logo

వర్షాకాలం.. అప్రమత్తతే కీలకం

ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్‌ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

Published : 04 Jul 2024 02:20 IST

విద్యుత్తు ప్రమాదాలతో ఏటా పలువురు మృత్యువాత  
న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం, రాయికల్‌

ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్‌ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. విద్యుత్తు మోటారు స్టార్టరుకు తాకి, విద్యుత్తు తీగలు కంచెలకు తగిలి, దుస్తులు ఆరబెట్టే తీగలకు విద్యుత్తు ప్రసరణ జరిగి, మేత మేస్తూ విద్యుత్తు నియంత్రికలకు తగిలి పశువులు మృత్యువాత పడుతున్నాయి.

జిల్లాలో 20 మండలాల్లో 380 గ్రామ పంచాయతీలు ఉండగా అత్యధికంగా వ్యవసాయమే జీవనాధారం. ఏటా రైతులు వ్యవసాయ పనులకు వెళ్లి తగు జాగ్రత్తలు పాటించక విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలో జిల్లాలో 29 మంది వ్యక్తులు బలికాగా 56 పశువులు మృతి చెందాయి. రాయికల్‌ మండలంలోని అయోధ్య గ్రామంలో స్తంభాల మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు సరఫరా జరిగి వలస కూలీ మృతి చెందగా మరో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారు.


పాటించాల్సిన నియమాలు

వ్యవసాయదారులు: వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి మోటార్లు, స్టార్టర్లు, స్విచ్చ్‌లకు ఉన్న ఇనుప బోర్డులకు విధిగా ఎర్తింగ్‌ చేయించాలి. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్తు మోటార్లను, స్టార్టర్లను, స్విచ్చ్‌లను, బోర్డులను తాక రాదు. నియంత్రికల మరమ్మతుకు విద్యుత్తు సిబ్బందిని మాత్రమే వినియోగించుకోవాలి. పొలాల్లో తెగిపడిన, తక్కువ ఎత్తులో తీగలు ఉంటే అధికారులకు సమాచారం అందించాలి.

గృహ వినియోగదారులు: ఇంటికి ఎర్తింగ్‌ చేయించినప్పుడు కనీసం రెండు ఎర్త్‌ ఎలక్ట్రోర్లను అమర్చాలి. ఏసీ, రిఫ్రిజిరేటర్, గ్రైండర్స్‌ పెద్దగా శబ్దం వస్తే వెంటనే ఆశ్రద్ధ చేయకుండా మెకానిక్‌కు చూపించాలి. ఇంట్లో సొంత మరమ్మతు చేయకూడదు. ఒకే ప్లగ్‌ నుంచి లూజ్‌ తీగల ద్వారా అనేక పరికరాలకు విద్యుత్తు సరఫరా చేయకూడదు. విద్యుత్తు ప్రమాదాలు జరిగితే వెంటనే చేతితో తాకకుండా ఎండు కర్రలతో వేరు చేసి సరఫరా నిలిపివేయాలి. విద్యుత్తు తీగలు వాహనాలపై పడితే హంపింగ్‌(గెంతుట, దుంకుట) విధానం అమలు చేసి దూరంగా జరగాలి.


అవగాహన కల్పిస్తున్నాం

విద్యుత్తు ప్రమాదాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు స్వీయ మరమ్మతు చేయకూడదు. వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం. గ్రామంలో విద్యుత్తు తీగలు నేలవారితే సిబ్బందికి సమాచారం అందించాలి.

సత్యనారాయణ, ఏస్‌ఈ జగిత్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని