logo

నియామకాలపై నీలినీడలు

జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్‌)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్‌ కోర్సును ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు.

Published : 02 Jul 2024 05:55 IST

గడువు తీరిన పొరుగుసేవల సంస్థ నుంచి ఉత్తర్వులు
ఎస్సీ అధ్యయన కేంద్రంలో ఉద్యోగాలకు పైరవీలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

సిరిసిల్లలోని ఎస్సీ అధ్యయన కేంద్రం

జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్‌)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్‌ కోర్సును ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. దీంతోపాటు మూడు నెలల ఫౌండేషన్‌ కోర్సును డేస్కాలర్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అధ్యయన కేంద్రంలో మొత్తం 152 మంది శిక్షణ పొందుతున్నారు. వీరికి కోర్సు నిర్వహణపై ప్రణాళిక, అధ్యాపకుల ఎంపిక, వసతి తదితరాలను చూసుకునేందుకు సిబ్బంది అవసరం. వీరిని కలెక్టర్‌ అనుమతితో జిల్లాలోని పొరుగుసేవల సంస్థ ద్వారా నియమించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో జాప్యం జరగడంతో ఎస్సీ సంక్షేమశాఖలోని ఆరుగురు ఉద్యోగులను ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌ పద్ధతిలో ఇక్కడ నియమించారు. ఒక డైరెక్టర్, మేనేజర్, అకౌంటెంట్, శిక్షణ సమన్వయకర్త, కంప్యూటర్‌ ఆపరేటర్, ముగ్గురు ఆఫీస్‌ అస్టెంట్లు, అటెండరు అవసరం. డైరెక్టర్‌ నియామకానికి అధ్యయన కేంద్రం ప్రారంభానికి ముందే ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ అర్హత ఉన్న ఈ పోస్టుకు ముప్పై మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మెరిట్‌ జాబితా తీసి, ముఖాముఖి నిర్వహించేలోగా ఎన్నికల కోడ్‌ వచ్చింది. దీంతో ఈ ప్రక్రియను నిలిపివేశారు. మిగతా పోస్టులకు స్థాయిని బట్టి డిగ్రీ మొదలుకొని ఏడో తరగతి వరకు అర్హతలుగా పేర్కొన్నారు. ఈ నియామకాల్లోనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా వివిధ ప్రాంతాల్లో ఎస్సీ సంక్షేమశాఖలో పని చేస్తున్న ఉద్యోగులను డిప్యూటేషన్‌పై అధ్యయన కేంద్రంలో నియమించారు.

ఏం జరిగిందంటే...

అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ మినహా మిగతా ఆరు పోస్టుల నియామకాలకు ముందుగా పేపరు ప్రకటన ఇవ్వాలి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ప్రతిభ ఆధారంగా ముఖాముఖి నిర్వహించాలి. దీనిలో ఎంపికైన వారిని ఉద్యోగ నియామకాలకు జిల్లా ఉపాధి కల్పన అధికారి ద్వారా పొరుగుసేవల సంస్థకు అప్పగించాలి. వారు కలెక్టర్‌ అనుమతితో నియామక పత్రాలు ఇవ్వాలి. కాగా ఈ పోస్టుల నియామకాలకు పేపరు ప్రకటన ఇవ్వకుండానే సురక్ష (పొరుగు సేవలు) సంస్థ ద్వారా నియామక పత్రాలు ఇచ్చారు. వీటిని తీసుకున్న అభ్యర్థులు అధ్యయన కేంద్రానికి వెళ్లారు. నియామక పత్రాలపై మార్చి 14 అని ఉంది. కాగా మార్చి 14కే జిల్లాలో సురక్ష సంస్థ గడువు ముగిసింది. అదే రోజు కొత్తగా సాధన సంస్థకు పొరుగుసేవల ఉద్యోగ నియామకాల బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ సేవలు అదే రోజు నుంచి అమలులోకి వచ్చాయి. పాత సంస్థ అదే రోజు నియామక పత్రాలు ఇవ్వడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యయన కేంద్రంలో ఉద్యోగాల నియామకాలకు కలెక్టరేట్‌లోనే పెద్దఎత్తున పైరవీలు జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పాత కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టరేట్‌లో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ కూడా చేయించినట్లు తెలిసింది. ఇంతలోనే ఆయన బదిలీపై వెళ్లడంతో విచారణ వివరాలేవీ బయటకు రాలేదు. మరోవైపు మూడు నెలలు పూర్తయినా అధ్యయన కేంద్రంలో నియామకాలు జరగలేదు.

నిబంధనలు పాటించలేదు

ఉద్యోగుల నియామకాల్లో పాత పొరుగుసేవల సంస్థ సరైన నిబంధనలు పాటించలేదు. ఈ విషయం పాత కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో జాప్యం జరిగింది. అధ్యయన కేంద్రంలో ఉద్యోగుల నియామకంపై కొత్తగా వచ్చిన కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.-

వినోద్, ఈడీ, జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని