logo

వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?

ఉమ్మడి జిల్లాలో రాజీవ్‌ రహదారిపై రెండు టోల్‌ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి.

Published : 02 Jul 2024 06:02 IST

రాజీవ్‌ రహదారిపై పలుచోట్ల గుంతలు
ఈనాడు, కరీంనగర్‌

పెద్దకల్వల వద్ద రాజీవ్‌ రహదారిపై గుంత

ఉమ్మడి జిల్లాలో రాజీవ్‌ రహదారిపై రెండు టోల్‌ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. వేగంగా వెళ్లే వాహనదారులు గమనించక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వీటికి మరమ్మతు చేసినప్పటికీ ప్యాచ్‌ వర్క్‌ ఎగుడుదిగుడుగా ఉండటంతో అవి వేగ నిరోధకాలను తలపిస్తున్నాయి.

పర్యవేక్షణ పెరిగితేనే..

రాజీవ్‌ రహదారిపై తిమ్మాపూర్‌ మండలం రేణికుంటతోపాటు పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ వద్ద టోల్‌ ప్లాజాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15 ఏళ్ల కిందట ఈ మార్గాన్ని విస్తరించి నిర్మాణం చేపట్టినందుకుగానూ ప్రతి 60 కి.మీ దూరంలో ఒక టోల్‌ప్లాజాను పెట్టి ఈ మార్గంలో వెళ్లే నాలుగు, ఆరు, ఎనిమిది చక్రాల వాహనాల నుంచి టోల్‌ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పర్యవేక్షణలో పలు ఏజెన్సీలు వీటిని నడుపుతున్నాయి. కాగా ఈ మార్గం ఏర్పాటు సమయం నుంచి ఈ రోడ్డుపై పలురకాల వసతుల కల్పన కూడా వీరే చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా రహదారిపై ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేని పరిస్థితులు ఉండాలి. టోల్‌ అనేది మనం పొందుతున్న సేవలకు చెల్లిస్తున్న పరోక్ష పన్ను. నాణ్యమైన గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా సాగేందుకు చెల్లించే రుసుము. ఇలా ఉమ్మడి జిల్లాలో వాహనదారులు ఏళ్లతరబడి రుసుము చెల్లిస్తున్నా.. అందుకు తగిన వసతులందడం లేదనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ పెరిగేలా.. వసతులు మెరుగయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు తగిన శ్రద్ధను కనబర్చాల్సిన అవసరముంది.


రోడ్లు సరిగ్గా నిర్వహించలేనప్పుడు టోల్‌ వసూలు చేయొద్దు.. గుంతలతో కూడిన రహదారులు.. టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ.. ఏ మాత్రం  ఆమోదయోగ్యం కాదు.

ఇటీవల కేంద్ర రహదారి, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నేషనల్‌ హైవే అధికారులు, టోల్‌ ఏజెన్సీలతో అన్న మాటలివి.


ఉమ్మడి జిల్లాలో టోల్‌ప్లాజాలు : రేణికుంట, తిమ్మాపూర్‌ మండలం (కరీంనగర్‌ జిల్లా), బసంత్‌నగర్, పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా)


నిత్యం ఈ రెండు టోల్‌ గేట్ల వద్ద టోల్‌ కట్టే వాహనాలు : 11 వేల నుంచి 12 వేలు

రెండు టోల్‌ప్లాజాల్లో నిత్యం వసూలవుతున్న రుసుము : రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు


ఇవన్నీ అరకొరగానే..!

  • చాలా గ్రామాల వద్ద ప్రమాద హెచ్చరికలు సరిగా లేవు.
  • రాత్రి వేళ ఆయా గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన హెమాస్ట్‌ లైట్లు చాలా చోట్ల వెలగడం లేదు. కొన్నిచోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది.
  • విభాగినిపై మొక్కల పెంపకం విషయంలో దారిపొడువునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. మొక్కలు లేక గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగాయి.
  • రహదారి పక్కన చాలాచోట్ల గతంలో కంచెలను ఏర్పాటు చేశారు. చాలాచోట్ల ఇవి మాయమైనా తిరిగి ఏర్పాటు చేయలేదు.
  • తారు రోడ్డుకు ఆనుకుని సైడ్‌బర్మ్‌లో గుంతలను పూడ్చకపోవడంతో వర్షం పడినప్పుడు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
  • మార్గమధ్యలో కూడా తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సేవలు, అగ్నిమాపక నియంత్రణ సౌకర్యాలు మరిన్ని పెంచాలి.
  • 100 మీటర్ల కన్నా ఎక్కువగా వరుస ఉంటే టోల్‌ప్లాజా వద్ద రుసుము చెల్లించవద్దనే నిబంధన ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.
  • ప్లాజాకు 20 కి.మీ.ల పరిధి వాహనాలకు టోల్‌ తీసుకోవద్దనే నిబంధన కొందరికే వర్తిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని