logo

ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు

కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి.

Published : 02 Jul 2024 05:54 IST

కొత్త చట్టాల అమలు ప్రారంభం
ఈనాడు, కరీంనగర్‌

కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదవలేదు. జగిత్యాల జిల్లాలో రెండు కేసులయ్యాయి. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 16 కేసులయ్యాయి. మొదటి రోజు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ, ఎస్సైలు ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలు, చట్టంలో ఉన్న విధివిధానాలపై అవగాహన కల్పించుకున్నారు. కేసుల నమోదు, సెక్షన్‌ల నమోదు విషయంలో ఆచితూచి వ్యవహరించినట్లు తెలిసింది. స్వదేశీ న్యాయవ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటిని అమలులోకి తెచ్చింది. గతేడాది పార్లమెంటు ఆమోదించడంతో బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికినట్లైంది. ఇప్పటి వరకున్న ఐపీసీ (భారత శిక్షా స్మృతి), సీఆర్‌పీసీ (నేర శిక్షాస్మృతి), ఎవిడెన్స్‌ యాక్ట్‌ (భారత సాక్ష్యాధార చట్టం) కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత), బీఎన్‌ఎస్‌ఎస్‌ (భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత), బీఎస్‌ఏ (భారతీయ సాక్ష్య అధినియమ్‌) అమల్లోకి వచ్చాయి.

మరింత అధ్యయనం

కొత్త చట్టాలపై అటు పోలీసులు, ఇటు న్యాయ వ్యవస్థకు సంబంధించిన వారంతా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. బాధితులకు సత్వర సేవలందడంతోపాటు కొన్ని విధానాలు మేలు చేసేవిధంగా ఉన్నాయనే భావన పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకే ఉన్న జీరో ఎఫ్‌ఐఆర్‌ను మరింత పక్కాగా కొనసాగించడంతోపాటు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్‌లాంటి సౌకర్యాలు ఇక మీదట ఉమ్మడి జిల్లాలో పోలీసు స్టేషన్‌లలో  ఈ కొత్త విధానాలతో అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావడంపై సానుకూల స్పందన ఉంది. సెక్షన్ల కుదింపు వల్ల గందరగోళ పరిస్థితికి తెరదించినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని