logo

ఉన్నత సమస్యలు

మెట్‌పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 02 Jul 2024 06:21 IST

న్యూస్‌టుడే, మెట్‌పల్లి

మెట్‌పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దూరాభారంతో పాటు వ్యయప్రయాసలు తప్పడం లేదు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు స్పందించి సమస్య పరిష్కారంపై దృష్టిసారించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెద్దాపూర్‌లో రేకుల షెడ్డులోనే గురుకుల పాఠశాల బోధన, వసతి

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ శివారులో 1983లో ఎస్సారెస్పీ క్వార్టర్లలో బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. పాఠశాలను ఇంటర్మీడియట్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయగా సుమారు 600 మంది వరకు చదువుతున్నారు. కాగా అప్పటి రేకుల షెడ్ల గదులు నేడు శిథిలావస్థకు చేరుకొన్నాయి. 2017లో నూతన భవనం కోసం రూ.4.25 కోట్లు మంజూరయ్యాయి. ఆగుతూ.. సాగుతూ 24 గదులతో నిర్మాణం పూర్తయింది. విద్యుత్తు సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలకు నీటి సౌకర్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. వీటికోసం ఇంకా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అవసరముంటుందని అంచనా వేశారు. భవనం అందుబాటులోకి రాక రేకుల షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గదులు సరిపోక కొన్ని తరగతుల్లో వసతి, బోధన ఒకే గదిలో కొనసాగుతోంది. వర్షం వస్తే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. పనులు చివరి దశకు చేరుకోగా మిగిలిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి భవనం అప్పగిస్తే ఇక్కడి సమస్యలు తీరుతాయని, ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నిధులు సమకూరక

మెట్‌పల్లి పట్టణానికి 2008-09లో డిగ్రీ కళాశాల మంజూరవగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలోనే ప్రారంభించారు. ఒకే భవనంలో ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలు షిప్టు పద్ధతిలో నడిచాయి. వెంకట్రావుపేట శివారులో గతంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కోసం నిర్మించిన భవనంలోకి 2016లో డిగ్రీ కళాశాలను తరలించారు. పలు తరగతి గదుల్లోని గోడలు, స్లాబుకు ప్లాస్టరింగ్, సిమెంట్‌ ఫ్లోరింగ్‌ లేదు. కిటికీలకు తలుపులు, వెంటిలేటర్లు లేక వర్షాకాలం గదులు ఉరవడం, వర్షం నీరు లోనికి రావడం జరుగుతోంది. ప్రహరీ లేక భద్రత కరవైంది. భవనం శిఖం భూమిలో ఉండడంతో కళాశాల పేరిట మార్పిడి చేసేందుకు యత్నించినా ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిధులు, రాష్ట్రీయ ఉచ్చతార్‌ శిక్షా అభియాన్‌ నిధులు, ఫర్నీచర్, ల్యాబ్‌ ఇతర సదుపాయాల కల్పనకు మంజూరయ్యే నిధులు రావడం లేదని తెలుస్తోంది. కళాశాలకు సొంత భవనం నిర్మించి వసతులు కల్పిస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శిథిల గదిలో తరగతుల నిర్వహణ

ఉరుస్తున్న గదుల్లోనే..

మెట్‌పల్లి పట్టణంలో 1981లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొన్ని గదులను కేటాయించి ఒక పూట మాత్రమే బోధన ప్రారంభించారు. 1996-97లో జూనియర్‌ కళాశాల కోసం వెంకట్రావుపేట శివారులో భవనం నిర్మించినా పూర్తికాక అక్కడికి తరలించలేదు. ఏళ్ల కిందట నిర్మించిన గదులు శిథిలావస్థకు చేరడంతో 2018లో జీప్లస్‌ 2 పద్ధతిలో భవనం నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరయ్యాయి. ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. చేపట్టిన పనులకు దశల వారీగా విడుదల చేయాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తగా మూత్రశాలలు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. డెస్క్‌ బల్లలు సైతం లేవు. కొన్ని తరగతులు ఉరుస్తున్న గదుల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 400 మంది విద్యార్థులు చదువుతుండగా వసతులు లేక చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపితే ఇబ్బందులు తొలగి ప్రయోజనం చేకూరుతుందని విద్యార్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని