logo

వృక్ష రాజసం... హరిత శోభితం

ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని రెండు వైపులా ఉన్న బైపాస్‌ రోడ్లు పచ్చని చెట్లు, పూలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి

Updated : 05 Jul 2024 06:44 IST

పచ్చదనం, ఆహ్లాదాన్ని పంచుతున్న బైపాస్‌ రోడ్లు

బైపాస్‌ రోడ్డులో పూలతో కనువిందు చేస్తున్న చెట్లు 
న్యూస్‌టుడే, వేములవాడ : ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని రెండు వైపులా ఉన్న బైపాస్‌ రోడ్లు పచ్చని చెట్లు, పూలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలతోపాటు వివిధ రకాల పూల మొక్కలు నాటి పెంచారు. దీంతో ఇవి ఏపుగా పెరిగి హరిత శోభితం సంతరించుకుంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారికి కనువిందు చేస్తున్నాయి.

వేములవాడ పట్టణం చుట్టూ దాదాపు రూ.150 కోట్లతో మొదటి, రెండో బైపాస్‌ రహదారులను నిర్మించారు. వాటికి ఇరువైపులా, డివైడర్ల మధ్య నీడనిచ్చే, వివిధ రకాల పూల మొక్కలను అయిదారేళ్ల కిందట అటవీశాఖ పెద్ద ఎత్తున నాటి పెంచింది. ఆ తరవాత వాటి సంరక్షణ బాధ్యతలను మున్సిపల్‌ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతం ఆ మొక్కలన్నీ పెరిగి పెద్దవై పచ్చదనాన్ని పంచుతున్నాయి. రోడ్లకు రెండువైపులా, డివైడర్లలో పెరిగినవి, ఇతర పూల చెట్లు హరిత శోభితంతో కనువిందు చేస్తుండగా, ప్రజలకు మంచి వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. ఉదయం నడకకు వెళ్లేవారికి, ఆయా మార్గాల్లోని రహదారులపై వెళ్లే వాహనదారులకు పచ్చదనం, విరబూసిన పూలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. డివైడర్ల మధ్య ఉన్న పూల మొక్కలు, ఇతర మొక్కలు ఎండాకాలంలో ఎండిపోకుండా వీటి సంరక్షణకు మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు నీటినందించే విధంగా రూ.8 లక్షలతో డ్రిప్‌ ఏర్పాటు చేశారు. దీంతో రహదారుల వెంబడి డివైడర్లలోని మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి.

నిర్మాణ ప్రాంతాల్లో కనుమరుగు

పట్టణంలో మూలవాగు వంతెన నుంచి ఇరువైపులా ఉన్న రెండు బైపాస్‌ రహదారులు గతంలో అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా ఉండేవి. అలాంటి రహదారులు అభివృద్ధి చెంది పట్టణానికి కళను తీసుకువచ్చాయి. వీటి వెంబడి ఇరువైపులా పెరిగిన వివిధ రకాల చెట్లు ఈ రహదారులకు కొత్తందాలను తెచ్చి పెడుతుండగా, కొందరు వ్యక్తులు ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నరికివేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఒకటో, రెండో బైపాస్‌ రహదారుల వెంబడి పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని నిర్మిస్తున్న సందర్భంలో ఇంటి యజమానులు నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి చెట్లను తొలగిస్తున్నారు. అయినా మున్సిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పట్టణ ప్రజలు వాకింగ్‌ చేయడానికి ఎంతోగానో దోహదపడుతున్న ఆయా మార్గాల్లో చెట్లు నరికివేస్తున్న వారిపై మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకొని పచ్చదనాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. 


పరిశీలించి చర్యలు చేపడతాం

పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు విరివిగా మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నాం. బైపాస్‌ రహదారుల వెంబడి ఇళ్ల నిర్మాణం చేస్తున్నవారు చెట్లను తొలగిస్తే గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.
- అన్వేష్, కమిషనర్, మున్సిపల్, వేములవాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని