logo

ఆదర్శం.. ఈ సర్కారు బడి

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్‌(పూర్వ బాలికల) ఉన్నత పాఠశాల నిలుస్తోంది.

Updated : 30 Jun 2024 06:39 IST

ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు.. మెరుగైన వసతులు
ధర్మపురి జడ్పీ ఉన్నత పాఠశాలలో వెల్లువలా అడ్మిషన్లు
న్యూస్‌టుడే, ధర్మపురి

ధర్మపురి జడ్పీ ఉన్నత పాఠశాల

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్‌(పూర్వ బాలికల) ఉన్నత పాఠశాల నిలుస్తోంది. తక్కువ మంది విద్యార్థులతో వెలవెలబోతున్న సర్కారు బడులు ఉన్న కాలంలో కూడా ఆ పాఠశాలలో అడ్మిషన్ల వెల్లువతో సందడి నెలకొంది. ఎస్సెస్సీలో మంచి ఫలితాలు, ఉత్తమ విద్యాబోధన, పేద విద్యార్థులకు అండగా నిలవడం, మౌలిక వసతులు తదితర విషయాల్లో మెరుగ్గా ఉండటంతో తమ పిల్లల్ని చేర్పించేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఆసక్తి, ఉత్సాహం చూపుతున్నారు.

విద్యార్థుల సంఖ్య 405..

గత విద్యాసంవత్సరం 369 మంది విద్యార్థులు ఉండగా.. పదో తరగతి విద్యార్థులు పోను ఈ ఏడాది నూతన ప్రవేశాలతో ఆ సంఖ్య 405కు చేరింది. ఈ పాఠశాలలో ఇంకా ప్రవేశాలు జరుగుతుండటంతో సందడి నెలకొంది. ధర్మపురి మండలంలోని 9 గ్రామాల విద్యార్థులతో పాటు, వెల్గటూర్, బుగ్గారం, ధర్మారం, ఎండపల్లి మండలాల విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో అడ్మిషన్లు పొందడం గమనార్హం. బడి ఆవరణలో పచ్చని మొక్కలతో పాటు విశాలమైన ఆటస్థలం, కంప్యూటర్‌ ల్యాబ్, గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని అత్యుత్తమ పాఠశాలలో ఒకటైనా ఈ స్కూల్‌లో చాలా ఏళ్లుగా పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో సాయిప్రదీప్తి 9.8, అయ్యోరి అమూల్య 9.7 గ్రేడ్‌ పాయింట్లు పొందారు. వీరితో పాటు 9.00 పైగా గ్రేడింగు పాయింట్లతో పది మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను ఆకర్షిండటానికి, పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులు దాతల సహాయంతో ప్రతీ సంవత్సరం నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారిలో సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడిన వారు ఉన్నారు. క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణిస్తున్నారు. గత ఏడాది అథ్లెటిక్స్‌లో, కబడ్డీలో ఇద్దరు రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు గెలుచుకున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తూ.. తాగునీటి వసతులును కల్పించడంతో పాటు, మిగతా సమస్యలను పరిష్కరించారు.

అందరి సహకారంతోనే..

ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 405కి చేరింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి పరుస్తున్నాం. విద్యార్థులపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ చర్యలు తీసుకుంటున్నాం.

 కొలిచాల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీ ఉన్నత పాఠశాల, ధర్మపురి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు