logo

ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ

పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) నిర్వహిస్తోంది.

Published : 04 Jul 2024 02:25 IST

న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ

రామగుండం ఆదర్శ పాఠశాల

పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు దీనికి అర్హులు.. ఈ పరీక్షలో రాణించిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందజేస్తోంది. ఉమ్మడి జిల్లాలోనే రామగుండం లింగాపూర్‌లోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం అత్యుత్తమ మార్కులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయులు ఎన్‌ఎంఎంఎస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ఉపకార వేతనం సాధించేలా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

అర్హతలు... పరీక్ష విధానం

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే ఉపకారవేతన పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.. వీరు ఏడో తరగతిలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.50, ఇతరులు రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిని ఏటా నవంబరు మాసంలో నిర్వహిస్తారు. జిల్లా యూనిట్గా, కేటగిరీల వారీగా, ప్రతిభ కొలమానంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఈ అర్హత పరీక్ష రాసేలా ప్రోత్సహిస్తున్నారు.

ఆదర్శ పాఠశాల నుంచి ఎంపికైన విద్యార్థులు

2022-2023 : 19
2021-2022 : 23
2023-2024 : 17


ఎంతో సంతోషంగా ఉంది

నేను రామగుండం మోడల్‌ పాఠశాలలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసి అత్యుత్తమ మార్కులు సాధించా. సీనియర్ల సలహాలు, సూచనలతో నిత్యం చదువుపై దృష్టి సారించా. ఉపాధ్యాయుల మార్గదర్శనంలో నమూనా ప్రశ్నపత్రాలతో నిత్యం సాధన చేశా. నా కష్టానికి ఫలితం దక్కింది. ఉపకార వేతనం పొందేందుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.

చిట్టోజు అన్విత, తొమ్మిదో తరగతి


ఉపాధ్యాయుల శిక్షణ బాగుంది

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించా. ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ ఇందుకు ఎంతగానో దోహదపడింది. ఉపాధ్యాయుల చొరవతో ఆన్‌లైన్‌ తరగతుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించా. అనుకున్న విధంగా మంచి ర్యాంకు సాధించి ఉపకార వేతనానికి ఎంపికయ్యా. పాఠశాలలో ప్రత్యక్ష బోధనతో పాటు అంతర్జాలంలో కూడా ప్రతి అంశాన్ని వివరించారు.

ఎం.చక్రిక, తొమ్మిదో తరగతి


సమష్టి కృషితో...

ఈ విద్యా సంవత్సరం రామగుండం మోడల్‌ పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయ్యారు. విద్యార్థులను రీజనింగ్, నెంబరు సిరీస్‌ ఇతర అంశాలపై నిత్యం సన్నద్ధం చేయించాము. సాంఘిక, సామాన్య, గణితంపై ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇచ్చాము. ప్రతి ఏటా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉపకార వేతనాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల సమష్టి కృషితో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

ముత్యం రాజశేఖర్, ఆంగ్ల ఉపాధ్యాయులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని