logo

నాణ్యత ప్రశ్నార్థకం!

మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి..

Published : 04 Jul 2024 02:28 IST

వరుసగా వంతెన గడ్డర్లు కూలడంపై విస్మయం
ఈనాడు, పెద్దపల్లి , న్యూస్‌టుడే, ముత్తారం

మానేరు వంతెనపై కూలిన గడ్డర్లు

మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి..

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామం, ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ 2016 ఆగస్టు 4వ తేదీన రూ.47.40 కోట్ల అంచనాతో కిలోమీటర్‌ దూరం వంతెన నిర్మాణానికి అప్పటి రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మిస్తున్న క్రమంలోనే భారీ వరదలకు నిర్మాణ సామగ్రి  దెబ్బతినడంతో రెండేళ్ల క్రితం గుత్తేదారు పియర్లపై గడ్డర్లను అనుసంధానం చేసే క్రమంలో అవి కూలిపోకుండా ఉండేందుకు చెక్క ముక్కలను పెట్టారు. వాటిని పూర్తి స్థాయిలో బిగించలేదు. మానేరు వాగు రెండేళ్లు భారీ వరదలతో ఉద్ధృతంగా ప్రవహించడంతో సపోర్టుగా ఉన్న చెక్కముక్కలు ధ్వంసమయ్యాయి. దీంతో గిడ్డర్లు పట్టు తప్పాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 22న మూడు గడ్డర్లు కుప్పకూలాయి. అప్పుడు విచారణ జరిపిన అధికారులు చెక్కముక్కల ధ్వంసమవడంతోనే గడ్డర్లు కూలాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు రావడంతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. మంగళవారం మరోసారి అయిదు గడ్డర్లు నేలకూలాయి. రెండు సందర్భాల్లోనూ గాలి దుమారం బాగా వచ్చినప్పుడే కుప్పకూలాయని ఓడేడు గ్రామస్థులు పేర్కొంటుండగా గాలి దుమారానికి గడ్డర్లు కుప్పకూలే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. వాస్తవానికి కాంక్రీట్‌ గడ్డర్లు చాలా బరువు కలిగి ఉంటాయి. వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించాలంటే ఇవి బలోపేతంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అలాంటి గడ్డర్లు పేకమేడల్లా కూలిపోవడం గమనార్హం. డిజైనింగ్‌ సరిగా ఉందా.. నిర్మాణానికి ముందు భూమి పరీక్ష చేశారా.. పనులు చేసే సమయంలో పర్యవేక్షణ సరిగా ఉందా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.


కాంక్రీట్‌ బీమ్‌ సరిగా లేకే..

ఒక్కో గడ్డరు 130 టన్నుల బరువుతో ఉంటుంది. కిలోమీటర్‌ వంతెన నిర్మాణానికి 120 గడ్డర్లు అవసరమయ్యాయి. ఇందులో 58 వంతెనకు అనుసంధానించగా మిగిలిన 62 ఇంకా బిగించలేదు. ఏప్రిల్‌ 22, జులై 2న కూలిన గడ్డర్లు మొదటగా అనుసంధానించిన 58 గడ్డర్లలోనివి. కాంక్రీట్‌ బీమ్‌లు సరిగా వేయకపోవడంతోనే కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నాం. మిగతా గడ్డర్లు కూడా నిర్మించిన వెంటనే అనుసంధించకుండా వదిలేశారు. ఇవి కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూలిన గడ్డర్లకు గ్యాస్‌ వెల్డింగ్‌ వేసి వంతెనకు అనుసంధానించేందుకు ప్రయత్నించినా నిలవడం లేదు. ఈ పనులు చేసిన గుత్తేదారు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఆయన నుంచి జరిగిన నష్టం వసూలు చేస్తాం. మిగిలిన పనులు వేరే గుత్తేదారుకు అప్పగించి పనులు పూర్తి చేస్తాం. వంతెన పనులు పూర్తి స్థాయిలో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం.

జాఫర్, డీఈ, ఆర్‌అండ్‌బీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని