logo

ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం

నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి.

Published : 04 Jul 2024 02:42 IST

ప్రభుత్వం చొరవ చూపితేనే భరోసా
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

మరమగ్గాలపై వస్త్రోత్పత్తులు

నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. లేకుంటే పస్తులు అన్న చందంగా మారింది. కుటుంబ పోషణకు తోడు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మూణ్నెళ్లలో వివిధ కారణాలతో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి కుటుంబాలు మరింత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.

జిల్లాలో ఆరు చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో 74 మంది కార్మికులు పని చేస్తున్నారు. 30,352 మరమగ్గాలకు వివిధ రంగాల్లో 6,500 మంది కార్మికులున్నారు. చేనేత, మరమగ్గాలపై పని చేసే వారికి టీ నేతన్న యాప్‌లో హెల్త్‌కార్డులు వస్తున్నా వాటి వినియోగంపై స్పష్టత లేదు. గతంలో ఏదైన అనారోగ్య సమస్య తలెత్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల వరకు తిరిగి చెల్లించేది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందే అవకాశం ఉన్నా చాలా మందికి తెల్ల రేషన్‌కార్డు లేదు. వీరు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గతేడాది ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా అప్పటి చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోగ్య బీమాను రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య బీమా పథకం ఊసేలేదని నేతన్నలు వాపోతున్నారు.

నేతన్న బీమా పథకంలో 60 మంది చేనేత, 4,644 మంది మరమగ్గాల కార్మికులు నమోదు చేసుకున్నారు. దీనిలో నమోదైన కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు రూ.5 లక్షలు అందుతాయి. ఇటీవల కాలంలో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోగా వారిలో ఇద్దరు మాత్రమే బీమాకు అర్హులు. దీనిలో కొంత మంది వయసు పైబడినవారు ఉన్నారు. మరికొందరు నమోదు చేసుకోలేని వారు కూడా ఉన్నారు. నేత వృత్తిలో పని చేసేవారిలో ఎక్కువగా వయసు పైబడిన వారు ఉంటారు. దీనిలో వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచేలా గత ప్రభుత్వం మరమగ్గాల కార్పొరేషన్‌ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. ఇది కార్యరూపం దాల్చలేదు. బీమా పథకం ప్రారంభమైన 2022 నుంచి ఇప్పటి వరకు 38 మంది నేతన్నలు మృతి చెందగా వారిలో 27 మందికి బీమా డబ్బులు అందాయి. 11 మందివి ఎల్‌ఐసీ పరిశీలనలో ఉన్నాయి.

చేనేత మిత్ర కింద త్రిఫ్ట్‌ ఫండ్‌ మనీ సేవింగ్‌ స్కీం (టీఎఫ్‌ఎంఎస్‌ఎస్‌) పేరుతో పొదుపు పథకం అమలవుతోంది. చేనేతలో నెలకు కార్మికులు రూ.వెయ్యి జమ చేస్తే ప్రభుత్వం రూ.2 వేలు కలుపుతుంది. అలాగే మరమగ్గాల్లో రూ.వెయ్యికి ప్రభుత్వం రూ.వెయ్యి జమ చేస్తుంది. 36 నెలల తర్వాత ఈ పథకంలో పూర్తి డబ్బులు పొందవచ్చు. జిల్లాలో 5,720 మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. కాగా 2023 జూన్‌ నుంచి ప్రభుత్వం తరఫున జమ కావాల్సిన నిధులు అందడం లేదు. దీంతో కార్మికులు అయోమయంలో పడ్డారు.


ప్రభుత్వం నుంచి జమ కావాలి

త్రిఫ్ట్‌ పథకంలో రెండేళ్లకు పైగా నా వంతు డబ్బులు బ్యాంకులో జమ చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి జమ కావడం లేదు. నేత కార్మికుల సమస్యలపై దృష్టిసారించి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. హెల్త్‌కార్డులు ఇచ్చారు గానీ అవి ఎక్కడ ఉపయోగపడతాయో చెప్పడం లేదు.

వంగల శంకరయ్య, మరమగ్గాల కార్మికుడు, బీవైనగర్‌


ఉన్నతాధికారులకు తెలియజేశాం

నేత కార్మికుల త్రిఫ్ట్‌ ఫండ్‌ నిధులు జిల్లాకు రూ. 6.16 కోట్లు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. త్వరలోనే జమ చేస్తామన్నారు.

సాగర్, ఏడీ, చేనేత, జౌళిశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని