logo

మీసేవలో నగదు రహిత చెల్లింపులకు మిశ్రమ స్పందన

ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి.

Published : 02 Jul 2024 06:27 IST

నిరక్షరాస్యులు, వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు
ఈనాడు, పెద్దపల్లి

ఆదాయ ధ్రువీకరణ పత్రానికి క్యూఆర్‌ కోడ్‌తో రుసుము చెల్లిస్తూ..

ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి. కొందరు నిర్వాహకులు నిర్దేశిత ఛార్జీల కంటే అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో నగదు రహిత చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా మొత్తం 719 కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభించారు. రెవెన్యూ, ఇతరత్రా సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ విధానాన్ని అన్ని కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన వృద్ధులు, మహిళలు, స్మార్ట్‌ఫోన్‌ లేనివారు, క్యూఆర్‌ కోడ్‌ విధానం చరవాణీలో అందుబాటులో లేనివారు తంటాలు పడుతున్నారు.

క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌తో..

విద్యార్థులు, ఉద్యోగులు, చదువుకున్న వారికి ఈ విధానం సులభంగా ఉండటంతో వారు హర్షిస్తుండగా.. నిర్లక్ష్యరాస్యులు తమకు క్యూఆర్‌ కోడ్‌ అంటే ఏంటో తెలియదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఆదాయపు పన్ను ధ్రువీకరణ కోసం రూ.45లు మీసేవ కేంద్రం నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని అన్ని వివరాలతో నిర్వాహకులు మీసేవ పోర్టల్‌లో నమోదు చేశాక పేమెంట్‌ ఆప్షన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తేనే అభ్యర్థన స్వీకరణకు అర్హత పొందుతుంది. వాస్తవానికి ఈ విధానమెంతో పారదర్శకంగా ఉన్నప్పటికీ క్యూఆర్‌ కోడ్, నగదు రహిత సేవలు తెలియనివారికి ఇబ్బందులు వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవలే ఆధార్‌ బయోమెట్రిక్‌ వేలిముద్ర స్వీకరణకు సంబంధించి ఎల్‌-0 పరికరాల వినియోగం గడువు జూన్‌ నెలాఖరుకు ముగియడంతో కొత్తగా వీటి స్థానంలో ఎల్‌-1 బయోమెట్రిక్‌ పరికరాలను ఆయా కేంద్రాలకు పంపించారు. కొన్ని కేంద్రాల్లో ఎల్‌-1 పరికరాలు పనిచేయక పింఛనుదారుల వేలిముద్రలు పడకపోవడంతో వారికి డబ్బులు రావడం లేదు.


పింఛను కోసం వస్తే స్మార్ట్‌ఫోన్‌ అడుగుతున్నారు

ప్రభుత్వం మంజూరు చేసే వృద్ధాప్య పింఛను తీసుకుందామని మీసేవ కేంద్రానికి వెళ్తే స్మార్ట్‌ఫోన్‌ ఉందా? అని అడుగుతున్నారు. అది లేకుంటే ఇవ్వరా అని అడిగితే సాకులు చెబుతున్నారు. క్యూఆర్‌ కోడ్‌ అంటే తెలియదు. వేలిముద్రలు ఇద్దామంటే యంత్రాలు పనిచేయడం లేదని చెబుతున్నారు. పాతకాలం నాటి ఫోన్‌ మాత్రమే ఉంది. పింఛను లేకుంటే నిత్యావసర ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా వెసులుబాటును కల్పించాలి.

రాములు, రైతు, హనుమంతునిపేట, పెద్దపల్లి మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని