logo

గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు

ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ). ఎన్‌క్వాస్‌ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్‌ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు.

Published : 04 Jul 2024 02:37 IST

ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కిన ఆరోగ్య కేంద్రాల పరిస్థితి  
న్యూస్‌టుడే, వేములవాడ గ్రామీణం

ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్‌క్వాస్‌ బృందం (పాత చిత్రం)

ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ). ఎన్‌క్వాస్‌ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్‌ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. ప్రహరీ నిర్మాణం ఇతర పనులు చేపట్టిన వాటికి రూ.4 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా ఈ పీహెచ్‌సీకి ఇటీవల ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కింది. దీంతో ఏటా ఆసుపత్రి అభివృద్ధి కోసం ఏటా రూ. 3 లక్షల నిధులు జమకావాల్సి ఉంది. నిధులు జమైతే పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంది.

జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి, వేములవాడలోని ఏరియా ఆసుపత్రితోపాటు హన్మాజీపేట, లింగన్నపేట, విలాసాగర్, బోయినపల్లి, కొదురుపాక, నేరెళ్ల, చీర్లవంచ, తంగళ్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కోనరావుపేట, చందుర్తి, పోత్గల్, ఇల్లంతకుంటలో ఇరవై నాలుగు గంటల పీహెచ్‌సీలు ఉన్నాయి. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సిరిసిల్లలోని బీవైనగర్, పీఎస్‌నగర్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించే ఆరోగ్య కేంద్రాలను నేషనల్‌ హెల్త్‌ సిస్టిమ్‌ రిసోర్స్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం ఆసుపత్రిలో సేవలను పరిశీలిస్తుంది. ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రం సేవలు ఉంటే నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌ (ఎన్‌క్వాస్‌) గుర్తింపు లభిస్తుంది. ఎన్‌క్వాస్‌ గుర్తింపు ప్రతి పీహెచ్‌సీకి దక్కాలన్న లక్ష్యంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించారు. వీటితో ఫర్నిచర్, వార్డుల్లో వసతులు, పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణం తదితర పనులు చేపట్టారు.

సేవలకు...

జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో అందిస్తున్న సేవలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో కేంద్ర బృందాలు వాటిని పరిశీలించాయి. ఆరు విభాగాల్లో ఎనిమిది అంశాలను చూశాయి. ఆరోగ్య కేంద్రంలో సేవలు, నిర్వహణ, రికార్డులు, ఓపీ, ఇన్‌పేషెంట్, ల్యాబ్, లేబర్‌ రూమ్, నేషనల్‌ హెల్త్‌ ప్రోగ్రాం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్నారు. జిల్లాలో కొదురుపాక, బోయినపల్లి, విలాసాగర్, తంగళ్లపల్లి, నేరెళ్ల, లింగన్నపేట, హన్మాజీపేట, సిరిసిల్ల, వేములవాడ, పీఎస్‌నగర్, కోనరావుపేట ఆసుపత్రులకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కింది. వీటికి ఏటా రూ.3 లక్షల చొప్పున మూడేళ్లపాటు కేంద్రం నిధులు అందిస్తుంది. వీటిని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, పరికరాల కొనుగోలుకు వినియోగించవచ్చు. అయితే ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కినప్పటికీ ఏ ఒక్క ఆరోగ్య కేంద్రానికి ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు. కేవలం ప్రొసీడింగ్స్‌ మాత్రమే ఇచ్చారు. నిధులు జమ కాకపోవడంతో ఆసుపత్రుల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం

ఎన్నికల నిర్వహణ, కోడ్‌ కారణంగా నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. ఎన్‌క్వాస్‌ ప్రోత్సాహకాలు అందించాల్సిందిగా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. నిధులు వస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. త్వరలో వస్తాయని భావిస్తున్నాం.
విద్యాసాగర్, జిల్లా హెల్త్‌ క్వాలిటీ మేనేజర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని