logo

ప్రజావాణి వినతులు పరిష్కరించాలి

ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు.

Published : 02 Jul 2024 06:19 IST

సమస్యలు వింటున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించే వీలున్నవాటిపై వెంటనే చర్య తీసుకుని వీలుకాని పక్షంలో సంబంధిత వ్యక్తులకు కారణం తెలపాలన్నారు. ఈ సందర్భంగా 44 వినతులు రాగా వాటిని పరిశీలించి పరష్కరించాల్సిందిగా సంబంధిత శాఖలకు రాశారు. అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, ఎం.రఘువరణ్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు పి.మధుసూదన్, ఆనంద్‌కుమార్, ఎన్‌.శ్రీనివాస్,కలెక్టరేట్‌ ఏవో పి.హన్మంతరావు తదితరులున్నారు.

ఫిజికల్‌ డైరెక్టర్‌ బదిలీ రద్దు చేయాలని..

మల్యాల మండలం తక్కళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ గంగాసాగర్‌కు పదోన్నతి ఇచ్చి ఫిజికల్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారని అతని బదిలీ రద్దు చేయాలని గ్రామానికి చెందిన యువకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. గంగాసాగర్‌ పాఠశాల విద్యార్థులకే కాకుండా పరిసర గ్రామాల యువతి, యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు 42 మంది పోలీసు, ఆర్మీలో ఉద్యోగాలు పొందారని తక్కళ్లపల్లి పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టు ఉందని అతన్ని తమ గ్రామంలో నియమించాలని కోరారు.

ప్రైవేటు పాఠశాలలపై చర్యలకు

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు కోరారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేశ్‌ ఆధ్వర్యంలో ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఫీజు తీసుకోవడమే కాకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా నడుపుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ప్రైవేటు పాఠశాలలో నాణ్యత లేని ఆహార వస్తువులు ఉన్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారని ఆ పాఠశాలపై చర్య తీసుకోవాలని ఎన్‌ఎస్‌యుఐ నాయకులు కోరారు. పట్టణ అధ్యక్షుడు చిట్ల భార్గవ్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు ప్రజావాణితో ఫిర్యాదు చేశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను పిల్లలకు వడ్డిస్తున్నారని పాఠశాలపై చర్య తీసుకుని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని వారు కోరారు.

మద్యం విక్రయాలు నిలిపి వేయాలి

కోరుట్ల మండలం పైడిమడుగులో అక్రమ మద్యం విక్రయాలను నిలిపివేయాలని గ్రామానికి చెందిన అంబేడ్కర్, జై భీం యూత్‌ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గొలుసు దుకాణాలతో పాటు పర్మిట్‌రూంలో మద్యం విక్రయాల వల్ల గ్రామంలో యువకులు మద్యం, మత్తుకు అలవాటు పడుతున్నారని తరచూ గొడవలు జరుగుతున్నాయని వెంటనే అక్రమ మద్య విక్రయాలను నిలిపివేయాలని కోరారు.

ఫీజు బకాయిల విడుదలకు..

విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి నాయకులు కోరారు. జిల్లా కార్యదర్శి అక్రం మాలిక్, జిల్లా అధ్యక్షుడు సమీర్‌ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కోర్సు పూర్తయినప్పటికీ కళాశాలల యజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఇబ్బందిగా మారుతుందని వారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని