logo

కుటుంబ కలహాలతో సైజింగ్‌ కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన సైజింగ్‌ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్‌ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన పల్లె యాదగిరిగౌడ్‌ సైజింగ్‌ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Updated : 04 Jul 2024 05:38 IST

పల్లె యాదగిరి

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన సైజింగ్‌ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్‌ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన పల్లె యాదగిరిగౌడ్‌ సైజింగ్‌ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఇంట్లో గొడవల కారణంగా అతని భార్య తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై వారం రోజుల కిందట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డాడు. ఈక్రమంలోనే మళ్లీ బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య మంజుల, కూతుర్లు లహరి, నిహారిక ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి తెలిపారు.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: హత్యా నేరం కేసుల్లో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురు ఖైదీలు బుధవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. వీరిలో గంభీరావుపేట గజసింగవరానికి చెందిన తండ్రి, అతడి ఇద్దరు కుమారులతోపాటు కరీంనగర్‌ భగత్‌నగర్‌కు చెందిన ఒకరు, గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ఒకరు, రాయికల్‌ మండలం గుడికోట ప్రాంతానికి చెందిన మరొకరు ఉన్నారు. గవర్నర్‌ క్షమాభిక్ష ఆమోదించడంతో మంగళవారం ఆరుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడి నుంచి అధికారికంగా విడుదలయ్యారు.

తప్పు తెలుసుకున్నాం.. కొత్త జీవితం ప్రారంభిస్తాం..

ఈనాడు- హైదరాబాద్‌ : క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. జైలు అధికారుల సాయంతో నైపుణ్యాలకు సానబెట్టుకున్నారు. మానసిక నిపుణుల సూచనలతో చేసిన తప్పు తెలుసుకున్నారు. జీవితాంతం కారాగారవాసం అనుభవించాల్సి వారికి రాష్ట్ర ప్రభుత్వం రెక్కలు తొడిగింది. సత్ప్రవర్తనతో నడుచుకుంటున్న 213 మంది ఖైదీలను బుధవారం విడుదల చేసింది. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన ఖైదీలను ‘ఈనాడు’ పలకరించింది.

జైలుకొచ్చాక జీవితమంటే తెలిసింది

కె.రాజేశ్, కరీంనగర్‌

‘ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయితో సంతోషంగా ఉండేవాణ్ని. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో జీవితకాలం శిక్ష పడింది. 15 ఏళ్ల క్రితం జైలుకొచ్చా. ఇక్కడికొచ్చాక జీవితం విలువ అర్థమైంది. క్రమశిక్షణతో ఉంటూ పెట్రోలు బంకులో పని చేశా. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయాలని ఆదేశించడం, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరో తప్పు జరగకుండా చూసుకుంటా. రెండో జీవితాన్ని క్రమశిక్షణతో.. పిల్లలతో గడుపుతా’.

దొరకని రాయికల్‌ ఎస్సై ఆచూకీ

జగిత్యాల, న్యూస్‌టుడే: ఏసీబీ అధికారుల దాడితో పరారైన రాయికల్‌ ఎస్సై అజయ్‌ ఆచూకీ లభించలేదు. జగిత్యాల జిల్లా రాయికల్‌ ఠాణా ఎస్సైగా పనిచేస్తున్న టి.అజయ్‌ జూన్‌ 11న పట్టుకున్న ఇసుక ట్రాక్టరు విడిపించేందుకు బాధితుడు రాజేందర్‌రెడ్డిని డబ్బులు డిమాండ్‌ చేయగా ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. జూన్‌ 21న రాత్రి ఏసీబీ అధికారులు ఇటిక్యాలకు చెందిన మధ్యవర్తి పుల్లూరి రాజుకు రాజేందర్‌రెడ్డి రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అధికారుల రాకతో పారిపోయిన రాయికల్‌ ఎస్సై 13 రోజులుగా పరారీలోనే ఉన్నారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ ఎస్సై అజయ్‌ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఉందని, ఏసీబీ కేసులో ముందస్తు బెయిలు దొరకడం కష్టమని ఎట్టి పరిస్థితుల్లోనైనా లొంగిపోవాల్సిందేనని అన్నారు. ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని