logo

శరవేగంగా రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ

రామగుండం రైల్వే స్టేషన్‌ సుందరంగా మారనుంది. అమృత్‌ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్‌ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.

Updated : 04 Jul 2024 05:08 IST

రామగుండం రైల్వే స్టేషన్‌ సుందరంగా మారనుంది. అమృత్‌ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్‌ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. స్టేషన్‌ ముందు భాగంలో ఆకర్షణీయమైన ఎలివేషన్‌తో పాటు ప్రయాణికులు వాహనాలను నిలుపుకోవడానికి ప్రత్యేక పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు లిఫ్టు సౌకర్యంతో పాటు ముందు భాగంలో పాదచారులు లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ ఎదుట ఎలాంటి ఇతర నిర్మాణాలు ఉండకుండా ముందుగానే తొలగించారు. మొదటి దశ పనుల్లో తెలంగాణ వ్యాప్తంగా 21 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపడుతున్నారు. ఇందులో రామగుండంతో పాటు కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ ఉంది. అమృత్‌ పథకంలో భాగంగా మొదటి దశలో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. దీంతో అధికారులు ఆయా పనులను శరవేగంగా చేపడుతున్నారు. ప్రయాణికులు కూర్చునేందుకు విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఆయా పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం ఇటీవల సందర్శించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కాజీపేట-బల్లార్ష మార్గంలో అధిక ఆదాయం వస్తున్న స్టేషన్లలో రామగుండం ఒకటి. ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణికులు ఉండటంతో అందుకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

న్యూస్‌టుడే, గోదావరిఖని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని