logo

రైతు రుణమాఫీపై జిల్లాలో కదలిక

రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు.

Published : 04 Jul 2024 02:38 IST

అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభం
న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం

రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి కసరత్తు ప్రారంభించారు. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో (కటాఫ్‌) తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. దీంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి.

జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ హామీని ఆచరణలో పెట్టినా మొదటి విడతలో రూ.25 వేలు వరకు, రెండో విడతలో రూ.50 వేల వరకు మాత్రమే మాఫీ చేసింది. దీనివల్ల కొంత మంది రైతులకు ప్రయోజనం కలిగింది. రూ.75 వేలు, రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న మిగతా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తోన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అయితే 10 వేలకు పైగా రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదు. జిల్లా వ్యాప్తంగా 61,343 మంది రైతులు ఉండగా, ఇందులో 40,567 మంది రైతులకు రూ.240 కోట్లను ఇది వరకే మాఫీ చేశారు. మరో 10,756 మంది రైతులకు మాఫీ చేయాల్సి ఉంది. మిగిలినవి ఆధార్‌ లింకేజీ లేకపోవడం, ఆధార్‌ నంబర్‌ తప్పుగా ఇవ్వడం, రైతులు మరణించడం వంటి కారణాల వల్ల రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.

కటాఫ్‌ తేదీలు..

2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ రుణమాఫీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ బ్యాంకర్లతో సమీక్షాసమావేశం నిర్వహించి బ్యాంకు రుణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ అయ్యేలా చూడాలని, రుణమాఫీ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగా రైతుల బ్యాంకు ఖాతా ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఆధార్‌ నంబర్‌ ఆధారంగా నకిలీ బ్యాంకు ఖాతాలను గుర్తించి, అర్హులైన వారందరికి మాత్రమే రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపడుతున్నారు.

బంగారం తాకట్టుపెట్టి తీసుకుంటే...

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాలను అనుసరించి తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు మాఫీ చేయబోమని తేల్చి చెప్పింది. కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్నవారు, పిల్లల పెళ్లిళ్ల అనంతరం హక్కులు బదలాయించిన వారిలో ఎవరైన కటాఫ్‌ తేదీల మధ్య రుణాలు చెల్లిస్తే వారికి మాఫీ వర్తింపజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రెన్యువల్‌ చేయించకుంటే అనర్హులు?

గత ప్రభుత్వం రైతులకు నాలుగేళ్లలో దశల వారీగా రుణమాఫీ వర్తింపజేసింది. రూ.25 వేలు, రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేసింది. ఈ క్రమంలో రుణాలను సకాలంలో రెన్యువల్‌ చేయించని వారికి మాఫీ కాదు. కొత్త ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్‌ తేదీల్లోనూ వీరికి చోటు దక్కలేదు. జిల్లాలో ఇలాంటి రైతులు సహకార సంఘాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని