logo

నూతన ఒరవడి.. పెరిగేనా దిగుబడి

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు.

Published : 04 Jul 2024 02:27 IST

అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుకు ప్రణాళిక
లక్ష్యాన్ని విధించిన జాతీయ పత్తి పరిశోధన సంస్థ
న్యూస్‌టుడే, హుజూరాబాద్‌

గతేడాది సైదాపూర్‌ మండలం గొడిశాలలో అధిక సాంద్రత పత్తి సాగు 

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ ప్రత్యేక సాగు విధానంలో అధిక దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

524 ఎకరాల్లో సాగు లక్ష్యం

కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 524 ఎకరాల్లో అధిక సాంద్రత పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ బాధ్యతల్ని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు అప్పగించింది. నూతన ఒరవడిలో పత్తి సాగు చేసేలా రైతులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. సాధారణ పత్తి సాగుకు భిన్నంగా విత్తనాలను దగ్గర దగ్గరగా విత్తి మొక్కల సంఖ్యను పెంచడమే అధిక సాంద్రత సాగు విధానం. ఇందుకోసం ఎర్రనేలలు, చెల్క నెలలు ఉండే గ్రామాలను ఎంపిక చేస్తున్నారు.

అదనపు పెట్టుబడికి ఆర్థిక ప్రోత్సాహం

సాధారణంగా పత్తి సాగు కంటే అధిక సాంద్రత సాగులో రెతులకు పెట్టుబడి ఎక్కువ కావడంతో ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విత్తనాలు, కూలీలు, యంత్రాల వినియోగం, ఇతర ఖర్చులన్నీ కలిపి సగటున ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల పెట్టుబడి పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ అదనపు పెట్టుబడిని ఎంపిక చేసిన రైతులకు అందించేలా ప్రభుత్వమే ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.

లాభాలు ఇవి..

సాధారణ పత్తి సాగులో ఎకరా విస్తీర్ణంలో 5,555 నుంచి 7,407 మొక్కలు ఉండటం వల్ల 7-8 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. అదే అధిక సాంద్రత సాగు పద్ధతిలో దగ్గరదగ్గరగా 29,629 మొక్కలు ఉంటాయని, తద్వారా ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమున్నట్లు పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా జూన్‌లో పత్తి విత్తుకున్న రైతులు పంట సాగుకు 180-190 రోజులు పడుతుంది. విడతల వారీగా అయిదారు సార్లు పత్తి తీయాల్సి (ఏరడం) ఉంటుంది. అదే అధిక సాంద్రత విధానంలో పంటంతా ఒకేసారి పూత, కాత, దిగుబడి చేతికి వస్తుంది. పంట కాలం కూడా 150-160 రోజులే.. తెగుళ్లు ఆశించకముందే ఒకేసారి పంట చేతి వస్తుంది. విత్తన ఖర్చు కొంత పెరిగినా.. ఎరువులు, పురుగు మందుల ఖర్చులు తగ్గుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పైగా ఒకేసారి పత్తి తీయడం పూర్తయిన వెంటనే పంటను తొలగించి రెండో పంట సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

జాతీయ పత్తి పరిశోధన సంస్థ నిర్దేశించిన మేర అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసేలా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. గతంలో ఈ విధానంలో సాగు చేసిన రైతులకు మంచి దిగుబడులు వచ్చాయి. రైతులను ఎంపిక చేసి సాగు చేసేలా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాం. సాధారణ విధానంలో పత్తి సాగు యాంత్రీకరణకు అనుకూలంగా ఉండదు. అదే నూతన విధానంలో అలాంటి సమస్య ఉండదు. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులతో క్లస్టర్‌ ఏర్పాటు చేసి ఎంపిక చేసిన వారికి ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రోత్సాహం అందించనున్నాం.

వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్త, కేవీకే, జమ్మికుంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని