logo

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్‌లో ఓపికగా స్వీకరించారు. 

Published : 02 Jul 2024 06:32 IST

ఒక్క రోజే 370 అర్జీలు

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్‌లో ఓపికగా స్వీకరించారు.విజ్ఞప్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని పాలనాధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బారు దరఖాస్తులనూ క్లియర్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పవన్‌కుమార్,   ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, డీపీవో రవీందర్, ఇతర శాఖల అధికారులు    పాల్గొన్నారు.

ఆసరా కల్పించరూ..

పక్షవాతం, వృద్ధాప్యంతో బాధపడుతున్న తనకు పింఛన్‌ ఇప్పించాలని గన్నేరువరం మండలం పర్లపల్లికి చెందిన  ఇ.వెంకటాద్రి తన భార్యతో కలిసి ప్రజావాణికి వచ్చారు. ఇద్దరు కుమారులు, చిన్నపాటి ఉపాధితో వారు బతుకుతున్నారని, భార్య కష్టం చేసి తనను పోషిస్తోందని, ప్రభుత్వ పరంగా ఆసరా కల్పించాలని వేడుకున్నారు.

అనుమతి లేకుండా గోదాం

కరీంనగర్‌ గ్రామీణ మండలం ఇరుకుల్ల గ్రామంలో అనుమతి లేకుండా నిర్మించిన పండ్ల గోదాంపైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన పలువురు ప్రజావాణిని ఆశ్రయించారు. పండ్ల లోడ్లతో వస్తున్న లారీలతో గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనుమతి లేని గోదాంను తొలగించాలని జువ్వాడి మారుతిరావు, కాశిపాక రాకేశ్, రమేశ్‌ మరికొందరు కలెక్టర్‌ను కోరారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉపాధి చూపండి

కొత్తపల్లిలోని తెలంగాణ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్థలంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించినందుకు సీడ్‌ కంపెనీలో కొన్నేళ్లుగా పని చేస్తున్న తాము ఉపాధి కోల్పోయామని, తమకు వైద్య కళాశాలలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా అవకాశం కల్పించాలని అధికారులను కోరారు. వారధిలో తమను ఎంపిక చేస్తున్నట్లు జాబితా సైతం తయారు చేశారు. కానీ సీడ్‌ కంపెనీకి, కళాశాలకు సంబంధంలేని వారిని కళాశాల యజమాన్యం నియమించుకుందని కార్మికులు వాపోయారు.  తమకు న్యాయం చేయాలని 30 మంది కార్మికులు అధికారులను అభ్యర్థించారు.

గురుకుల కళాశాలలో సీటు ఇప్పించండి

జ్వరం రావడంతో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో సీటు ఇప్పించాలని తల్లిని, సోదరున్ని వెంటపెట్టుకొని వచ్చి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు కండె రామ్‌చరణ్‌ అనే విద్యార్థి. మానకొండూర్‌ మండలం ఆన్నారానికి చెందిన రామ్‌చరణ్‌ తండ్రి గతంలోనే చనిపోయాడు. తల్లి కూలీ పని చేసి చదివిస్తోందని, 10వ తరగతి వరకూ మానకొండూర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో చదివానని తెలిపాడు. ఇంటర్‌ అడ్మిషన్‌కు సకాలంలో హాజరు  కాకపోవటంతో సీటు లేదంటున్నారని, తనకు సీటు వచ్చేలా కలెక్టర్‌ మేడం చర్యలు తీసుకోవాలని కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని