logo

విచారణలో వేగం.. సత్వర న్యాయం

కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు.

Published : 04 Jul 2024 02:31 IST

కొత్త చట్టాల్లో ఆధునిక సాంకేతికతే కీలకం
రామగుండం పోలీస్‌  కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌
ఈనాడు, పెద్దపల్లి

కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. పాత చట్టాలైన భారత శిక్షా స్మృతి(ఐపీసీ) స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), నేర శిక్షా స్మృతి(సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారత సాక్ష్యాధార చట్టం(బీఎస్‌బీ) స్థానంలో భారతీయ సాక్షా అధినీయం(బీఎస్‌ఏ) అమలులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ప్రశ్న: కమిషనరేట్‌ పరిధిలో కొత్త చట్టాల అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టారు?
జవాబు:
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని 44 ఠాణాల్లో మొత్తం 1,232 మంది పోలీసు సిబ్బందికి కొత్త చట్టాలపై సమగ్ర శిక్షణ ఇచ్చాం. ఈ ఏడాది మే 27 నుంచి జూన్‌ 30 వరకు 25 బ్యాచ్‌లుగా విభజించి నిపుణులతో అవగాహన కల్పించాం. సోమవారం నుంచే కమిషనరేట్‌ పరిధిలో కేసులు నమోదు చేశాం. మంగళవారం నాటికి మంచిర్యాల జిల్లాలో 3, పెద్దపల్లి జిల్లాలో ఒక కేసు చొప్పున మొత్తం 4 కేసులు నూతన చట్టాల సెక్షన్ల కింద నమోదు చేశాం.

ప్ర: ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా?
జ:
కొత్త చట్టాలపై సన్నిహిత కౌంటర్లకు వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులతో పాటు విద్యాసంస్థల్లో, గ్రామాల్లో యువతకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నాం. పోలీసు కళాజాత బృందాలతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ప్రత్యేకంగా కమిషనరేట్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో ‘కమ్యూనిటీ కాంటాక్ట్‌’ పేరిట నేరాల నిర్మూలనతో పాటు కొత్త చట్టాల విధి విధానాలపై వివరిస్తున్నాం.

ప్ర: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారా?
జ:
మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు మించి వయసున్న వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. నివసిస్తున్న చోటు నుంచే పోలీసుల సాయం తీసుకోవచ్చు. ముందుగా 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించి తమ అనారోగ్య పరిస్థితిని వివరించి అవసరం చెబితే పోలీసులు సాయం చేస్తారు.

ప్ర: సాక్షులకు కొత్త చట్టాల్లో ఎలాంటి రక్షణ కల్పించారు?
జ:
సాక్షుల రక్షణ బాధ్యత పోలీసులదే. సాక్షిపై ఎవరైనా బెదిరింపులు, దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. ఇక కోర్టు ట్రయల్‌ సమయంలో గతంలో న్యాయమూర్తి ఆదేశాలకు అనుగుణంగా నిందితులు, బాధితులకు సిబ్బంది నేరుగా సమన్లు అందించేవారు. ఇకపై ఆన్‌లైన్‌ సాయంతో సామాజిక మాధ్యమాల సాయంతో చేరవేస్తారు. ఇకపై సమన్లను నేరుగా ఇవ్వాల్సిన పని లేదు.

ప్ర: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు ఎలా ఉండబోతోంది?
జ:
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించి ‘భరోసా’ కేంద్రాల ద్వారా సాంత్వన చేకూర్చాలి. కేసు విచారణ ఆలస్యం కాకుండా కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి. దీంతో సత్వర న్యాయం లభించనుంది.

ప్ర: ఆరు నెలలుగా కమిషనరేట్‌ పరిధిలో నేరాల పరిస్థితి?
జ:
కమిషనరేట్‌ పరిధిలో రహదారి ప్రమాదాలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 19 రౌడీషీట్లు తెరిచాం. నాన్‌బెయిలబుల్‌(వారెంట్లు)-328, సైబర్‌ నేరాలు-157, పీడీఎస్‌ బియ్యం-66, నకిలీ పత్తి విత్తనాల విక్రయం-12, రహదారి ప్రమాదాలు-440, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌-6,726, అత్యాచారాలు-49, పోక్సో-63, కొత్త చట్టం కింద-4 కేసులు నమోదయ్యాయి.

ప్ర: ఎఫ్‌ఐఆర్‌ నమోదులో తీసుకొచ్చిన సంస్కరణలేమిటి?
జ:
కొత్త చట్టం ద్వారా ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు. ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌కు సైతం అవకాశం కల్పించారు. వ్యక్తిగత హాజరుతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చు. ముందు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తర్వాత సంబంధిత ఠాణాకు బదిలీ చేస్తే వారు ‘రీ-రిజిస్ట్రేషన్‌’ చేసి, దర్యాప్తు జరుపుతారు. కొన్ని ఘటనల్లో ప్రాథమిక స్థాయి నిర్ధారణ తదుపరి కేసు నమోదు చేసే వెసులుబాటు కల్పించారు. రెండు వారాల గడువు కూడా ఇచ్చారు. చోరీ, మోసం కేసుల్లో సొత్తు త్వరితగతిన రికవరీ చేసేందుకు పోలీసులకు అవకాశం కల్పించారు.

ప్ర: నిందితుల విషయంలో ఎలాంటి సవరణలు కల్పించారు?
జ :
అరెస్టయిన వ్యక్తి స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేసే అవకాశం కొత్త చట్టం కల్పిస్తోంది. నేరం, శిక్షలు తదితర వివరాలన్నీ రాతపూర్వకంగా తెలియజేస్తాం. ఈ చట్టంలో వీడియోగ్రఫీ ప్రక్రియ ముఖ్యమైంది. హేయమైన నేరాల్లో వాంగ్మూల నమోదులో వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు. దోపిడీ, హత్యలు, చోరీలు తదితర కేసుల్లో వీడియో కచ్చితం చేశారు. గతంలో ఫొటోలు తప్పనిసరి ఉండేది. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా నమోదు చేయాలి. ఇంతకు ముందు దృశ్యీకరణ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆడియో కూడా అవసరమే.
ప్ర: ప్రజా ప్రయోజనాలు ఎలా ఉంటాయి?
జ:
నూతన చట్టాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాం. గతంలో బాధితులు నేరుగా ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఈ చట్టంతో ఇంటి నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, మెయిల్, ఎక్స్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఈ-మాధ్యమంలో కేసు నమోదు మొదలు విచారణ పూర్తయ్యే వరకు సమగ్ర సమాచారం అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని