logo

పసుపు.. ఎరుపు హెచ్చరిక కార్డులు

గని ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు పసుపు.. ఎరుపు కార్డులను(ఎల్లో, రెడ్‌) ప్రవేశపెట్టింది. రెండు నెలల క్రితమే ఈ ఆదేశాలు విడుదల చేసినా ఎన్నికల కోడ్‌ కారణంగా బయటకు రాలేదు

Updated : 05 Jul 2024 06:16 IST

సింగరేణిలో ఉద్యోగులపై చర్యలకు కొత్త విధానం

నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

న్యూస్‌టుడే, గోదావరిఖని: గని ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు పసుపు.. ఎరుపు కార్డులను(ఎల్లో, రెడ్‌) ప్రవేశపెట్టింది. రెండు నెలల క్రితమే ఈ ఆదేశాలు విడుదల చేసినా ఎన్నికల కోడ్‌ కారణంగా బయటకు రాలేదు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో యాజమాన్యం రెండు రోజుల క్రితం తాజాగా అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుడు తప్పు చేస్తే ముందుగా పసుపు కార్డు, వరుసగా మూడు సార్లు తప్పు చేస్తే రెడ్‌కార్డు జారీచేసి ఆ తర్వాత చర్యలు తీసుకునే విధానాన్ని కొత్తగా అమలు చేసేందుకు నిర్ణయించారు. దీనిని వెంటనే విరమించుకోవాలని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గని ప్రమాదాలకు కార్మికులను బలి చేస్తున్న యాజమాన్యం పసుపు, ఎరుపు కార్డుల విధానంతో పూర్తిగా ఉద్యోగులే బాధ్యులన్న సంకేతాలను ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలకు అక్కడున్న రక్షణ చర్యలు.. పని స్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు చేపట్టాల్సి ఉంటుంది. కాగా పని స్థలంలో ఏ తప్పు చేసినా ముందుగా పసుపు కార్డు జారీ చేయనున్నారు. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చే విధంగా యాజమాన్యం ఈ విధానాన్ని రూపొందించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సింగరేణిలో ఇలాంటి విధానం ఇప్పటి వరకు తీసుకోలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎలాంటి చర్చలేకుండా ఆదేశాలు?

సింగరేణిలో కొత్తగా జారీ చేసిన ఆదేశాలను రహస్యంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి చర్చ లేకుండానే రక్షణ విభాగం నుంచి ఈ ఆదేశాలు విడుదల చేసినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ గని కార్మికులను ఉద్దేశించి పుసుపు, ఎరుపు కార్డుల విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో కనీసం చర్చించకుండా జారీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

సర్వీసుపై ప్రభావం...

సింగరేణిలో పనిచేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి యాజమాన్యం కొత్తగా ప్రవేశపెట్టిన పసుపు, ఎరుపు కార్డుల విధానంద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల సర్వీసుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా వెంటనే పసుపు కార్డు జారీ చేస్తారు. ఇది కార్మికుడి ఖాతాలో జమ అవుతుంది. సంక్షిప్త సందేశం ద్వారా కార్మికుడి చరవాణికి పసుపు కార్డు జారీ చేసినట్లు సమాచారం వస్తుంది. మూడు సార్లు పసుపు కార్డు సందేశం వచ్చిన తదుపరి రెడ్‌ కార్డు జారీ చేస్తారు. రెడ్‌ కార్డు తర్వాత ఛార్జిషీటు జారీ చేస్తారు. ఆ తర్వాత విచారణ చేపట్టి సస్పెండ్‌ చేసే అధికారం యాజమాన్యానికి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. విధుల్లో చేసే చిన్న పొరపాట్లను సైతం యాజమాన్యం పరిగణలోకి తీసుకుని వాటిపై చర్యలు తీసుకోనుంది. ఈ విధానం ఇబ్బందికరంగా మారనుందని.. వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

వెంటనే రద్దు చేయాలి

యాజమాన్యం జారీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలి. లేదంటే సమ్మె నోటీసు జారీ చేస్తాం. కార్మికులను బాధ్యులను చేయడానికే యాజమాన్యం ఈ ఆదేశాలను జారీ చేసింది. యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే సింగరేణిలో ఆందోళనలు తప్పవు. ఇది పూర్తిగా కార్మికులకు విరుద్ధంగా ఉంది.
-వి.సీతారామయ్య, ఏఐటీయూసీ నాయకులు


రక్షణ త్రైపాక్షిక సమావేశంలో చర్చిస్తాం

ఈనెల 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రక్షణ త్రైపాక్షిక సమావేశంలో చర్చిస్తాం. ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది కార్మికులకు నష్టం జరిగే విధంగా ఉంది. వెంటనే దీనిని రద్దు చేయాలి. లేదంటే ఆందోళనలు తప్పవు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసే ఆదేశాలను ఎప్పుడూ సమర్థించేది లేదు.
-బి.జనక్‌ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని