • జిల్లాలో వ్యవసాయ శాఖ జరిపే తనిఖీల్లో కొన్నేళ్లుగా అక్రమాలు బయట పడకపోగా పోలీసులు, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్‌ విభాగాలు నిర్వహించే తనిఖీల్లో తరచూ వెల్లడవుతున్నాయి. 
  • గతంలో రాష్ట్రంలోనే నిషేధించిన ఫోరేట్‌ ప్యాకెట్లు, గ్లైకోసిల్, అమ్మోనియా తదితర మందులను విక్రయిస్తుండటంతో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అవి కోర్టుల్లో కొనసాగుతున్నాయి. 
  • తాజాగా వ్యవసాయ శాఖ హెచ్‌టీ (హెర్బిసైడ్‌ టాలరెంట్‌ కాటన్‌) విత్తనాలను వినియోగించొద్దని గ్రామ స్థాయిలో ప్రచారం చేసింది. మరో వైపు అంతర్గాం మండలంలో రెండు, మూడేళ్లుగా రైతులు ఈ విత్తనాలను వాడుతున్నట్లు తెలిసినప్పటికీ విక్రయదారులను పట్టుకోలేకపోయారు. 
  • పెద్దపల్లిలోని అయిదుగురు పురుగు మందుల వ్యాపారులపై గతంలో కేసుల నమోదైనా ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. 
  • అందుబాటులో లేకుంటేనే ఒంటరిగా వెళ్తాం
  • దుకాణాలను తనిఖీ చేసే సమయంలో అక్రమాలు బయట పడితే మండల అధికారిని పిలిచి కేసు నమోదుకు సిఫార్సు చేస్తా. తనిఖీలు జరిపే క్రమంలో ఏవో, ఇతర అధికారులు అందుబాటులో లేకుంటే ఒంటరిగా వెళ్తుంటాం. గతంలో వ్యాపారులపై నమోదైన కేసుల వివరాలేవీ తెలియవు. వారిపై చర్యలు తీసుకునే విషయంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. వ్యవసాయాధికారులకు వ్యాపారులతో ఆర్థిక లావాదేవీలుండవు. ఒకవేళ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలుంటే చర్యలు తీసుకుంటాం.

      -ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు