logo

అందని బిల్లులు.. చేసేదెలా పనులు!

గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Published : 04 Jul 2024 02:35 IST

వేసవిలో తాగునీటి వనరులకు మరమ్మతు
నెలలు గడుస్తున్నా తప్పని నిరీక్షణ
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

చిత్రంలో కనిపిస్తోంది ఎలిగేడు మండలకేంద్రంలో తాగునీటి పైపులైన్‌ గేటువాల్వు. లీకేజీ మరమ్మతు కోసం గొయ్యి తవ్వారు. పనులు పూర్తయ్యాక కొత్త గేట్‌వాల్వ్‌ బిగించడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలిగాయి.

గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు దగ్గరుండి పనులు చేయించడంతో తాగునీటి సమస్య తొలగింది. అక్కడివరకు బాగానే ఉన్నా పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదు. గతంలో చేసిన పనుల్లో మళ్లీ లీకేజీలు ఏర్పడుతుండటంతో కలుషిత నీటి కష్టాలు తప్పడం లేదు.

171 పనులు.. రూ.1.83 కోట్లు

జిల్లాలోని 266 పంచాయతీల్లో మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా మొత్తం 1,47,579 కనెక్షన్లున్నాయి. జిల్లావ్యాప్తంగా 171 పనులకు రూ.1.83 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పైపులైన్ల లీకేజీని అరికట్టడంతో పాటు వృథాగా ఉన్న చేతిపంపులను వినియోగంలోకి తీసుకొచ్చారు. తాగునీటి బావుల్లో పూడిక తొలగించారు. పాడయిన మోటార్లకు మరమ్మతు చేశారు. కొన్ని చోట్ల బోర్లను అద్దెకు తీసుకున్నారు. జిల్లా అధికారుల ఆదేశాలతో గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పాయి.

నిధుల కోసం వెదుకులాట

మూడు నెలల కిందట పనులు హడావుడిగా చేయడంతో లీకేజీ సమస్య మళ్లీ ఎదురవుతోంది. వానాకాలంలో లీకేజీలతో తాగునీరు కలుషితమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేతిపంపులు మొరాయిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో అనుమతి లేకుండానే పనులు చేశారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపు లేక నిధుల కోసం వెదుక్కోవాల్సి వస్తోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నయా పైసా రాలేదు

ధర్మారం: ఖిలావనపర్తిలో ఓఅండ్‌ఎం కింద అయిదు బోరుబావులను రూ.50 వేలకు పైగా వెచ్చించి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ మరమ్మతు చేయించారు. పనులు పూర్తి చేసి రెండు నెలలవుతున్నా ఇప్పటికీ నయా పైసా రాలేదు. ఒక్క ఖిలావనపర్తే కాదు, మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. తాను రూ.1.20 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటికీ బిల్లులు రాలేదని మరో గ్రామ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా పంచాయతీ కార్యదర్శులకు బదిలీల ప్రక్రియ మొదలవనుండగా స్థాన చలనం కలిగితే పెట్టిన ఖర్చులు వస్తాయో లేదోనని కార్యదర్శులు వాపోతున్నారు.


అయిదు గ్రామాల్లో అప్పు తెచ్చి పనులు

కాల్వశ్రీరాంపూర్‌లో చేతి పంపునకు మరమ్మతు

కాల్వశ్రీరాంపూర్‌: ఓఅండ్‌ఎం(ఆపరేషనల్‌ మెయింటెనెన్స్‌) పథకం ద్వారా మండలంలోని పెద్దంపేట, ఇద్లాపూర్, మడిపల్లికాలనీ, అంకంపల్లి, చిన్నరాతుపల్లి గ్రామాలను ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. అయిదు గ్రామాల్లో అధికారులు అప్పు తెచ్చి మోటార్లు, పైపులైన్లు వేసి తాగునీరు సరఫరా చేయగా ఇప్పటివరకు బిల్లులు రాలేదని అధికారులు తెలిపారు.


ఎంబీ రికార్డులు సిద్ధం చేస్తున్నాం

జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. గుర్తించిన పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి పకడ్బందీగా పూర్తి చేశాం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరిగింది. పనుల ఆధారంగా ఎంబీ రికార్డులు సిద్ధం చేస్తున్నారు. పని విలువ ప్రకారం బిల్లులు మంజూరు చేస్తాం.

శ్రీనివాస్, మిషన్‌ భగీరథ(అంతర్గత విభాగం) ఈఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని