logo

కొండంత అభిమానం!

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కొండగట్టు అంజన్న దర్శనానికి రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

Updated : 30 Jun 2024 06:38 IST

పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం

 పవన్‌కల్యాణ్‌ రాకతో అభిమానుల సందడి

కరీంనగర్‌ (ఈనాడు), మల్యాల (న్యూస్‌టుడే) : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కొండగట్టు అంజన్న దర్శనానికి రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. తమ అభిమాన కథానాయకుడు రావడంతో ఆయనను చూసేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి జనం కొండగట్టుకు తరలి వచ్చారు. రోడ్డు మార్గంలో ఆలయానికి వస్తుండటంతో పలు చోట్ల ఆయన్ని ఆపేందుకు ఆయన అభిమాన సంఘాలు ప్రయత్నించాయి. తొలుత తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. తరువాత కరీంనగర్‌ మీదుగా కొండగట్టు క్షేత్రానికి పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు.

పవన్‌కు అర్చకుల పూర్ణకుంభ స్వాగతం

భారీ వాహన శ్రేణితో ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం అతిథి గృహం వద్ద కలెక్టర్‌ సత్యప్రసాద్, ఎస్పీ అరుణ్‌కుమార్‌లు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆలయానికి ఆహ్వానించారు. తరువాత ఆయన పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను పవన్‌కు వివరించారు. ఆయనను చూసేందుకు వచ్చిన వారితో ఆలయం వద్ద సందడి నెలకొంది. అభిమానులు ఆయనని చూస్తూ కేరింతలు కొట్టారు. పూజ అనంతరం బయటకు వచ్చిన ఆయన వాహనం లోపలి నుంచి పైకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన దాదాపు గంట సేపు ఉన్నారు. అభిమానులు పెద్దఎత్తున రావడంతో సందట్లో సడేమియా అన్నట్లు కొందరు దొంగలు తమ చేతి వాటాన్ని చూపించారు. ఒకరి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశారు. మరో వ్యక్తి పర్సు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని