logo

సమస్యలు విని.. పరిష్కారానికే హామీ!

ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్‌ నగరపాలక మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు.

Updated : 04 Jul 2024 05:07 IST

50కి పైగా ఫిర్యాదులు.. మేయర్‌ సత్వర స్పందన
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం,  కార్పొరేషన్‌

ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్‌ నగరపాలక మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. బుధవారం నగర మేయర్‌తో ‘ఈనాడు’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వారి సమస్యలు విన్న ఆయన పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. సుమారు 50కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ జి.స్వరూపరాణి, ఈఈ ఆర్‌.యాదగిరి, ఇన్‌ఛార్జి ఏసీపీ శ్రీహరి, డీఈఈలు ఓంప్రకాశ్, లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఆయూబ్‌ఖాన్, ఆర్వో ఆంజనేయులు, టీపీఎస్‌లు రాజ్‌కుమార్, సంధ్య, శానిటేషన్‌ ఇన్‌ఛార్జి వెంకన్న, పర్యావరణ ఇంజినీరు స్వామి తదితరులు పాల్గొన్నారు.

సమస్య: వీధిదీపాల ఫిర్యాదుల కోసం వాట్సాప్‌ నంబర్‌ ఇవ్వండి. ప్రధాన కూరగాయల మార్కెట్‌లో జీ/34/2 విద్యుత్తు స్తంభానికి వీధి లైటు వెలగడం లేదు. అశోక్‌నగర్‌ ఇం.నం.6-2-19/ఎ/1 వైపు నాలుగు స్తంభాలకు లైట్లు రావడం లేదు. వావిలాలపల్లి ఇం.నం.3-7-392 దగ్గర వీధిలైటు వెలగడం లేదు.

ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, సుధాకర్‌రావు

సమాధానం: వెంటనే మరమ్మతులు చేయిస్తాం.

2వ డివిజన్‌ విద్యారణ్యపురి రోడ్డు నంబర్‌ 1, 2 మధ్యలో ఓ పెట్రోల్‌ బంకు ఉండగా సమీపంలోని వంద మీటర్ల పరిసరాల్లోని ఇళ్లల్లో ఉన్న బోర్‌లలో డీజిల్, పెట్రోల్‌ వాసన వస్తుంది.?

శ్రీనివాస్‌

క్షేత్రస్థాయిలో పరిశీలించి పౌరసరఫరాల సంస్థకు లేఖ రాస్తాం.

విద్యారణ్యపురి రోడ్డు నంబర్‌ 1 బతుకమ్మ చౌరస్తా సమీపంలో రోడ్డు మీదనే షెడ్డు వేసి కార్లు, ఇతర వాహనాలు పార్కింగ్‌ చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది? ఆరెపల్లి రోడ్డు గాయత్రీనగర్‌ రోడ్డు నం.3లో రహదారి ఆక్రమించి రేకుల షెడ్డు వేస్తున్నారు. ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. రోడ్డు నంబర్‌లో 4లో రహదారి కబ్జా చేస్తున్నారు?

సయ్యద్, ఆర్‌.శ్రీనివాస్, నాగేశ్వర్‌

క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారు. రహదారి కబ్జా విషయాన్ని అధికారులు వచ్చి డాక్యుమెంట్లు పరిశీలించి చర్యలు తీసుకుంటారు.

దివ్యాంగుల పింఛను కోసం దరఖాస్తు చేశాను. ఇంటికి వచ్చి విచారించి వెళ్లి పోయారు? ఇప్పటికి పింఛను రావడం లేదు?

సులోచన

ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత వస్తాయి.

కోతిరాంపూర్, హనుమాన్‌నగర్‌ వైపు వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది.?

కె.సత్యనారాయణ

పట్టుకునేలా ఆదేశాలిస్తాం.

చిరు వ్యాపారుల కోసం కట్టిన దుకాణాలు ఇప్పించాలి?

లక్ష్మీనారాయణ

కొందరు కోర్టుకెళ్లారు. నెలాఖరులోగా కేటాయించేలా చర్యలు తీసుకుంటాం.

విద్యారణ్యపురి రోడ్డు నంబర్‌ 1 వైపు ఓ అపార్టుమెంట్‌ దగ్గర మురుగు నీరంతా రోడ్డు మీదికి వస్తోంది. 19వ డివిజన్‌ మైత్రీవనం రోడ్డు నంబర్‌ 5లో రెండేళ్ల కిందట కచ్చా కాలువ తీసి వదిలేశారు. చెట్లు పెరిగి పాములు వస్తున్నాయి.?

వెంకటేశ్వరరావు, మల్లికార్జున్‌ 

అధికారులు పరిశీలించి కచ్చాకాలువ తీసేలా ఆదేశించాం.

గతేడాది డిసెంబర్‌లో పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేశాను. ఇప్పటికి పరిష్కారం కాలేదు. ఆస్తిపన్ను తరహాలోనే నల్లా బిల్లులు ఆన్‌లైన్‌లో తీసుకోవాలి. 11వ డివిజన్‌ కట్టరాంపూర్‌లో ఇంటిపన్ను తనకు ఎక్కువ వస్తుందని, పక్కన పెద్ద భవనం ఉండగా తక్కువ వస్తోంది.?

ఎస్‌.ఉమాదేవి, ప్రభాకర్‌రావు, రమేశ్‌

దరఖాస్తు పరిశీలించి పేరు మార్పిడి చేశారు. మీరు ఆన్‌లైన్‌లో చూసుకోవాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో క్రమబద్ధీకరణ చేస్తున్నారు. ఆ ప్రతిపాదన ఉంది.

హనుమాన్‌నగర్, వినాయకనగర్‌లలో సీఎంఏ నిధుల కింద రోడ్డు మంజూరైంది. పనులు చేయడం లేదు. అశోక్‌నగర్‌ ప్రధాన రహదారిలో డ్రైనేజీ, రోడ్డు పనులు చేయడం లేదు. 19వ డివిజన్‌ కంటి ఆసుపత్రి సమీపంలో ఇం.నం.9-26/1/1/1 వైపు శ్లాబు కల్వర్టు వేయకుండా వదిలేశారు. రేకుర్తిలోని టీకేఆర్‌ జంక్షన్‌ నుంచి డ్రైనేజీ నిర్మించారు. మైత్రీవనం రోడ్డు నం.3లో ఇం.నం.9-100008 దగ్గర డ్రైనేజీ ఆపేశారు. కమాన్‌ కూడలిలో ఒకవైపు వర్షం నీరు నిలుస్తోంది. కట్టరాంపూర్‌లో రోడ్డు పనులు పూర్తి చేయాలి? బొమ్మవెంకన్న చౌరస్తా నుంచి అశోక్‌నగర్‌ వైపు రోడ్డు బురదగా మారుతుంది. వెంకటసాయి థియేటర్‌ వెనుకాల రోడ్డు వేయకుండా వదిలేశారు?

శ్రీనివాస్, బి.ఉదయ, జమీల్‌ అహ్మద్‌ఖాన్, డాక్టర్‌ రమణకుమార్, పి.కిషన్‌రెడ్డి, నవీన్‌కుమార్‌

పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తాం. చెత్తను వేయకుండా సమీప ఇంటి యజమానులు కట్టడి చేయాలి. నోటీసులు జారీ చేసి జరిమానా వేస్తాం.


సత్వర స్పందన

చేపల మార్కెట్‌లో వీధిలైటుకు మరమ్మతు చేస్తున్న సిబ్బంది

‘ఈనాడు’ ఫోన్‌ ఇన్‌లో వచ్చిన ఫిర్యాదులపై అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. పేరు మార్పిడి సమస్య పరిష్కరించడంతోపాటు వీధి దీపానికి మరమ్మతు చేయించినట్లు మేయర్‌ ఫిర్యాదుదారుడికి సమాచారం ఇచ్చారు. 32వ డివిజన్‌లోని ఖాళీ స్థలంలో చెత్తను శుభ్రం చేయించారు. మార్కెట్‌లో, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో వెలగని వీధిలైట్లకు మరమ్మతులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని