logo

పచ్చని సంకల్పం

చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది.

Updated : 02 Jul 2024 06:36 IST

ప్రతి ఒక్కరూ  మొక్క నాటాలి
భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలి
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, కార్పొరేషన్‌

చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. ఇంటి పరిసరాలు, ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన.. అని చూడకుండా ఎక్కడ అవకాశముంటే అక్కడ బాధ్యతగా మొక్క నాటితే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందవచ్చు.

‘వన మహోత్సవంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క నాటండి.. నేనూ మా అమ్మ స్మారకార్థం నాటాను.. తల్లుల పేరుతో మొక్క నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగడం సంతోషాన్నిస్తోంది.. చాలా మంది తల్లులను తీసుకెళ్లి నాటుతున్నారు.. తల్లులు చనిపోయిన వారూ ఫొటోలు తీసుకెళ్లి నాటుతున్నారు.. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.. ఈ ప్రచారం భూమాతను రక్షించడానికి సహాయపడుతుంది.’

మన్‌కీబాత్‌లో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు

‘పచ్చని చెట్టును నేను రా
పాలు గారే మనసు నాది రా
కొమ్మను నే రమ్మను
మీకు తోడుగా ఉండే అమ్మను
నీ పొలమును దున్నిన నాగలై
పంటను మోసిన బండినై
అమ్మమ్మ చేతిలో కవ్వము నై
తాతాయ్య చేతిలో కర్ర నై
అమ్మ పాటతో ఊగిన ఊయలై
ఆ పాడేటి పిల్లల గ్రో వినయ్‌’

కవి, జయరాజు

వాతావరణంపై ప్రభావం..

ఉమ్మడి జిల్లాలో అడవి విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతోంది. ప్రజావసరాలకు, భవన నిర్మాణాలకు  చెట్లు నరికి వేస్తున్నారు. వాతావరణంలో మార్పులతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. జిల్లాల విభజన సమయంలో రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కొంతశాతం వెళ్లిపోవడంతో కరీంనగర్‌ జిల్లాలో అడవులు తగ్గిపోయాయి.  పక్షులకు, జంతువులకు ఆహారం కూడా లభించని పరిస్థితి నెలకొంది.

లక్ష్యంతోపాటు సంరక్షణా ప్రధానం..

హరితహారంలో భాగంగా గత తొమ్మిది విడతలుగా కోట్లాది మొక్కలు నాటారు. ప్రభుత్వం కూడా మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యం ఆశించిన స్థాయిలో కనిపించలేదు. పైగా సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వంపై పడటంతో అది భారంగా మారింది. ఇళ్ల ముందు, రోడ్లపై నాటినవి కూడా రక్షించుకోలేకపోవడంతో పట్టణాలు, గ్రామాల్లో నిలువ నీడ లేకుండా పోయింది. ఎండాకాలంలో సూర్యుడు ప్రతాపం చూపించడానికి కారణం కూడా ఈ కాంక్రీట్‌ జంగిల్‌ అనే విషయాన్ని గుర్తించాలి.

ఆక్సిజన్‌ జనరేటర్లు

ఒక రకంగా చెప్పాలంటే చెట్లు ఆక్సిజన్‌ జనరేటర్లుగా అనవచ్చు. ఒక చెట్టు సుమారు సంవత్సరానికి 100-200 పౌండ్ల(45-90 కిలోగ్రాముల) ప్రాణవాయువు ఉత్పత్తి చేస్తుంది. సంవత్సరానికి నాలుగు లక్షల లీటర్ల ఆక్సిజన్‌తో సమానం.

ఒక వ్యక్తి రోజుకు 550 లీటర్ల ఆక్సిజన్‌ను  వినియోగిస్తాడు. చెట్టు ఏడాది పొడవునా నలుగురికి సరిపడా ఆక్సిజన్‌ అందించగలదు.

గుర్తుగా నాటాలి..

వర్షాకాలం రానే వచ్చింది. మళ్లీ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రజలు కూడా  పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో గుర్తుగా ఒక మొక్క నాటాలి. దానిని శ్రద్ధగా సంరక్షిస్తే చెట్టుగా ఎదిగిన తర్వాత ఫలాలు వస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఇది ఉద్యమంలా సాగి భావితరాలకు ఆదర్శం కావాలి.

మాను, మొక్క అంటే

పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై అడుగుల ఎత్తు పెరిగే దానిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు 200 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఏటా చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు, పండ్లు అందిస్తాయి. ఒకసారి కాయలు కాసి చనిపోయే వాటిని మొక్కలు అంటారు.

ఉపయోగాలు ఇలా..

  • ప్రకృతిలో మొక్కలను పరిశీలిస్తే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఔషధాల తయారీలో మొక్కలు ఉపయోగపడతాయి.
  • పారిశ్రామికంగా పరిశీలిస్తే పేపర్‌ తయారీ, పెన్సిల్, సబ్బులు, నూనె, రసాయన పదార్థాల తయారీకి దోహదపడతాయి.
  • ఇళ్ల నిర్మాణ సామగ్రి, అలంకరణ వస్తువుల
  • ఆహారం దుస్తులు, నివాసం అవసరాలను తీరుస్తున్నాయి.
  • రోజూ తినే వరి, గోధుమ, పప్పు  దినుసులు, నూనెలు, కూరగాయలు, పండ్లు,  వంటివి వివిధ రూపాల్లో లభిస్తాయి.
  • చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడుతాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలో, వ్యవసాయంలోను ప్రధాన పాత్ర పోషిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని