logo

మొక్కుబడి నిధులు.. విధులు

జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.

Published : 04 Jul 2024 02:13 IST

అయిదేళ్ల కాలంలో ఫలితాలు అంతంత మాత్రమే
నేటితో ముగియనున్న జడ్పీ పాలకవర్గాల పదవీకాలం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి. గ్రామ, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయికి తీసుకెళ్లాలంటే జిల్లా పరిషత్తు సమావేశాలు వేదికగా ఉంటాయి. కాని ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని పలువురు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నేటితో జిల్లా మండల, పరిషత్తుల పాలకవర్గాల గడువు ముగియనుంది.

సభ్యులు ఇలా..

జిల్లా పరిషత్తులో జడ్పీటీసీ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. మండల పరిషత్తు అధ్యక్షులు ఆహ్వానిత సభ్యులు, లోకసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపిన రాజ్యసభ సభ్యులు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, సుడా ఛైర్మన్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, డీసీఎంఎస్, డైరీ ఛైర్మన్‌లు కూడా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు. స్థాయీ సంఘాల్లో మాత్రం జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే సభ్యులుగా ఉంటారు.

ఎవరెవరు..? 

జిల్లాలో కరీంనగర్, హజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్‌ ఎంపీ, పట్టభద్రులు, ఉపాధ్యాయులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు జడ్పీ సభ్యులుగా ఉన్నారు. 

చట్టసభల ప్రతినిధులతో ఎంతో మేలు

జడ్పీ సమావేశాల్లో జిల్లా సమస్యలు చర్చించి పరిష్కారానికి  చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సమావేశాలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైతే నిధులు సాధించడానికి వీలవుతుంది. కానీ గత అయిదేళ్ల కాలం పరిశీలిస్తే ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో కొందరు ఒక్కసారి కూడా హాజరు కాకపోగా.. మరికొందరు ఒకటి, రెండు సమావేశాలకు మొక్కుబడిగా హాజరయ్యారు. ఇప్పటికీ జిల్లా పరిషత్తు 15వ ఆర్థిక సంఘం 2023-24కు సంబంధించి ఒక విడత, 2024-25 రెండు విడుతల నిధులు రాలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరైతే క్షేత్రస్థాయిలో సమస్యలు పూర్తిగా అవగతమై నిధుల విడుదలకు కృషి చేసేందుకు అవకాశముంటుంది కానీ.. సరిగా హాజరు కాకపోవడం, ప్రభుత్వం నుంచి నిధులు సరిగా రాకపోవడంతో గత అయిదేళ్ల జడ్పీ సమావేశాలు మొక్కుబడిగా సాగాయన్న అభిప్రాయం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన గంగుల కమలాకర్, ఈటల రాజేందర్‌లు అడపాదపా సమావేశాలకు హాజరయ్యారు. తాజాగా మంగళవారం చివరి సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చాలాసార్లు హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్యేల్లో కౌశిక్‌రెడ్డి మాత్రమే చివరి సమావేశంలో పాల్గొన్నారు. భారాస ప్రభుత్వ హయాంలో మొత్తం 12 సర్వసభ్య సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మూడు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని