logo

వామ్మో.. గుంతలు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated : 04 Jul 2024 02:53 IST

అసంపూర్తిగా రహదారులు, మురుగుకాలువలు
రాకపోకలకు తీవ్ర అవస్థలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

లక్ష్మీనగర్, రాఘవేంద్రనగర్‌ల మధ్య శిథిలమైన సీసీ రోడ్డు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్మార్ట్‌సిటీ పరిధిలో లేని డివిజన్లలో అంతర్గత, విలీన కాలనీల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వర్షానికి నీరు నిండి గుంతల లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఉండగా కనీసం మరమ్మతుకు నోచుకోవడం లేదనే అభిప్రాయముంది.

కట్టరాంపూర్‌ మీదుగా గిద్దెపెరుమాండ్లనగర్‌ వెళ్లే రహదారి పరిస్థితి..  

తవ్వారు.. వదిలేశారు

నగర పరిధిలోని 60 డివిజన్లలో సుమారు 60 ప్రాంతాల్లో రహదారులు, మురుగుకాలువలు తవ్వి వదిలేశారు. ముఖ్యమంత్రి హామీ (సీఎంఏ) నిధులతో ప్రారంభించి.. ఏడు నెలలుగా ఆ పనులు పెండింగ్‌లో పెట్టారు. కంకర పోసి వదిలేయడంతో  నడిచి వెళ్లే వాకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో ఇంటి ముందు ర్యాంపులు  కట్టుకోకుండా వదిలేశారు. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు నిర్మించి అనుసంధానం చేయకుండా వదిలేశారు. మురుగు, వరద  నిలిచి రోడ్లపై ప్రవహిస్తోంది. పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేయలేని   పరిస్థితిలో ఉన్నారు. ఈ పనులు పూర్తి చేసినట్లేయితే కనీసం ఈ వర్షాకాలంలో ఈ ప్రాంతాల్లో సమస్యలు దూరమయ్యేవి.

అశోక్‌నగర్‌లో రోడ్డుపై నిలిచిన నీరు

వీధులు బురదమయం..

శివారు కాలనీల్లో వర్షానికి మట్టి రహదారులు బురదమయంగా మారాయి. బీటీ, సీసీ రోడ్లు పలు కారణాలతో తవ్వడంతో అవి గుంతలు పడి నీరు నిలిచి ఉంటుంది. కట్టరాంపూర్, జీపీనగర్, అయోధ్యనగర్, రేకుర్తి, తీగలగుట్టపల్లి, అశోక్‌నగర్, సీతారాంపూర్, బాలాజీనగర్, హుస్సేనీపుర, లక్ష్మీనగర్, గాయత్రీనగర్, రాఘవేంద్రనగర్, కోతిరాంపూర్, సుభాష్‌నగర్, బోయవాడ, తిరుమల్‌నగర్, హనుమాన్‌నగర్, విద్యానగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.

రెడ్‌హిల్స్, అయోధ్యకాలనీలో అసంపూర్తిగా మురుగుకాలువల నిర్మాణం


వారంలో పనులు ప్రారంభం

నగర వ్యాప్తంగా తవ్వి వదిలేసిన రోడ్లు, డ్రైనేజీల పనులు పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారును ఆదేశించడం జరిగింది. వారం, పది రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయి. తద్వారా అత్యధిక ప్రాంతాల్లో కొంతమేర సమస్యలు దూరమవుతాయి.

వై.సునీల్‌రావు, మేయర్, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని