logo

పదిలో కష్టపడ్డారు... ట్రిపుల్‌ ఐటీ సాధించారు

తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశారు. వారు పడిన బాధలు తాము భవిష్యత్తులో చూడకూడదని భావించారు. ఇందుకు ప్రణాళిక ప్రకారం చదివారు.

Updated : 05 Jul 2024 06:42 IST

జిల్లాలో 81 మంది విద్యార్థుల ఎంపిక

కనగర్తిలో విద్యార్థులను అభినందిస్తున్న šహెచ్‌ఎం వినోద్, ఉపాధ్యాయులు 
న్యూస్‌టుడే - గంభీరావుపేట, కోనరావుపేట : తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశారు. వారు పడిన బాధలు తాము భవిష్యత్తులో చూడకూడదని భావించారు. ఇందుకు ప్రణాళిక ప్రకారం చదివారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించారు. ఇక్కడ కూడా బాగా శ్రమించి భవిష్యత్తులో మంచి కొలువులు సాధిస్తామని చెబుతున్నారు. జిల్లాలో 81 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.

చాలా సంతోషంగా ఉంది

బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు రావడం చాలా సంతోషంగా ఉంది. పది పరీక్షల్లో 9.7 జీపీఏ సాధించాను. వస్తాదన్న నమ్మకం లేదు. మా పాఠశాల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించటంతో దరఖాస్తు చేశాను. సీటు వచ్చింది. మా అమ్మానాన్నలు చాలా ఆనందపడ్డారు. 
 నవనీత్‌ కుమార్, ముచ్చర్ల


బీటెక్‌లో మంచి మార్కులు సాధించి...

నాన్న ప్రభాకర్‌ వలసజీవి. అమ్మ రమ్య బీడీ కార్మికురాలు. తల్లిదండ్రులకు అండగా ఉండటానికి శ్రద్ధగా చదివాను. క్రమం తప్పకుండా ఇంటి వద్ద ఉదయం, సాయంత్రం ప్రణాళిక ప్రకారం కచ్చితమైన సమయం కేటాయించి చదివాను. దీంతో పదో తరగతి ఫలితాల్లో 9.7 గ్రేడు సాధించి కోనరావుపేట ఆదర్శ పాఠశాల టాపర్‌గా నిలిచాను. బీటెక్‌లో మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో డాటా సైన్స్‌ కొలువు కొట్టాలన్నది నా లక్ష్యం.

 ఒగ్గు వైశాలి, మల్కపేట


ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా

మా తల్లిదండ్రుల కలను నెరవేర్చటం కోసం కృషి చేస్తున్నాను. ట్రిపుల్‌ ఐటీలో ఆరు సంవత్సరాలు కష్టపడి చదువుతాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాను. ఉపాధ్యాయుల ఉత్తమ బోధనతోనే పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచాను.

 భూక్య కార్తీక్, లింగన్నపేట తండా


తల్లిదండ్రుల కల నెరవేరుస్తా

పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించి దరఖాస్తు చేసుకున్నాను. సీటు రావడంతో ఆరు సంవత్సరాల పాటు కష్టపడి చదివి ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం సాధిస్తాను. తల్లిదండ్రుల కలను నెరవేరుస్తాను. ప్రణాళిక ప్రకారం చదువుతూ పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇష్టపడి చదివాను. భవిష్యత్తులోనూ శ్రమిస్తాను.

 యాడరపు శివ


సాఫ్ట్‌వేర్‌ కొలువే లక్ష్యం

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచాను. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు వెళ్తాను. సీటు వచ్చిందని చెప్పగానే మా తల్లిదండ్రులు చాలా సంతోష పడ్డారు. ఆరేళ్లు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకొస్తాను. 
 గంధం శివాని, కొత్తపల్లి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని